చెత్త నుంచి సంపద!
ABN , Publish Date - Apr 15 , 2025 | 01:04 AM
చెత్త నుంచి కూడా.. సంపదనుసృష్టిస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు కళకళలాడుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన సంపద తయారీ కేంద్రాలను గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నాశనం చేశారు. ఐదేళ్లుగా నిరుపయోగంగా, మందుబాబులకు అడ్డాగా, అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా నిలిచిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు ఇప్పుడు మళ్లీ పునఃప్రారంభమయ్యాయి.

- జిల్లా వ్యాప్తంగా 286 గ్రామాల్లో 264 కేంద్రాల ఏర్పాటు
- 45 రోజుల్లో 330 టన్నుల కంపోస్టు ఎరువు తయారీ
- వారం వారం కలెక్టరేట్‌లో విక్రయాలు.. ఆసక్తి చూపుతున్న రైతులు
- గత వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యం
- కూటమి ప్రభుత్వం రాకతో కొత్త ఉత్సాహంతో ముందుకు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ /మైలవరం/గొల్లపూడి /విస్సన్నపేట/ వత్సవాయి/ వీరులపాడు/ ఏకొండూరు): చెత్త నుంచి కూడా.. సంపదనుసృష్టిస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు కళకళలాడుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన సంపద తయారీ కేంద్రాలను గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నాశనం చేశారు. ఐదేళ్లుగా నిరుపయోగంగా, మందుబాబులకు అడ్డాగా, అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా నిలిచిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు ఇప్పుడు మళ్లీ పునఃప్రారంభమయ్యాయి. చెత్త నుంచి సంపదను సృష్టిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం చొరవతో ఎన్టీఆర్ జిల్లాలో గ్రామ పంచాయతీ అధికారులు ముమ్మరంగా చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు శ్రీకారం చుట్టారు.
1,100 మంది గ్రీన్ అంబాసిడర్లు
జిల్లాలో మొత్తం 286 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 264 గ్రామ పంచాయితీల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే చాలా వరకు వీటిని నిర్మించటం జరిగింది. ఇన్నాళ్లూ ఇవి నిరుపయోగంగా ఉన్నాయి. వీటికి తాత్కాలిక మరమ్మతులు ఉంటే నిర్వహించి వినియోగంలోకి తీసుకువచ్చారు. జిల్లా వ్యాప్తంగా 1,100 మంది గ్రీన్ అంబాసిడర్లను నియమించారు. ప్రతి గ్రామ పంచాయతీలో కూడా చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని ప్రారంభించాలన్న ఉద్ధేశ్యంతో కలెక్టర్ లక్ష్మీశ ఆదేశాల మేరకు డీపీవో లావణ్య కుమారి వీటిపై ప్రధానంగా దృష్టి సారించారు. బ్యాలెన్స్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయటంతో 95 శాతం పైగా సంపద తయారీ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. మరో 22 గ్రామ పంచాయతీల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల ఏర్పాటుకు స్థలాభావం ఏర్పడింది. గొల్లపూడి, రామవరప్పాడు, ఎనికేపాడు, ప్రసాదంపాడు వంటి గ్రామాల్లో స్థలం అందుబాటులో లేదు. మిగిలిన గ్రామాల్లో కూడా ప్రత్యామ్నాయాలను ఆలోచిస్తున్నారు.
జిల్లా అధికారుల ప్రత్యేక ప్రణాళికలు
జిల్లా వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన 264 గ్రామ పంచాయితీల్లో చెత్త నుంచి సంపద సృష్టి దిశగా జిల్లా అధికారులు అడుగులు వేస్తున్నారు. కనీసం రెండు బెడ్లలో అయినా వర్మీ కంపోస్టును తయారు చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ ఆలోచన సత్ఫలితాలనిచ్చిందనే చెప్పాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీల పరిధిలో డోర్ కలెక్షన్‌పై దృష్టి సారించారు. తడి, పొడి చెత్తలను వేరు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పొడిచెత్తను విక్రయిస్తున్నారు. విజయవాడ రూరల్ మండలం పరిధిలో అయితే పొడి చెత్తను గుంటూరు జిల్లాలోని జిందాల్ ప్లాంట్‌కు విక్రయిస్తున్నారు. పొడి చెత్తలో ప్లాస్టిక్ వ్యర్థాలను కాంట్రాక్టు సంస్థలు, ఆర్‌అండ్‌బీ శాఖకు విక్రయిస్తున్నారు. తడిచెత్తను మాత్రం పూర్తిగా చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలలోనే వినియోగిస్తున్నారు. తడి చెత్త ద్వారా కంపోస్టును చేయిస్తున్నారు. అలాగే వానపాముల ద్వారా కూడా వర్మీని తయారు చేయిస్తున్నారు. 45 రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 330 టన్నుల కంపోస్టు ఎరువును తయారు చేశారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల్లో ఇంకా పెద్ద ఎత్తున బెడ్లలో కంపోస్టును తయారు చేయగలిగితే వెయ్యి టన్నుల కంపోస్టును తయారు చేయగలమని పంచాయతీ అధికారులు అంచనా వేస్తున్నారు.
కలెక్టరేట్‌కు వర్మీ కంపోస్టు
ఇలా తయారు చేసిన వర్మీ కంపోస్టును ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ సందర్భంగా పంచాయతీ అధికారులు విక్రయానికి పెడుతున్నారు. ఇలా ప్రతి వారం దాదాపుగా 300 కేజీల వరకు అందుబాటులో ఉంచుతున్నారు. ఇక్కడ వచ్చే సందర్శకులు సుమారు 100 కేజీలకు పైగా కొనుగోలు చేస్తున్నారు. ఈ కంపోస్టు కోసం రైతుల నుంచి ఎక్కువుగా డిమాండ్ ఉంటోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని జిల్లా పంచాయతీ అధికారులు కూడా పెద్ద ఎత్తున బెడ్లను విస్తరించాలని భావిస్తున్నారు. రానున్న రోజుల్లో గ్రీన్ అంబాసిడర్లను గణనీయంగా పెంచటంతో పాటుగా పంచాయతీల పరిధిలో పనిచేసే పారిశుధ్య కార్మికులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించటం, రైతులకు వర్మీ కంపోస్టు ఎరువుల వినియోగం ద్వారా అధిక దిగుబడులు సాగించే అంశాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నారు.