Govt College Admissions Drive: రండి చేరండి
ABN, Publish Date - Apr 06 , 2025 | 04:50 AM
అనంతపురం జిల్లాలో ప్రభుత్వ ఇంటర్ కాలేజీలు అడ్మిషన్ల కోసం ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఉచిత పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ఎంసెట్ కోచింగ్ వంటి సదుపాయాలతో తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నారు

ప్రభుత్వ ఇంటర్ కాలేజీల ప్రచార జోరు
మొన్నటి దాకా పరీక్షా కేంద్రాల వద్ద
ఇప్పుడు నేరుగా విద్యార్థుల ఇళ్ల వద్దకే
తల్లిదండ్రులను కలిసి అవగాహన
అడ్మిషన్లు పెంచేందుకు స్పెషల్ డ్రైవ్
ప్రిన్సిపాళ్లు, అధ్యాపకుల ప్రచారం
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శ్రీకారం
రేపటి నుంచి ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు
మెరుగైన బోధన, ఉచిత పుస్తకాలు, భోజనం
ఈ ఏడాది నుంచి ఎంసెట్ కోచింగ్ కూడా
(అనంతపురం-ఆంధ్రజ్యోతి)
పదో తరగతి పరీక్షలు జరుగుతుండగానే విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ కాల్స్..! ‘మీ పిల్లలను మా కాలేజీలో చేర్పించండి’ అంటూ ఆఫర్..! అంతేకాదు.. పరీక్షా కేంద్రాల వద్ద కరపత్రాలతో ప్రచారం..! ఇంకా హోర్డింగులు, ఫ్లెక్సీలతో ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలు హడావుడి చేయడం సర్వసాధారణం. ఇప్పుడు ప్రభుత్వ కాలేజీలు కూడా ‘రూటు’ మార్చాయి. అడ్మిషన్లు పెంచుకునేందుకు ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు, సిబ్బంది నేరుగా విద్యార్థుల వద్దకే వెళుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సరికొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు.
ప్రభుత్వ కాలేజీలలో చేరితే కలిగే ప్రయోజనాలను విద్యార్థులు, తల్లిదండ్రులకు అధ్యాపకులు, సిబ్బంది వివరించి, చైతన్యపరుస్తున్నారు. పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద ఇప్పటికే ప్రచారం పూర్తి చేశారు. ఇప్పుడు విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళుతున్నారు. ‘ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు అందిస్తున్నాం. కడుపు నిండా కమ్మని భోజనం పెడుతున్నాం. మంచి లెక్చరర్లు ఉన్నారు. ఫీజులు నామమాత్రమే. మన కాలేజీల్లో ఏం తక్కువ..? రండి.. చేరండి.. బాగా చదువుకోండి’ అని ప్రభుత్వ కాలేజీల ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు ఆహ్వానం పలుకుతున్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు జరగనున్న నేపథ్యంలో అడ్మిషన్ల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు.
కార్పొరేట్‌కు దీటుగా సదుపాయాలు
ఒకప్పుడు ప్రభుత్వ కాలేజీల్లో పుస్తకాలు ఇచ్చేవారు కాదు. ముఖ్యంగా జగన్ ప్రభుత్వంలో ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు కలగా ఉండేవి. కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి మారింది. ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలతో పాటు నోట్ పుస్తకాలు అందించేందుకు చర్యలు తీసుకుంది. ఈ ఏడాది సెలవులకు ముందే ఉమ్మడి అనంతపురం జిల్లాకు పుస్తకాలు చేరాయి. పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు కాలేజీలకు పంపిణీ చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి 4 నుంచి ఇంటర్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ పథకం కింద మధ్యాహ్న భోజనం కూడా అందిస్తున్నారు. అనంతపురం జిల్లాలో 11,244 మందికి మధ్యాహ్న భోజనం సమకూర్చారు. 2025-26 విద్యా సంవత్సరానికి ఎంసెట్ కోచింగ్ కూడా ఇవ్వనున్నారు. వచ్చే నెలలో ‘తల్లికి వందనం’ ఇస్తామని ప్రకటించారు. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ కాలేజీల్లో అన్ని సదుపాయాలు సమకూరుస్తున్నారు. అనంతపురం జిల్లాలో 23 జూనియర్ కళాశాలలు, రెండు ఎయిడెడ్, ఒక ఒకేషనల్ కళాశాల ఉన్నాయి. అనంతపురం, ఉరవకొండ, కణేకల్లు, కదిరి, ధర్మవరం, రాయదుర్గం, కొత్తచెరువు, గుంతకల్లు తదితర ప్రాంతాల్లో అధ్యాపకుల బృందం విస్తృతంగా ప్రచారం చేశారు.
ప్రచారంతో సత్ఫలితాలు
గుంతకల్లు ఎస్కేపీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ల కోసం అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది ముమ్మర ప్రచారం చేస్తున్నారు. 2023-24 విద్యా సంవత్సరంలో ఒకేషనల్, జనరల్ కోర్సుల్లో కలిపి 380 మంది విద్యార్థులు చేరారు. 2024-25లో ఆ సంఖ్య 460కి చేరింది. ప్రభుత్వ కళాశాలలో చదివిన విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. ‘ప్రభుత్వ కాలేజీలు 20 ఏళ్ల కిందటి స్వర్ణయుగం దిశగా పయనిస్తున్నాయి. గడిచిన పది, పదిహేనేళ్లలో కార్పొరేటు, ప్రైవేటు కళాశాలల ప్రచారం కారణంగా ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు మందగించాయి. ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్య, తక్కువ ఫీజులు, ఉచిత పుస్తకాలు, మధ్యాహ్న భోజనం అందుతున్నాయి. విద్యార్థులు ఈ అవకాశాలను వినియోగించుకుని తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపకుండా ప్రభుత్వ కాలేజీల్లో చేరాలి’ అని ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ సురేశ్ అన్నారు.
అడ్మిషన్లు పెంచేలా డ్రైవ్
ప్రభుత్వ జూనియర్ కళాశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఉచితంగా పాఠ్య, నోట్ పుస్తకాలు ఇస్తోంది. అన్ని రకాలుగా విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం పాటుపడుతోంది. అడ్మిషన్లు పెంచేందుకు ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు విస్తృతంగా డ్రైవ్ చేస్తున్నారు. అడ్మిషన్ కోసం వచ్చే ఏ విద్యార్థీ వెనక్కు వెళ్లకుండా చూస్తాం.
- వెంకటరమణ నాయక్, డీవీఈఓ, అనంతపురం జిల్లా
ఇవి కూడా చదవండి
YSRCP Leaders Cruelty: వైసీపీ నేతల అరాచకం.. కన్నీరు పెట్టిస్తున్న వృద్ధురాలి వీడియో
Tiruvuru Politics: తిరువూరులో రసవత్తరంగా రాజకీయం
Read Latest AP News And Telugu News
Updated Date - Apr 06 , 2025 | 04:50 AM