MP Mithun Reddy: ఎంపీ మిథున్ రెడ్డికి ఎదురుదెబ్బ.. లిక్కర్ స్కామ్ కేసులో..

ABN, Publish Date - Apr 03 , 2025 | 02:45 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు అన్ని ప్రభుత్వ శాఖలూ విధ్వంసం అయిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఎక్సైజ్ శాఖలోనూ అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వమే మద్యం షాపులు తెరిచి విక్రయాలు చేపట్టింది.

MP Mithun Reddy: ఎంపీ మిథున్ రెడ్డికి ఎదురుదెబ్బ.. లిక్కర్ స్కామ్ కేసులో..
MP Mithun Reddy

అమరావతి: మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. వైసీపీ హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై గతేదాడి సెప్టెంబరు 23న సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో కేసులో తన పేరు చేర్చి ఎక్కడ అరెస్టు చేస్తారేమో అనే భయంతో హైకోర్టును ఎంపీ మిథున్ రెడ్డి ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ అనుబంధ పిటిషన్‌ సైతం వేశారు. అయితే దీనిపై మార్చి 24న హైకోర్టులో వాదనలు జరిగాయి. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును ఇవాళ్టి(ఏప్రిల్ 3)కి వాయిదా వేసింది. ఈ మేరకు మిథున్ రెడ్డి వేసిన పిటిషన్‌ను కొట్టి వేస్తూ తీర్పు వెలువరించింది.


కేసు వివరాలు ఇవే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు అన్ని ప్రభుత్వ శాఖలూ విధ్వంసం అయిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఎక్సైజ్ శాఖలోనూ అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వమే మద్యం షాపులు తెరిచి విక్రయాలు చేపట్టింది. ఇష్టం వచ్చిన వారికి టెండర్లు కేటాయించింది. అలాగే వైసీపీ నేతలే మద్యం తయారు చేసి షాపులకు తరలించి వేల కోట్లు గడించారని పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. మద్యం దుకాణాల్లో ఆన్ లైన్ నగదు చెల్లింపులు చేయకుండా నేరుగా డబ్బులు తీసుకుని ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారని, మద్యం సరఫరాలోనూ అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఏపీ బెవరేజ్‌ కార్పొరేషన్‌ అప్పటి ఎండీ వాసుదేవరెడ్డిపై కేసు నమోదైంది. అయితే విచారణ సందర్భంగా వాసుదేవరెడ్డి ఇచ్చిన 161 స్టేట్‌మెంట్‌ను పరిశీలిస్తే నచ్చిన కంపెనీలకు మద్యం ఆర్డర్లు ఇవ్వడంలో మిథున్‌రెడ్డి కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఈ భయంతోనే వైసీపీ ఎంపీ హైకోర్టును ఆశ్రయించారు.


హైకోర్టులో వాదనలు..

ఎంపీ మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై మార్చి 23న వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా సీఐడీ తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా, మిథున్ రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్‌ తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతికి శస్త్రచికిత్స జరిగిందని, ఆయన్ను చూసేందుకు వచ్చినప్పుడు పిటిషనర్‌ను సీఐడీ అధికారులు అరెస్టు చేసే ప్రమాదం ఉందని నిరంజన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. అయితే ఈ కేసులో పిటిషనర్‌ను నిందితుడిగానే చేర్చలేదని, ఆయనకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదని, విచారణకు హాజరుకావాలని ఆదేశించలేదని సిద్ధార్థ లూథ్రా వెల్లడించారు. ఎఫ్‌ఐఆర్‌లో ఎంపీ పేరు లేదని, అపరిపక్వ దశలో ఉన్న కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేశారని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రత్యేక అధికారిగా ఉన్న సత్యప్రసాద్‌ ఇచ్చిన 164 స్టేట్‌మెంట్‌ ఆధారంగా మిథున్‌రెడ్డిని మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా చేర్చబోతున్నారని వచ్చిన మీడియా కథనాలు ఆధారంగా బెయిల్ కోరారని పేర్కొన్నారు. అలా‌ ముందస్తు బెయిల్ కోరడానికి వీల్లేదని లూథ్రా స్పష్టం చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు.. పిటిషనర్‌ను ఏప్రిల్ 3 వరకూ అరెస్టు చేయవద్దని ఆదేశాలు జారీ చేశారు. అలాగే తీర్పును ఏప్రిల్ 3కి వాయిదా వేశారు. ఈ మేరకు తాజాగా నేడు తీర్పు వెలువరించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Weather Updates: భాగ్యనగరంలో ఒక్కసారిగా మారిన వాతావరణం

Vijay Kumar ACB Questioning: రెండో రోజు విచారణకు విజయ్ కుమార్.. ఏం తేల్చనున్నారో

Updated Date - Apr 03 , 2025 | 03:33 PM