Share News

వైభవంగా వేంకటేశుని దివ్యకల్యాణం

ABN , Publish Date - Apr 08 , 2025 | 01:01 AM

వేదపండితుల మంత్రోచ్ఛారణలు.. మంగళవాయిద్యాలు.. భక్తుల గోవిందనామస్మరణల నడుమ అమలాపురం వేంకటేశ్వరస్వామివారి దివ్య కల్యాణం సోమవారం వైభవంగా జరిగింది.

  వైభవంగా వేంకటేశుని దివ్యకల్యాణం

అమలాపురం టౌన్‌, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): వేదపండితుల మంత్రోచ్ఛారణలు.. మంగళవాయిద్యాలు.. భక్తుల గోవిందనామస్మరణల నడుమ అమలాపురం వేంకటేశ్వరస్వామివారి దివ్య కల్యాణం సోమవారం వైభవంగా జరిగింది. సుదర్శనం మురళీకృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో వేదపండితులు, పురోహితులు శ్రీఅలివేలుమంగ తాయారు, బీబీ నాంచారి సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారి కల్యాణ మహోత్సవాన్ని జరిపించారు. కల్యాణకర్తలుగా యిండుగుల శ్రీనివాసరావు-పద్మావతి, యిండుగుల వీరభద్రరావు-నాగరాధాకృష్ణకుమారి, శివరామసూర్యవరప్రసాద్‌-శాంతాదేవి దంపతులు వ్యవహరించారు. ఉదయం 8.58 గంటలకు భక్తుల గోవిందనామస్మరణల నడుమ స్వామివారి కల్యాణాన్ని కన్నుల పండుగగా జరిపించారు. నల్లా బాబ్జి-అమ్మాజీ దంపతులు, యిండుగుల శ్రీనివాసరావు, మన్యం ప్రదీప్‌ తదితరులు అందించిన మంచి ముత్యాలతో స్వామి-అమ్మవార్లకు తలంబ్రాలు పోశారు. కల్యాణ క్రతువును భక్తులంతా వీక్షించే విధంగా ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటుచేశారు. కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌, జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి, ఆర్డీవో కె.మాధవి, అముడా చైర్మన్‌ అల్లాడ స్వామినాయుడు, మున్సిపల్‌ చైర్మన్‌ రెడ్డి సత్యనాగేంద్రమణి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, గంధం పల్లంరాజు, నల్లా స్వామి తదితరులు కల్యాణోత్సవాన్ని తిలకించారు. ఆలయ ఈవో యర్రా వెంకటేశ్వరరావు, ఉత్సవ కమిటీ చైర్మన్‌ జంగా అబ్బాయివెంకన్న, సభ్యులు కొమ్ముల ఆదినారాయణ, కుంచే వెంకన్నబాబు తదితరుల ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేలాది మంది భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు. రాత్రి స్వామివారిని గరుడ వాహనంపై ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు.

ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శనలు..

నల్లా హైమావతి బృందం, శ్రీదత్తసాయి చిల్డ్రన్స్‌ వారిచే స్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా కూచిపూడి నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. అనంతరం రాజమహేంద్రవరానికి చెందిన శ్రీలక్ష్మీశ్రీనివాసా కూచిపూడి నృత్యాలయం విద్యార్థినులతో కసిరెడ్డి రమేష్‌నాయుడు ఆధ్వర్యంలో, అమలాపురం శ్రీకళాక్షేత్ర విద్యార్థినులతో ఏర్పాటుచేసిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అదివో అల్లదివో శ్రీహరివాసము.. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే.. అంటూ సంప్రదాయ నృత్య ప్రదర్శనలతో చిన్నారులు ఆకట్టుకున్నారు. నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులకు మంత్రి వాసంశెట్టి సుభాష్‌ సర్టిఫికెట్లు, మెమెంటోలు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో లింగోలు పండు, కోనేటి కార్తీక, రాజులపూడి భీముడు, ఆశెట్టి ఆదిబాబు, యేడిద శ్రీను, బోనం సత్యవరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు రథోత్సవం..

స్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం దేవస్థానం ప్రాంగణంలో తీర్థం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3.15గంటలకు స్వామివారి రథోత్సవం జరుగుతుంది. గారడీలు, భజాభజంత్రీలు, కేరళ వాయిద్యాలతో అత్యంత వైభవంగా రథోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఉత్సవ కమిటీ చైర్మన్‌ జంగా అబ్బాయివెంకన్న తెలిపారు.

Updated Date - Apr 08 , 2025 | 01:01 AM