AP News: నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు ఘన నివాళులు: సీఎం, డిప్యూటీ సీఎం..
ABN , Publish Date - Jan 23 , 2025 | 11:55 AM
అమరావతి: భారత స్వాతంత్ర్య సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఘన నివాళులు అర్పించారు.

అమరావతి: భారత స్వాతంత్ర్య సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఘన నివాళులు అర్పించారు. బ్రిటిష్ పాలనలో మగ్గిపోతున్న ప్రజలకు అండగా నిలిచి, బ్రిటిష్ వారిని గడగడలాడించిన భరతమాత ముద్దుబిడ్డ నేతాజీ అంటూ కొనియాడారు. నిరంకుశ బ్రిటిష్ పాలకులను ఎదిరించేందుకు తనదైన పంథాలో పోరాడిన దేశభక్తుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని చంద్రబాబు అన్నారు. స్వతంత్ర భారతావని కోసం ఆయన చేసిన పోరాటం అనన్య సామాన్యమని కీర్తించారు. దేశం కన్నా ఏదీ మిన్న కాదు అని చెప్పిన ఆ యోధుని స్ఫూర్తి ఎప్పటికీ అనుసరణీయమేనని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. నేతాజీ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
విప్లవాత్మక స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు పరాక్రమ్ దివస్ సందర్భంగా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. ఈరోజు ఆయన అచంచల స్ఫూర్తి, భారత స్వాతంత్ర్య పోరాటానికి చేసిన విశేష కృషిని గౌరవించేందుకు అంకితం చేయబడిందని అన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్(ఇండియన్ నేషనల్ ఆర్మీ) స్థాపకుడిగా సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం నేతాజీ చేసిన అవిశ్రాంత పోరాటం లక్షలాది మంది హృదయాలను ఉత్తేజపరిచిందని పవన్ చెప్పుకొచ్చారు. వలసవాద అణచివేతకు వ్యతిరేకంగా కోట్ల మంది ప్రజలు గళం వినిపించడానికి నేతాజీ పోరాటం ప్రేరేపించిందని కొనియాడారు. "నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛను ఇస్తాను" అని దేశానికి నేతాజీ ఇచ్చిన శక్తివంతమైన పిలుపు దేశభక్తి, ధైర్యానికి నిదర్శనంగా నిలుస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు.