Health Authorities : జీబీఎస్‌తో జాగ్రత్త

ABN, Publish Date - Feb 17 , 2025 | 03:20 AM

శ్రీకాకుళం జిల్లాల్లో ఆరేళ్ల బాలుడు దీని బారినపడి మరణించగా, తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన 50 ఏళ్ల మహిళ ఈ వ్యాధితో గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు.

  Health Authorities : జీబీఎస్‌తో జాగ్రత్త
  • రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు

  • ఇప్పటి వరకు 59 కేసులు వెలుగులోకి

  • ఇంకా ఎక్కువే ఉంటాయంటున్న అధికారులు

  • రాష్ట్రంలో రెండో మరణం నమోదు

  • ఇప్పటికే శ్రీకాకుళంలో ఆరేళ్ల బాబు మృతి

  • తాజాగా ప్రకాశంలో 50 ఏళ్ల మహిళ మరణం

  • ప్రస్తుతం ఆస్పత్రుల్లో మరో 14 మంది

  • నిమిషాల వ్యవధిలో ఒళ్లంతా పాకే వ్యాధి

  • లక్షణాలు కనిపించగానే ఆస్పత్రిలో చేరాల్సిందే

  • ఇంజెక్షన్‌ ధర రూ.6 వేల నుంచి 30 వేల వరకు

  • ప్రైవేటు వైద్యమంటే పేదలకు కష్టమే!

  • ప్రభుత్వమే యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో జీబీఎస్(గులియన్‌ బారే సిండ్రోమ్‌) విజృంభణ మొదలైంది. నెమ్మదిగా మరణాలూ పెరుగుతున్నాయి. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాల్లో ఆరేళ్ల బాలుడు దీని బారినపడి మరణించగా, తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన 50 ఏళ్ల మహిళ ఈ వ్యాధితో గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు రంగంలోకి దిగి కొన్ని చోట్ల ప్రత్యేక చికిత్సకు ఏర్పాట్లు చేశారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లోనూ ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 59 కేసులు వెలుగులోకి వచ్చాయి. అందులో 14 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారు చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్నారు. చికిత్స అనంతరం ఇంటికి వెళ్లినవారిపై ఆరోగ్యశాఖ ప్రత్యేక నిఘా పెట్టింది.

సరైన సమయానికి వైద్యం అందకే మరణాలు..

వ్యక్తిగతంగా జీబీఎస్‌పై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా కంటే జీబీఎస్‌ చాలా ప్రమాదకరంగా మారింది. కరోనా వచ్చినప్పుడు కనీసం వ్యాధి లక్షణాల ద్వారా తెలుసుకునే వెసులుబాటు ఉంది. వెంటనే మందులు వాడుకుని ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉండేది. కానీ, జీబీఎ్‌సలో అలాంటి అవకాశం లేదు. వ్యాధి లక్షణాలు విచిత్రంగా ఉన్నాయి. ఏ మందు వేసుకోవాలో తెలియదు. వెంటనే వైద్యులను సంప్రదించకపోతే మృత్యువాతపడుతున్నారు. కాబట్టి జీబీఎస్‌ విషయంలో అత్యంత జాగ్రత్తలు వహించాలని వైద్యులు సూచిస్తున్నారు.కరోనాలో గరిష్ఠంగా 2 శాతం ప్రపంచ సగటు మరణాల రేటు ఉండగా, జీబీఎ్‌సలో 7 శాతం ఉంది.


జీబీఎస్‌ ఎంత వేగంగా మానవ శరీరాన్ని దెబ్బతీస్తుందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో నమోదైన రెండు మరణాలూ సరైన సమయానికి వైద్యం అందకపోవడం వల్లే సంభవించాయి. శ్రీకాకుళం జిల్లాల్లో ఆరేళ్ల బాలుడు జీబీఎస్‌ బారినపడినప్పుడు నాలుగైదు ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకువెళ్లారు. ఆ ఆస్పత్రులు వ్యాధిని గుర్తించడంలో జాప్యం చేయడంతో చివరికి ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. అప్పటికే శరీరంలో జరగాల్సిన నష్టం జరిగి ప్రాణం పోయింది. తాజాగా ప్రకాశం జిల్లా మహిళను కూడా ఇలాగే నాలుగైదు ఆస్పత్రులకు తీసుకెళ్లి, చివరికి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. అయితే, అప్పటికే తగిన వైద్యం అందించడంలో జాప్యమై ఆమె కూడా మరణించారు. కాబట్టి ఎవరిలోనైనా జీబీఎస్‌ లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వాస్పత్రులను సంప్రదించడం మేలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో అయితే వెంటనే జీబీఎస్‌ నిర్థారణ పరీక్షలు నిర్వహించి వైద్యం ప్రారంభిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ప్రస్తుతం ఈవ్యాధి నిర్థారణ పరీక్షలను ఆరోగ్యశాఖ చేపడుతోంది.

లక్షణాలు ఇవీ..

