చేజారిన పంట
ABN , Publish Date - Apr 05 , 2025 | 01:31 AM
అన్నదాతలను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా వరిపైరును కోల్పోయిన రైతులు రబీలో వరి పంట సాగు చేసి కష్టాల నుంచి బయటపడాలని భావించారు. ప్రభుత్వం దాళ్వాకు సాగునీటిని నిలుపుదల చేయడంతో చేతికి అందివచ్చిన పంటకు చివరి తడులు అందక మచిలీపట్నం మండలం తాళ్లపాలెంలో సుమారు 150 ఎకరాలు వరకు ఎండిపోయింది. ఎకరానికి రూ.35 వేల వరకు పెట్టుబడిన రైతులు దిగుబడి రాక, పెట్టుబడి పోయి తీవ్రంగా నష్టపోయారు.

- సాగునీరు లేక 150 ఎకరాల్లో ఎండిపోయిన వరిపైరు
- మచిలీపట్నం మండలం తాళ్లపాలెంలో దారుణం
- ఎకరానికి రూ.35వేల వరకు పెట్టుబడిపెట్టిన రైతులు
- రెండు తడుపులకు నీరిస్తే పంట చేతికొచ్చేదని ఆవేదన
అన్నదాతలను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా వరిపైరును కోల్పోయిన రైతులు రబీలో వరి పంట సాగు చేసి కష్టాల నుంచి బయటపడాలని భావించారు. ప్రభుత్వం దాళ్వాకు సాగునీటిని నిలుపుదల చేయడంతో చేతికి అందివచ్చిన పంటకు చివరి తడులు అందక మచిలీపట్నం మండలం తాళ్లపాలెంలో సుమారు 150 ఎకరాలు వరకు ఎండిపోయింది. ఎకరానికి రూ.35 వేల వరకు పెట్టుబడిన రైతులు దిగుబడి రాక, పెట్టుబడి పోయి తీవ్రంగా నష్టపోయారు.
ఆంరఽధజ్యోతి-మచిలీపట్నం:
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో భారీ వర్షాల కారణంగా మచిలీపట్నం ఉత్తరం మండలంలోని తాళ్లపాలెం, పరిసర గ్రామాల్లో వరిపైరు దెబ్బతిని పంట దిగుబడి తగ్గింది. మినుము పంటను ఈ భూముల్లో సాగు చేసేందుకు అవకాశం లేకపోవడంతో రైతులు గత డిసెంబరులో దాళ్వా పంటకు సాగు నీటిని విడుదల చేస్తారనే ధైర్యంతో 150 ఎకరాలకుపైగా వెదజల్లే పద్ధతిలో వరిసాగు చేశారు. ఈ క్రమంలో రబీ సీజన్‌లో దాళ్వా పంటకు సాగు నీటిని విడుదల చేయబోమని అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటన విడుదలకు ముందే తాళ్లపాలేనికి చెందిన రైతులు వరి సాగుచేశారు. రబీ సీజన్‌లో సాగు నీటిని విడుదల చేయబోమని ప్రకటించినప్పటికీ ఫిబ్రవరి నెలాఖరు వరకు కాలువలకు కొద్దిపాటి నీటిని విడుదల చేస్తూనే ఉన్నారు. రామరాజుపాలెం ప్రధాన కాలువకు అనుబంధంగా ఉన్న ఓల్డ్ తాళ్లపాలెం బ్రాంచ్ కాలువకు వచ్చిన కొద్దిపాటి నీటిని ఆయిల్ ఇంజన్ల ద్వారా పొలాలకు తోడుకుని రైతులు వరిపైరును బతికించారు. మార్చి మొదటి వారానికి తాళ్లపాలెంలో సాగు చేసిన వరిపైరు బిర్రుపొట్ట, ఈత, కంకులు పాలుపోసుకునే దశలకు చేరుకుంది. మరో ఒకటి, రెండు తడుపులు పెడితే పంట చేతికొస్తుందని రైతులు ఆశించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 26వ తేదీ శివరాత్రి పండుగ తర్వాత కాలువలకు పూర్తిస్థాయిలో నీటిని నిలిపివేయడంతో తాళ్లపాలెం గ్రామంలోని వరి పొలాలకు సాగునీరు రాకుండా నిలిచిపోయింది.
