Chandrababu: చంద్రబాబుకు సొంత ఇల్లు..
ABN , Publish Date - Apr 08 , 2025 | 05:22 PM
Chandrababu: రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు ఇంటి నిర్మాణానికి ముహూర్తం ఖారారు అయింది. బుధవారం ఉదయం వెలగపూడిలోని ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఆయన కుటుంబ సభ్యులు పాల్గొనున్నారు.

అమరావతి,ఏప్రిల్ 08: రాష్ట్ర రాజధాని అమరావతిలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇంటి నిర్మాణం శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు అయింది. బుధవారం ఉదయం శంకుస్థాపనలో భాగంగా భూమి పూజ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు పాల్గొనున్నారు. వెలగపూడి సచివాలయం వెనుక ఈ9 రహదారి పక్కనే ఈ ఇంటి నిర్మాణం చేపట్టనున్నారు.
తన ఇంటి నిర్మాణం ద్వారా రాజధాని అమరావతికి ఒక భరోసా, నమ్మకంగా ఉండాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అందులోభాగంగా ఇటీవల అమరావతిలో ఐదు ఎకరాల స్థలాన్ని సీఎం చంద్రబాబు నాయుడు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు భూమి పూజ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబానికి పట్టు వస్త్రాలు సమర్పించాలని గ్రామస్తులు నిర్ణయించారు. రాజధాని ఉద్యమ సమయంలో తమకు నారా భువనేశ్వరి ధైర్యం చెప్పారని గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. అలాగే అదే సమయంలో ఆమె తన గాజులను దానంగా అందజేశారని రైతులు వివరించారు. ఆ కుటుంబానికి తమ గ్రామం ఎంత ఇచ్చినా తక్కువేనని.. ఉడతా భక్తి కింద ఆ దంపతులకు పట్టు వస్త్రాలు సమర్పిస్తామని వారు పేర్కొన్నారు.
2500 గజాల్లో రాజధాని ఇంటి నిర్మాణాన్ని సీఎం చంద్రబాబు చేపట్టనున్న సంగతి తెలిసిందే. కార్యాలయం, నివాసంలోపాటు కారు పార్కింగ్ తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని సీఎం చంద్రబాబు ఈ ఇంటి నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఇంకోవైపు.. ఈ నిర్మాణ స్థలాన్ని ఇటీవల నారా భువనేశ్వరి సైతం పరిశీలించిన విషయం విదితమే.
గతంలో 2019 ఎన్నికలకు ముందు రాజధాని అమరావతికి మద్దతుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో ఇంటిని సైతం నిర్మించుకున్నారని ఆ పార్టీ నేతలు ఆర్కే రోజు, పేర్ని నాని తదితరులు ప్రకటించారు. రాజధాని అమరావతికి మద్దతుగా ఆయన ఈ నిర్మాణాన్ని చేపట్టారని వివరించారు. అలా ఆ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను ఆ పార్టీ గెలిచుకొంది. దీంతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఆ కొద్ది రోజులకే రాష్ట్రానికి మూడు రాజధానులంటూ వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. దీంతో రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులు ఉద్యమం చేపట్టారు. ఆ ఉద్యమం వందల రోజుల పాటు కొనసాగింది. ఇక 2024లో ఎన్నికల్లో జరిగాయి. ఈ ఎన్నికల్లో కూటమిలోని పార్టీలు మొత్తం 164 స్థానాలకు కైవసం చేసుకున్నాయి. అనంతరం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఆ తర్వాత రాజధాని అమరావతి పనులు ఊపందుకున్నా సంగతి తెలిసిందే.
For Andhrapradesh News And Telugu News