Share News

AP Govt: గిరిశిఖర గ్రామాలకు నిత్యావసరాలు

ABN , Publish Date - Mar 16 , 2025 | 05:05 AM

మారుమూల కొండల్లో నివసించే గిరిజనులకు నిత్యావసర సరుకులు అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్రంలో...

AP Govt: గిరిశిఖర గ్రామాలకు నిత్యావసరాలు

  • ‘గిరిబజార్‌’ ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి

  • రాష్ట్రంలో మన్యం జిల్లాలోనే తొలిసారి

పార్వతీపురం, మార్చి 15(ఆంధ్రజ్యోతి): మారుమూల కొండల్లో నివసించే గిరిజనులకు నిత్యావసర సరుకులు అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిబజార్‌ వాహనాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. కొండశిఖర గ్రామాల ప్రజలు వారపు సంతలకు వెళ్లి వారానికి ఒకసారి నిత్యావసర సరుకులు తెచ్చుకుంటున్నారు. జిల్లా కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ స్వయంగా ఈ సంతలను పరిశీలించారు. సంతల్లో కూడా నాణ్యమైన నిత్యావసర సరుకులు అందడం లేదని గిరిజనులు చెప్పడంతో.. వారి చెంతకే సరుకులు చేరవేసేందుకు గిరిబజార్‌ వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. వీటిలో వచ్చిన సరుకులు గిరిజనులు కొనుగోలు చేయవచ్చు. ఈ వాహనాలను గిరిజన సంక్షేమశాఖమంత్రి గుమ్మిడి సంధ్యారాణి శనివారం సాలూరులో ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ గిరిజనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలతో పాటు నిత్యావసర సరుకులు చేరవేసేందుకు ఈ వాహనాలను ప్రారంభించామన్నారు.


గత ప్రభుత్వంలో గిరిజనుల కష్టాలను పట్టించుకోలేదని ఆమె విమర్శించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సారథ్యంలో గిరిజన గ్రామాలకు రోడ్లు వేయడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా న్యూ క్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా పార్వతీపురం మన్యం జిల్లాకు అందించిన అంబులెన్స్‌ను ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌, ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, ఐటీడీఏ పీవో అశుతోష్‌ శ్రీవాస్తవ, డీఎంఅండ్‌హెచ్‌వో భాస్కరరావు పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2025 | 05:05 AM