Share News

AB Venkateswara Rao: కోడికత్తి శ్రీనుతో ఏబీ వెంకటేశ్వరరావు భేటీ.. వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Apr 13 , 2025 | 05:23 PM

AB Venkateswara Rao: వైఎస్ జగన్ బాధితులకు న్యాయం చేయడానికి తన పోరాటం మొదలైందని రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. అందులోభాగంగా తొలి ప్రయత్నంగా కోడి కత్తి శ్రీనుకు న్యాయం చేయడానికి తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఆ క్రమంలో ముమ్మడివరంలోని కోడికత్తి శ్రీనును అతడి నివాసంలో ఆయన కలిశారు.

AB Venkateswara Rao: కోడికత్తి శ్రీనుతో ఏబీ వెంకటేశ్వరరావు భేటీ.. వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
Retd IPS AB Venkateswara Rao

అమలాపురం, ఏప్రిల్ 14: కోడి కత్తి శ్రీను చేసిన పొరపాటుతో మూడు రేట్లకు మించిన శిక్ష అతడు అనుభవించాడని రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు వెల్లడించారు. ఈ కేసులో బెయిల్‌పై అతడు ఉపాధి కోసం ఏ పనికి వెళ్లలేని పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు. దీంతో ఆ కుర్రాడి భవిష్యత్తు నాశనం అయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయినా జాలి లేకుండా ఈ కేసులో ఇంకా కేసులు వేస్తున్నారంటూ వైఎస్ జగన్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ముమ్మిడివరంలో కోడి కత్తి శ్రీనుతోపాటు అతడి కుటుంబ సభ్యులను ఏబీ వెంకటేశ్వరరావు పరామర్శించారు.

ఈ సందర్భంగా కోడి కత్తి శ్రీనును ఆయన పలు విషయాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏబీ వెంకటేశ్వరరావు విలేకర్లతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ బాధితులకు న్యాయం చేయడానికి తన పోరాటం మొదలైందన్నారు. అందులోభాగంగా తొలి ప్రయత్నంగా కోడి కత్తి శ్రీనుకు న్యాయం చేయడానికి తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ కోడి కత్తి కేసులో ఎన్నో అబద్ధాలు రాశారని ఆయన మండిపడ్డారు. ఛార్జ్ షీట్ వేసి ఆరేళ్ళు అయిందని గుర్తు చేశారు.


ఇంకా ఈ కేసు విచారణ పూర్తి కాలేదన్నారు. విచారణలో భాగంగా కేసులపై కేసులు వేసి ఈ కేసు ముందుకు సాగకుండా అడ్డుకొంటున్నాడంటూ వైఎస్ జగన్‌పై ఏబీ వెంకటేశ్వరరావు నిప్పులు చెరిగారు. ఈ కేసును విజయవాడ నుంచి విశాఖపట్నానికి బదిలీ చేశారన్నారు. ఇప్పటికీ స్టే కారణంగా ఈ కేసులో వాదనలు లేవని పేర్కొన్నారు. స్టే వలన ఇప్పటికీ కోడి కత్తి అసలు కేసు విచారణ మొదలవలేదన్నారు. ఈ కేసులో నేరం రుజువు కావాలి.. లేకుంటే ఈ కేసు కొట్టేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.


2019 అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టారు. అయితే అక్రమాస్తుల కేసులో విచారణ కోసం ఆయన హైదరాబాద్‌లోని కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అందుకోసం హైదరాబాద్ వెళ్లేందుకు ఆయన విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అదే సమయంలో ఎయిర్‌పోర్ట్‌లోని క్యాంటిన్‌లో పని చేస్తున్న శ్రీను.. విమానం కోసం ఎదురు చూస్తున్న వైఎస్ జగన్‌తో సెల్పీ దిగాలని కోరాడు. అందుకు వైఎస్ జగన్ ఓకే అనడంతో.. సెల్ఫీ దిగే క్రమంలో కోడికత్తితో వైఎస్ జగన్‌కు చిన్న గాయం చేశాడు. దీంతో తనపై హత్యాయత్నం జరిగిందంటూ వైఎస్ జగన్ నానా యాగీ చేశాడు.


అంతేకాకుండా.. అక్కడే ఉన్న పోలీసులు.. వైఎస్ జగన్‌కు ప్రాథమిక చికిత్స కోసం విశాఖపట్నంలోని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నాలను వైఎస్ జగన్ అడ్డుకొన్నారు. తనకు ఏపీ ప్రభుత్వంపై నమ్మకం లేదంటూ.. విమానంలో హైదరాబాద్ వచ్చి.. అక్కడ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇక వైఎస్ వివేకానందరెడ్డి హత్య సమయంలో సైతం తనపైనే కాదు.. తన చిన్నాన్నపైన సైతం నాటి చంద్రబాబు ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించి అంతమోదించాలని ప్రయత్నిస్తుందంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అలాగే కోడి కత్తి దాడి కేసు విచారణ ఎన్ఐఏ చేపట్టంది. విచారణలో భాగంగా కోడికత్తి శ్రీనును జైలుకు తరలించారు. అతడికి బెయిల్ సైతం రాలేదు.


మరోవైపు వైఎస్ జగన్.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి.. ఈ కేసు విచారణకు హాజరు కాలేదు. దీంతో కొన్ని ఏళ్ల పాటు కోడికత్తి శ్రీను జైల్లో మగ్గిపోయారు. ఇంకోవైపు.. తాము వృద్ధులమయ్యామని తమకు అసరాగా ఉండేందుకు జైల్లో ఉన్న తమ కుమారుడు కోడికత్తి శ్రీనును బెయిల్‌పై విడిపించాలంటూ అతడి తల్లిదండ్రులు స్వయంగా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. కానీ వారికి నాటి సీఎం వైఎస్ జగన్ అపాయింట్‌మెంట్ ఇవ్వక పోవడం గమనార్హం. ఇక ఈ కేసులో కోడి కత్తి శ్రీను తరఫున వారి లాయర్ సలీం పోరాడి.. అతడిని బెయిల్‌పై విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఈ వార్తలు కూడా చదవండి..

Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం..

TTD Board chairman: భూమనపై టీటీడీ బోర్డ్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు

For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 13 , 2025 | 06:22 PM