జీబీఎస్‌ లక్షణాలు అందరికీ ఒకేలా ఉంటాయని చెప్పలేం. కొంత మందికి దగ్గు, జ్వరంతో పాటు వెంటనే కాళ్లు పట్టేయడం జరుగుతోంది. కొంత మందికి విరేచనాలతో లక్షణాలు ప్రారంభమవుతున్నాయి. ఏదైనా చివరికి నరాల మీద ప్రభావం చూపి, శరీరంలోని నాడీవ్యవస్థను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా నరాల సమస్యలున్నవారు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. జీబీఎస్‌ శరీరంలోకి ప్రవేశించగానే సాధారణ వ్యాధి లక్షణాలతో ప్రారంభమై జలుబు, దగ్గు, విరోచనాలు, కాళ్లు పట్టేయడం తదితర లక్షణాలు మొదలవుతాయి. ఆ సమస్యలను తగ్గించడానికి మన శరీరంలో యాంటీబాడీలను సిద్ధం చేస్తుంది. ఈ యాంటీబాడీలు అధికంగా ఉత్పత్తి కావడంతో అవి తిరిగి శరీరాన్ని డ్యామేజ్‌ చేస్తాయి. యాంటీబాడీలు శరీరంలోని మొత్తం నరాల వ్యవస్థపై దాడి చేయడం ప్రారంభించి నెమ్మదిగా మెదడుపై ప్రభావం చూపుతాయి. శ్వాస సంబంధిత సమస్యలు, నీరసం ఏర్పడతాయి.. ఇదంతా కేవలం 10 నుంచి 15 రోజుల వ్యవధిలోనే జరిగిపోతుంది. కాబట్టి న్యూరాలజీ సమస్యలున్నవారు అత్యం త జాగ్రత్తగా ఉండాలి.


చిన్నారులు, వృద్ధులపై ప్రభావం

జీబీఎస్‌ ఎక్కువగా చిన్నారుల, వృద్ధులపై ప్రభావం చూపుతోంది. చాలా మంది చిన్నారులు తమకు వచ్చే అనారోగ్య సమస్యలను సృష్టంగా చెప్పలేరు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ముఖ్యంగా చిన్నారులకు ఆహారంలో పాలు ఇచ్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పాల వల్ల ఎక్కువగా జీబీఎస్‌ ఎఫెక్ట్‌ అవుతోంది. కాబట్టి బాగా వేడి చేసిన పాలను మాత్రమే చిన్నారులకు అందించాలి. మంచినీళ్లను కూడా కాచి చల్లార్చినవి వాడితే మంచిది.

అంటువ్యాధి కాదు కానీ..

ఇది అంటు వ్యాధి కాదు. కానీ, ఏ రూపంలో శరీరంలోకి ప్రవేశిస్తుందో చెప్పలేని పరిస్థితి. కాబట్టి చిన్నారులు, వృద్ధులతో పాటు ప్రతి ఒక్కరూ కరోనా సమయంలో పాటించిన జాగ్రత్తలు మొత్తం పాటించాలి. పెద్ద వయసు వారు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

అన్ని రాష్ట్రాల్లోనూ కేసులు

దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ జీబీఎస్‌ కేసు లు నమోదవుతున్నాయి. ఇది ప్రమాదకరమైన సిండ్రోమ్‌ కాదని ప్రభుత్వం చెబుతోంది. కానీ, కేసుల సంఖ్య పెరిగిపోతోంది. గుజరాత్‌, పశి ్చమ బెంగాల్‌ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య అధికంగా ఉంది. తాజాగా ఏపీలోనూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం ఇప్పటి వరకూ 59 కేసులు నమోదయ్యాయి. అయితే, ఇంకా ఎక్కువగానే కేసులు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు.


ఇంజెక్షన్ల కొరత..

జీబీఎస్‌కు అందించే వైద్యంలో ఉపయోగించే ఇమినోగ్లోబినిస్‌ థెరిపి ఇంజెక్షన్ల్‌ కొరత ఎక్కువగా ఉంది. ప్రభుత్వం గుంటూరు, కాకినాడ, కర్నూలు, విశాఖపట్నం వంటి ముఖ్యమైన ఆస్పత్రుల్లో ఈ ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో దీన్ని రూ.30 వేలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంజెక్షన్‌ డిమాండ్‌ పెరిగే కొద్ది ప్రైవేటు ఆస్పత్రులు దీన్ని వ్యాపారంగా మార్చేసే అవకాశం ఉంది. కరోనా సమయంలో రెమిడి్‌సవేర్‌ను కూడా ఇలానే బ్లాక్‌ చేసి రూ.లక్షలకు అమ్మేశారు. అప్పుడంటే ఒకటి లేదా రెండు ఇంజెక్షన్లు చేస్తే సరిపోయేవి. కానీ, జీబీఎస్‌ రోగికి ఐదారు ఇంజెక్షన్లు అవసరమవుతాయి. కాబట్టి ప్రభుత్వం రంగంలోకి దిగి ఇంజెక్షన్లు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. మరణాల శాతం ఎక్కువగా ఉన్న జీబీఎ్‌సపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటే మంచిదని వైద్యులు అంటున్నారు.

Updated Date - Feb 17 , 2025 | 03:20 AM