అవకాశం ఉన్నా నీటిని విడుదల చేయలేదు
రామరాజుపాలెం, బందరు ప్రధాన కాలువలు నిడుమోలు లాకుల వద్ద పక్కపక్కనే ప్రవహిస్తుంటాయి. రామరాజుపాలెం కాలువకు నీటిని నేరుగా విడుదల చేయడానికి అవకాశం లేకున్నా, బందరు ప్రధాన కాలువ నుంచి రామరాజుపాలెం కాలువకు నీటిని మళ్లించే వెసులుబాటు ఉంది. ఇదే విషయాన్ని రైతులు నీటిపారుదలశాఖ అధికారులు, స్థానిక నాయకులకు చెప్పారు. కష్టమైనా రామరాజుపాలెం కాలువకు కొద్దిమేర నీటిని విడుదల చేస్తే పంట చేతికొస్తుందని తాళ్లపాలెం రైతులు అందరి చుట్టూ తిరిగారు. దాళ్వా పంటకు నీటిని విడుదల చేస్తారనే నమ్మకంతో ముందస్తుగానే వరి పంటను సాగు చేశామని, తమది పొరపాటే అయినా పంటను కాపాడేందుకు సాగు నీటిని విడుదల చేయాలని రైతులు చేసిన విన్నపాలను ఎవ్వరూ పట్టించుకోలేదు. మార్చి మొదటి వారం నుంచి ఓల్డ్ తాళ్లపాలెం బ్రాంచ్ కాలువకు సాగునీరు రాకపోవడంతో వివిధ దశల్లో ఉన్న వరిపైరు ఎండిపోయింది.
ఎకరానికి రూ.35 వేల వరకు పెట్టుబడి
తాళ్లపాలెంలో గత డిసెంబరులో సాగు చేసిన వరిపైరుకు రైతులు ఎకరానికి రూ.35వేల వరకు పెట్టుబడిగా పెట్టారు. మూడు కోటాలు ఎరువులు వేయడం, నాలుగు విడతల్లో పురుగు మందుల పిచికారీ, గుళికలు, కలుపు తీయడం తదితరాల పనులకు పెద్దమొత్తంలో ఖర్చు చేశారు. అయితే వరిపైరు చివరిలో ఒకటి, రెండు తడుపులకు నీరు అందకపోవడంతో పైరు ఎండిపోయిందని రైతులు వాపోతున్నారు. తాళ్లపాలెం గ్రామం సముద్రం పక్కనే ఉండటంతో భూగర్భ జలాలు ఉప్పు నీరుగానే ఉంటాయని, బోర్లు వేసినా ఉపయోగం ఉండదని రైతులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఉప్పు భూములు కావడంతో పంట నీరు పొలంలో నిల్వ ఉన్నంత వరకు పైరుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, నీరు అందుబాటులో లేకపోవడంతో ఎండల తీవ్రతకు ఉప్పు ప్రభావం భూమిపైకి వచ్చి త్వరితగతిన వరిపైరు చనిపోయిందని రైతులు అంటున్నారు. గుడివాడ, నందివాడ, మచిలీపట్నం దక్షిణ మండలంలోని చేపల చెరువులకు పూర్తిస్థాయిలో సాగునీటిని విడుదల చేసిన అధికారులు.. తాళ్లపాలెంలోని వరి పంటకు మాత్రం సాగునీటిని విడుదల చేయకుండా మిన్నకుండిపోయారని రైతులు వాపోతున్నారు. దీంతో పంట సాగు కోసం పెట్టిన పెట్టుబడిని కోల్పోయామని రైతులు గగ్గోలు పెడుతున్నారు.