నేనొస్తున్నా..!
ABN , Publish Date - Apr 09 , 2025 | 01:27 AM
ఆమె కార్పొరేషన్‌లోని ఇంజనీరింగ్ విభాగంలో కీలక అధికారి. గత వైసీపీ ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలతో కోట్లకు పడగలెత్తారు. ఆమెపై అవినీతి నిరోధకశాఖ అధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదుల వెళ్లాయి. దీంతో వారు తమ హిట్‌లిస్ట్‌లో ఆమె పేరు చేర్చారు. ఇక రైడ్ చేయడమే ఆలస్యం అనుకుంటున్న సమయంలో విషయం గ్రహించిన సదరు మేడం ఆగమేఘాలపై మాతృసంస్థకు బదిలీ చేయించుకున్నారు. ఈ సారి కూటమిలోని ఓ పెద్ద నాయకుడి అండదండలతో మళ్లీ కార్పొరేషన్‌లోని కీలక పోస్టుకు వచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. మేడం అవినీతి గురించి తెలిసిన కమిషనర్ వెంటనే ఆమె రావాలనుకుంటున్న పోస్టుకు ఉన్న కీలక అధికారాలను మరో పోస్టుకు బదిలీ చేశారు. ఈ విషయం ఇప్పుడు కార్పొరేషన్‌లో చర్చనీయాంశంగా మారింది.

- కార్పొరేషన్‌లో కీలక పోస్టుకు అవినీతి మేడం ప్రయత్నాలు
- గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా వ్యవహారాలు
- రూ.కోట్లలో అవినీతి కార్యకలాపాలు.. ఏసీబీకి ఫిర్యాదులు
- ఏసీబీ హిట్‌లిస్ట్‌లో పేరు.. ఆగమేఘాలపై మాతృ సంస్థకు బదిలీ
- తృటిలో రైడ్ నుంచి తప్పించుకున్న వైనం
- మళ్లీ వచ్చేందుకు కూటమి పెద్ద నాయకుడితో మంతనాలు
- మేడం రావాలనుకుంటున్న పోస్టు అధికారాలకు కమిషనర్ కత్తెర
ఆమె కార్పొరేషన్‌లోని ఇంజనీరింగ్ విభాగంలో కీలక అధికారి. గత వైసీపీ ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలతో కోట్లకు పడగలెత్తారు. ఆమెపై అవినీతి నిరోధకశాఖ అధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదుల వెళ్లాయి. దీంతో వారు తమ హిట్‌లిస్ట్‌లో ఆమె పేరు చేర్చారు. ఇక రైడ్ చేయడమే ఆలస్యం అనుకుంటున్న సమయంలో విషయం గ్రహించిన సదరు మేడం ఆగమేఘాలపై మాతృసంస్థకు బదిలీ చేయించుకున్నారు. ఈ సారి కూటమిలోని ఓ పెద్ద నాయకుడి అండదండలతో మళ్లీ కార్పొరేషన్‌లోని కీలక పోస్టుకు వచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. మేడం అవినీతి గురించి తెలిసిన కమిషనర్ వెంటనే ఆమె రావాలనుకుంటున్న పోస్టుకు ఉన్న కీలక అధికారాలను మరో పోస్టుకు బదిలీ చేశారు. ఈ విషయం ఇప్పుడు కార్పొరేషన్‌లో చర్చనీయాంశంగా మారింది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ (వీఎంసీ)లోని ఇంజనీరింగ్ విభాగంలో ఒక కీలక పోస్టు నిర్వహించిన అధికారిణి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అవినీతికి ఆకాశమే హద్దు అన్నట్టుగా చెలరేగిపోయినట్లు ఆరోపణలు ఉన్నాయి. కార్పొరేషన్‌లో ఒక అవినీతి టీమ్ నడుపుతూ నగరాన్ని శాసించే స్థాయికి వచ్చారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఒక ఈఈ, ఒక డిప్యూటీ సిటీ ప్లానర్ (డీసీపీ), ఒక టీపీబీవో, కమిషనర్ పేషీలోని ఒక ఉద్యోగి, శానిటరీ వింగ్‌లో ఒక శానిటరీ సూపర్‌వైజర్ (ఎస్‌ఎస్) వీళ్లంతా మేడమ్ టీమ్‌లో అవినీతి మేట్స్. వీరంతా తమ తమ విభాగాల పరిధిలో ఫైల్స్‌ను మేడం దగ్గరకు తీసుకు వచ్చి క్లియర్ చేయిస్తారు. ఇందుకు గాను భారీ మొత్తంలో చేతులు మారాయన్న తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నాయి. నగరంలో మేడం అండ్ టీమ్ సాగించిన అవినీతి వ్యవహారాలపై ఏసీబీ డైరెక్టర్ జనరల్‌కు కూడా ఫిర్యాదులు అందడం గమనార్హం.
