Road Accident: దారుణం.. నిర్లక్ష్యంగా బస్సు నడిపిన డ్రైవర్.. చివరికి బాలుడి పరిస్థితి..
ABN , Publish Date - Feb 16 , 2025 | 04:08 PM
తూ.గో.జిల్లా గోకవరం మండలం వెదురుపాకలో దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు కిందపడి విద్యార్థి జితేంద్ర(5) మృతిచెందాడు. తలపై నుంచి వాహనం వెళ్లడంతో చిన్నారి ప్రాణాలు విడిచాడు. గ్రామానికి చెందిన రాంబాబు, మహేశ్వరి దంపతులకు పదేళ్ల క్రితం పెళ్లైంది.

తూ.గో.జిల్లా: లేకలేక పుట్టిన కుమారుడు పాఠశాలకు వెళ్లి తిరిగి వస్తాడనుకున్న తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న చిన్నారి కళ్లేదుటే మృతిచెందడం ఆ తల్లిదండ్రులను తీవ్రంగా కలచివేసింది. స్కూల్‌కు వెళ్లొస్తాడనుకున్న కుమారుడు తిరిగి రాని లోకాలపై వెళ్లడం ఆ దంపతులను మనోవేదనకు గురి చేసింది. ఐదేళ్లు నిండకుండానే నూరేళ్ల నిండిపోయాయా? అంటూ వారి రోదనలు ఆకాశాన్ని అంటాయి. పాఠశాల వాహనమే బాలుడి పాలిట యమపాశం అవుతుందని ఊహించలేకపోయారు.
తూ.గో.జిల్లా గోకవరం మండలం వెదురుపాకలో దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు కిందపడి విద్యార్థి జితేంద్ర(5) మృతిచెందాడు. తలపై నుంచి వాహనం వెళ్లడంతో చిన్నారి ప్రాణాలు విడిచాడు. గ్రామానికి చెందిన రాంబాబు, మహేశ్వరి దంపతులకు పదేళ్ల క్రితం పెళ్లైంది. వారికి వివాహం జరిగి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. గుళ్లు, గోపురాలు తిరిగి అనేక పూజలు చేశారు. చివరికి పండండి మగబిడ్డకు మహేశ్వరి జన్మనిచ్చింది. దీంతో వారి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. చిన్నారిని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఇక పాఠశాల వయసు రాగానే కోరుకొండలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో చేర్పించారు. రోజూ ఉదయం గ్రామానికి వస్తున్న పాఠశాల బస్సు ఎక్కి సాయంత్రానికి చిన్నారి ఇంటికి వస్తున్నాడు.
అయితే రోజూ లాగానే నిన్న(శనివారం) చిన్నారి జితేంద్రను తల్లిదండ్రులు బస్సు ఎక్కించి స్కూల్‌కు పంపించారు. సాయంత్రం అయ్యే సరికే తమ కుమారుడు వస్తాడని, అన్నం తినిపించాలని ఆ తల్లి వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోంది. ఎప్పటిలాగానే బస్సు గ్రామానికి చేరుకుంది. అందరూ విద్యార్థులు దిగిపోతున్నారు. జితేంద్ర ఇంటి వద్దకు సైతం బస్సు వచ్చింది. బాలుడు బస్సు దిగి రోడ్డు దాటేందుకు అదే బస్సు ముందుకు వెళ్లాడు. ఇది గమనించని డ్రైవర్ వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. దీంతో జితేంద్ర బస్సు కిందపడ్డాడు. అనంతరం బాలుడి తల పైనుంచి వాహనం వెళ్లిపోయింది. అక్కడున్న వారంతా కేకలు వేయడంతో గమనించిన డ్రైవర్ బస్సును అక్కడే వదిలి పారిపోయాడు.
తలకు తీవ్రగాయమై రక్తపు మగుడులో పడి ఉన్న చిన్నారిని బాధిత తల్లిదండ్రులు, స్థానికులు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి జితేంద్ర మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఆ మాట విన్న దంపతులు ఆస్పత్రి ప్రాంగణంలోనే గుండెలు పగిలేలా రోదించారు. లేకలేక పుట్టిన కుమారుడు మృతిచెందడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. బస్సులో స్కూల్ ఆయా లేకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఫీజులు వసూలు చేసే యాజమాన్యాలు పిల్లలను సురక్షితంగా ఇంటికి పంపడంతో విఫలం అయ్యారంటూ ఆరోపిస్తున్నారు. గోకవరం, కోరుకొండ ప్రాంతాల్లో అనుమతులు లేకుండా ప్రైవేటు పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయని, అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.