Share News

సినీఫక్కీలో ‘కడుపు’ నాటకం

ABN , Publish Date - Apr 05 , 2025 | 12:52 AM

చాలాకాలంగా పిల్లలు లేని ఒక మహిళ తన భర్త బాధ చూడలేక సినీ ఫక్కీలో గర్భం దాల్చినట్టు నాటకమాడింది. ఆ నాటకానికి పుల్‌ స్టాప్‌ పెట్టేందుకు మరో నాటకమాడి అడ్డంగా బుక్కైంది. ఈ సంఘటన రాజమహేంద్రవరంలో ప్రారంభమై కాకినాడలో ముగిసింది.

సినీఫక్కీలో ‘కడుపు’ నాటకం

  • పిల్లల్లేక.. లేని గర్భం ఉన్నట్టు భర్తను నమ్మించిన భార్య

  • అర్ధరాత్రి రామహేంద్రవరంలో అదృశ్యం- కాకినాడలో ప్రత్యక్షం

  • నిజం నిగ్గు తేల్చిన పోలీసులు

రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్‌ 4(ఆంధ్ర జ్యోతి): చాలాకాలంగా పిల్లలు లేని ఒక మహిళ తన భర్త బాధ చూడలేక సినీ ఫక్కీలో గర్భం దాల్చినట్టు నాటకమాడింది. ఆ నాటకానికి పుల్‌ స్టాప్‌ పెట్టేందుకు మరో నాటకమాడి అడ్డంగా బుక్కైంది. ఈ సంఘటన రాజమహేంద్రవరంలో ప్రారంభమై కాకినాడలో ముగిసింది. రాజమహేంద్రవరం త్రీటౌన్‌ పోలీసుల కథనం ప్రకారం.. ఏఎస్‌ఆర్‌ జిల్లా దేవిపట్నం మండలం ఇందుకూరుపేటకు చెందిన కొప్పిశెట్టి లోవరాజు కొప్పిశెట్టి సంధ్యారాణి భార్యభర్తలు. వీరికి వివాహమై 27 ఏళ్లయ్యింది. వారికి ఎంతకి పిల్లలు పుట్టకపోవడంతో కుటుంబీకులు చాలా బాధపడేవారు. చుట్టుపక్కల వారు కూడా గర్భం రావడంలేదని గుసగుసలాడుకోవడంతో ఆ బాధలు తట్టుకోలేక తనకు గర్భం వచ్చినట్టు కుటుంబ సభ్యులను నమ్మించింది. అప్పటి నుంచి భర్తతో నెలనెలా రాజమహేంద్రవరం వచ్చి జయ కిడ్నీకేర్‌ ఆసుపత్రికి రావడం, లోపలికి వెళ్లి గర్భం రాకపోవడానికి కారణాలను డాక్టర్‌ను అడిగి రావడం, గర్భం వచ్చి బాగానే ఉన్నట్టు భర్తను నమ్మించేది ఈ క్రమంలో గత నెల 31న ఆసుపత్రికి వచ్చిన సంధ్యారాణి ఆసుపత్రిలోకి వెళ్లి బయటకు వచ్చి తనకు ఈనెల 3న డెలివరీ డేట్‌ ఇచ్చారని నమ్మించి ఇంటికి వెళ్లిపోయింది. ఈనెల 3న ఉదయం 11గంటలకు భర్తతో కలిసి జయ కిడ్ని కేర్‌కు వచ్చి ఇక్కడ డెలివరీ నాటకం ఆడితే తెలిసిపోతుందని, భర్తకు కనిపించకుం డా ఆసుపత్రి బయటకు వచ్చి తిరిగి ఇందుకూరుపేట వెళ్లి ఆటోలో కాకినాడ వెళ్లిపోయింది. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు తనను ఎత్తుకుపోయారని, తనకు కవల పిల్లలు పుట్టారని, ఎవరో ఎత్తుకుపోయారని భర్తకు ఫోను చేసి మరో కొత్తనాటకం ఆడింది. అయితే ఆసుపత్రి వద్ద అదృశ్యమైన తన భార్య సంధ్యారాణి కని పించడం లేదని లోవరాజు స్థానిక త్రీటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో త్రీటౌన్‌ సీఐ అప్పారావు, ఎస్‌ఐ షేక్‌ సుభాని అప్రమత్తమై కాకినాడలో ఎంక్వైరీ చేసి సంధ్యారాణిని పట్టుకున్నారు. అప్పుడు పోలీసుల విచారణలో వాస్తవాలు బయటకు వచ్చాయి. సంధ్యారాణికి అస లు గర్భమే రాలేదని, పిల్లల కోసం తన భర్త, కుటుంబ సభ్యులను నమ్మించడానికి నాటకం ఆడిందని తెలుసుకున్న పోలీసులు సంధ్యారాణి కి ఆమె కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్‌ ఇచ్చి ఆమెను కుటుంబానికి అప్పగించారు. అదృశ్యం కేసు నమోదు చేసిన గంటలో చాకచక్యంగా వ్యవహరించి ఛేదించిన త్రీటౌన్‌ సీఐ, ఎస్‌ఐలను జిల్లా ఎస్పీ నరసింహకిషోర్‌ అభినందించారు.

Updated Date - Apr 05 , 2025 | 12:52 AM