ABV Political Entry: జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా.. అందుకే రాజకీయాల్లోకి వస్తున్నా: రిటైర్డ్ ఐపీఎస్
ABN , Publish Date - Apr 13 , 2025 | 06:59 PM
కోడికత్తి శ్రీనుకు న్యాయం జరగాలని రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. టెర్రరిస్టులపై పెట్టే కేసులు అతనిపై పెట్టారని మండిపడ్డారు. అధికారం ఉపయోగించి పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఉపయోగించారని ఆగ్రహించారు.

కోనసీమ జిల్లా: రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయ రంగ ప్రవేశం చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. రాజకీయాల్లోకి ఎప్పటికైనా రావడం అవసరం అనిపించిందని, అందుకే నేటి నుంచి రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలిపారు. మెరుగైన సమాజం కోసం పాటుపడేందుకే వస్తున్నానని, అంతేకానీ పదవులు ఆశించి మాత్రం కాదని వెల్లడించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు, వ్యక్తిగత కక్షలు లేవని చెప్పారు ఏబీ వెంకటేశ్వర్లు. అయితే జగన్ అక్రమాలను మాత్రం కచ్చితంగా బయటకు తెస్తానని పేర్కొన్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంక గ్రామంలోని కోడికత్తి శ్రీను కుటుంబాన్ని పరామర్శించారు ఏబీవీ. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.."జగన్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు తెస్తాం. ఆంధ్రప్రదేశ్‌లో కోడికత్తి శ్రీను లాంటి జగన్ బాధితులు వందలు, వేలల్లో ఉన్నారు. వాళ్లందరికీ నా వంతు సహాయం చేసి వారి కష్టాలు, కన్నీళ్లు తుడిచేందుకు ప్రయత్నిస్తా. జగన్ ప్రభుత్వంలో అక్రమాలు, అన్యాయాలను అందరి సహాయంతో బయటపెడతా. నా ప్రయత్నాన్ని, ప్రయాణాన్ని ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరుతున్నా. నేను అందరికీ అందుబాటులో ఉంటా. జగన్ గురించి ఏం చెప్పాలనుకున్నా 7816020048 వాట్సాప్ నంబర్‌కి సమాచారం పంపొచ్చు.
కోడి కత్తి శ్రీనుకు న్యాయం జరగాలి. అతనిపై టెర్రరిస్టులపై పెట్టే కేసులు పెట్టారు. అధికారం ఉపయోగించి పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఉపయోగించారు. ఆరేళ్లపాటు బెయిల్ రాకుండా చేసి శ్రీను జీవితాన్ని అంధకారం చేశారు. ఇలాంటి బాధితులకు చేతనైనంత సాయం చేస్తా. వారిని తిరిగి నిలబెట్టేందుకు ప్రయత్నిస్తా. సండూర్ పవర్‌తో మొదలైన జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆర్థిక సామ్రాజ్యం నేడు లక్షల కోట్లకు చేరింది. రూ.25 కోట్లతో జగన్ కొన్న సెకండ్ హ్యాండ్ సండూర్ పవర్‌లోకి వందల కోట్ల అనుమానాస్పద నగదు విదేశాల నుంచి వచ్చింది.
ఆ డబ్బంతా ప్రజలదే.. జగన్ కష్టపడి సంపాదించింది కాదు. జగన్, అతని అనుచరులు దోచుకున్న సొమ్మును చట్టపరంగా బయటకు కక్కేలా పోరాటం చేయాలి. ఆయన అక్రమాస్తులపై కేసులన్నీ లాజికల్ కంక్లూషన్‍కి రావాలి. నాకు, జగన్‍కు ఉన్న వివాదాల ఎకౌంటు క్లోజ్ అయిపోయింది. జగన్ చేయాల్సింది చేశారు.. నేను చేయాల్సిన పోరాటం నేను చేశా. ఇక ఇది కొత్త అధ్యాయమని" చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Harish Rao: సన్నబియ్యం పేరుతో పేదల్ని మోసం చేస్తున్నారు: ఎమ్మెల్యే హరీశ్ రావు..
MLA Komatireddy: నాకు మంత్రి పదవి రాకుండా చూస్తోంది అతనే: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి..
Hyderabad: యువకుడిని తరిమిన ట్రాఫిక్ పోలీసులు.. చివరికి ఏమైందంటే..