Share News

Prosecution Arguments: వంశీకి బెయిలిస్తే విదేశాలకు పారిపోతారు!

ABN , Publish Date - Mar 18 , 2025 | 04:46 AM

‘మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్‌ ఇస్తే విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది.

Prosecution Arguments: వంశీకి బెయిలిస్తే విదేశాలకు పారిపోతారు!

  • బయటికొస్తే సాక్షులను బెదిరిస్తారు

  • ఎస్సీ, ఎస్టీ కోర్టులో ప్రాసిక్యూషన్‌ వాదనలు

  • గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే రిమాండ్‌ 28 దాకా పొడిగింపు

విజయవాడ, మార్చి 17(ఆంధ్రజ్యోతి): ‘మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్‌ ఇస్తే విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది. ఆయనకు ఈబీ5 వీసా ఉంది. ఆయన విదేశాల్లో రూ.20 కోట్ల వరకు వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు’ అని ప్రాసిక్యూషన్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ కోర్టుకు వివరించారు. సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ కేసులో ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో ఉన్న వంశీ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల న్యాయస్థానం సోమవారం విచారణ జరిపింది. రాజేంద్రప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. హైదరాబాద్‌ గచ్చిబౌలిలో వంశీ నివాసం ఉంటున్న మైహోం భూజా అపార్టుమెంట్‌ నుంచి సీసీ కెమెరాల ఫుటేజీలను స్వాధీనం చేసుకోవసి ఉందని తెలిపారు. అక్కడి నుంచే సత్యవర్ధన్‌ను కారులో విశాఖపట్నం తరలించారని, అక్కడ ఆయన్ను బంధించిన గెస్ట్‌హౌస్‌ నుంచి కూడా సీసీ ఫుటేజీలను తీసుకోవాలని వివరించారు. వంశీకి బెయిల్‌ ఇస్తే దర్యాప్తు ముందుకు సాగదని.. ఆయన బయటకు వస్తే సాక్షులను బెదిరిస్తారని, ఆయనకు నేరచరిత్ర ఉందని.. ఈబీ5 వీసాను ఉపయోగించుకుని ఆయన పారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. న్యాయాధికారి హిమబిందు తదుపరి విచారణను గురువారాని(20వ తేదీ)కి వాయిదా వేశారు. ఇంకోవైపు.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ రిమాండ్‌ను 28వ తేదీ వరకు సీఐడీ కోర్టు పొడిగించింది. ఆయన్ను ప్రశ్నించేందుకు ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్‌ వేసింది. ఇదే కేసులో వంశీ బెయిల్‌ పిటిషన్‌పై బుధవారంలోపు కౌంటర్‌ వేయాలని న్యాయాధికారి ప్రాసిక్యూషన్‌ను ఆదేశించారు.

Updated Date - Mar 18 , 2025 | 04:46 AM