Devasthanam Employees : జీతం అడిగితే.. విషం తాగి చావమన్నారు!
ABN , Publish Date - Feb 09 , 2025 | 05:24 AM
వ్యక్తిగత కారణాలతో లేదా ఆనారోగ్య సమస్యలతో ఎవరైనా సెలవు తీసుకుంటే.. తిరిగి విధుల్లో చేరిన తర్వాత జీతం ఎప్పుడు వస్తుందో..

దేవదాయ శాఖ ఫైనాన్స్ విభాగం అధికారులపై కమిషనర్‌కు ఉద్యోగి ఫిర్యాదు
అమరావతి, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): దేవదాయ శాఖలో ఉద్యోగులు సెలవు పెట్టాలంటే బెంబేలెత్తిపోతున్నారు. వ్యక్తిగత కారణాలతో లేదా ఆనారోగ్య సమస్యలతో ఎవరైనా సెలవు తీసుకుంటే.. తిరిగి విధుల్లో చేరిన తర్వాత జీతం ఎప్పుడు వస్తుందో.. అసలు జీతం ఇస్తారో లేదో చెప్పలేని పరిస్థితి నెలకొంది. శాఖ ప్రధాన కార్యాలయంలోని ఫైనాన్స్, ఎస్టాబ్లిష్మెంట్ విభాగాల్లోని పలువురు అధికారుల తీరు వివాదంగా మారింది. తాజాగా గత కొన్ని నెలలుగా తనకు జీతాన్ని ఎందుకు నిలిపివేశారని అడినందుకు.. ‘జీతం ఇవ్వం.. అవసరమైతే విషం తాగి చావు..!’ అని ఫైనాన్స్ విభాగం అధికారులు దారుణంగా మాట్లాడిన వ్యవహారం సంచలనంగా మారింది. ప్రస్తుతం తపాలా సెక్షన్‌లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ ఒకరు పలు కారణాలతో సస్పెండ్ అయ్యారు. గత ఏడాది మేలో మళ్లీ విధుల్లో చేరారు. ఉన్నతాధికారులు ఆయనకు తపాలా సెక్షన్‌లో పోస్టింగ్ ఇచ్చారు. రెగ్యులర్ ఉద్యోగి అయిన ఆయనకు పోస్టింగ్ ఇచ్చే సమయంలో అతని హాజరును ప్రతి నెలా ఫైనాన్స్ విభాగానికి పంపించాలని పొందుపరిచారు. నిబంధనల ప్రకారం రెగ్యులర్ ఉద్యోగులకు పోస్టింగ్ అర్డర్‌లో ఇలాంటి రూల్ పెట్టకూడదు. కానీ ఎస్టాబ్లిష్మెంట్ విభాగంలోని ఓ మహిళా ఉద్యోగి పోస్టింగ్ అర్డర్‌లో ఈ నిబంధన పెట్టారు. తపాలా సెక్షన్ అధికారులు ఈ నిబంధన చూసుకోకపోవడంతో ప్రతి నెలా అతని హాజరును ధృవీకరిస్తూ ఫైనాన్స్ విభాగానికి లేఖలు పంపలేదు. దీంతో గత మే నుంచి ఈ ఏడాది జనవరి వరకు సదరు ఉద్యోగికి జీతం నిలిచిపోయింది. అతను వారం క్రితం ఫైనాన్స్ విభాగంలోని కీలక అధికారి వద్దకు వెళ్లి తన జీతం ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. అధికారులు ఉన్న విషయాన్ని చెప్పకుండా.. జీతం ఇవ్వలేమని దురుసుగా సమాధానం చెప్పారు. ‘అవసరమైతే వెళ్లి విషం తాగి చచ్చిపో..’ అంటూ మాట్లాడారని ఆ ఉద్యోగి కమిషనర్‌కు లేఖ రాశారు.