నామినేషన్ పద్ధతి పనుల్లో భారీగా అవినీతి
నగరంలో పార్కుల అభివృద్ధి, కాలువ గట్ల సుందరీకరణ, డివైడర్స్ - వాల్ పెయింట్స్, మొక్కల కొనుగోలు వంటి పనులను నామినేషన్ పద్ధతిలో కేటాయించటంలో భారీగా అవినీతి జరిగిందని నేరుగా ఏసీబీ డైరెక్టర్ జనరల్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. వార్డు సచివాలయ బదిలీలు, శాలరీ సర్టిఫికెట్ల మంజూరు, మెటర్నిటీ లీవులు, లాంగ్ లీవులు, గైర్హాజరైన వారిని విధుల్లోకి తీసుకోవటం, సస్పెన్షన్లు ఎత్తివేయటం, షోకాజ్ నోటీసులకు చర్యలు తీసుకోకుండా ఉండటానికి కూడా భారీ ఎత్తున మేడమ్ టీమ్ వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఏసీబీకి అందిన ఫిర్యాదు మేరకు చూస్తే పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి రైల్వే ట్రాక్ వరకు కాలువ ఒడ్డున గ్రీనరీ ఏర్పాటును బినామీ కాంట్రాక్టర్‌తో చేయించారని, ఈ పనికి అయిన ఖర్చు రూ. 20 లక్షలు అయితే రూ. కోటి అయినట్టుగా బిల్లు ఆమోదించారని ఫిర్యాదులో పేర్కొనటం జరిగింది. ఇదే పద్ధతిలో రాజీవ్‌గాంధీ పార్కు, అంబేడ్కర్ రాఘవయ్య పార్కు, ఐకానిక్ పార్క్, ఎక్సెల్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందని ఆరోపణలు ఉన్నాయి. రామవరప్పాడు రింగ్ రోడ్డు నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు చేపట్టిన గ్రానైట్ ఫుట్‌పాతల పనుల్లో కూడా భారీ అవినీతి జరిగిందని ఫిర్యాదులు వచ్చాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అంబేడ్కర్ స్మృతి వనం పనులలో కూడా భారీగా అవినీతికి పాల్పడినట్టు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏసీబీ టాప్-50 హిట్‌లిస్ట్‌లో మేడం పేరు కూడా ఉందంటే ఏ స్థాయిలో అవినీతి జరిగిందో అర్థం చేసుకోవచ్చు.
కలెక్షన్ ఏజెంట్లను పెట్టుకుని మరీ వసూళ్లు!
ఇంజనీరింగ్ విభాగం పరిధిలో పనులు చేసిన ఏ కాంట్రాక్టర్‌కు సంబంధించిన బిల్లుల ఫైల్స్ అయినా సరే మేడం దగ్గరకే రావాలి. మేడం దగ్గర ఉండే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒకరు.. మేడంకు కలెక్షన్ ఏజెంట్‌గా వ్యవహరించారన్న తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ఈ ఏజెంట్ కుమారుడు, అన్నయ్య ఫోన్ నంబర్లతోనే జరుగుతాయని సమాచారం. కాంట్రాక్టర్లు ఫోన్‌పేలు చేసిన తర్వాత.. కలెక్షన్ ఏజెంట్ ఆ ఫైల్స్ మేడం దగ్గరకు తీసుకు వెళ్లి క్లియర్ చేయిస్తారు. మేడమ్‌కు వచ్చిన కలెక్షన్‌లో కొంత మొత్తాన్ని కమీషన్‌గా ఏజెంట్‌కు ఇచ్చినట్లు సమాచారం.
కమిషనర్ పేషీ ఉద్యోగికి నెలకు 3 కేజీల డ్రై ఫ్రూట్స్
మేడమ్ అవినీతి మేట్స్‌లో ఒకరైన కమిషనర్ పేషీ ఉద్యోగికి డ్రై ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం. దీని కోసం శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ప్రతి నెలా ఆ ఉద్యోగికి మూడు కేజీల డ్రై ఫ్రూట్స్‌ను అందించాలి. డ్రై ఫ్రూట్స్ అందించకపోతే శానిటరీ విభాగంలో అల్లకల్లోలం జరిగిపోతుంది. తన అక్రమ ఆర్థిక వ్యవహారాలలో ప్రధాన భూమిక పోషిస్తున్న కమిషనర్ పేషీ ఉద్యోగి డ్రై ఫ్రూట్స్ కోరికను మేడం తీర్చుతున్నారు. అచ్చంగా డ్రై ఫ్రూట్స్ అందించటానికి కొందరు శానిటరీ సూపర్‌వైజర్లకు బాధ్యతలు అప్పగించటం గమనార్హం.
చాకచక్యంగా మాతృశాఖకు..
గతంలో కార్పొరేషన్‌లో పనిచేసిన ఒక ఉన్నతాధికారి బదిలీ అయ్యారు. ఆయన రిలీవ్ అయ్యే సమయంలో పెద్ద సంఖ్యలో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఫైల్స్‌ను క్లియరెన్స్ చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ ఫైల్స్ క్లియరెన్స్‌లో సాగించిన అవినీతి విలువ రూ.కోట్లలోనే ఉంటుంద న్న ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటిపైనా ఏసీబీ అధికారులు ధృష్టి సారించారు. తరచూ ఏసీబీకి చెందిన అధికారులు, పోలీసులు కార్పొరేషన్ గడపతొక్కటం, వివిధ ఫైల్స్‌కు సంబంధించిన సమాచారం తీసుకోవటం కొత్తగా వచ్చిన కమిషనర్ ధ్యానచంద్రకు తలనొప్పిగా మారింది. ఏసీబీ ఉన్నతాధికారులు మేడం మీద రైడ్ చేసే క్రమంలో ఆమె చాకచక్యంగా ఇక్కడి నుంచి మాతృశాఖకు వెళ్లి పోయారు. దీంతో రైడ్ తాత్కాలికంగా ఆగిపోయింది.
మళ్లీ కార్పొరేషన్‌కు వచ్చేందుకు కూటమి నేతలతో ప్రయత్నాలు
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రజాప్రతినిధులు, ఆ పార్టీ నేతలతో అంటకాగిన మేడం ప్రభుత్వం మారగానే.. ఏసీబీకి భయపడి మాతృశాఖకు వెళ్లిపోయారు. అక్కడ అవినీతి చేయటానికి అవకాశాలు లేకపోవటంతో మళ్లీ కార్పొరేషన్‌లో తిరిగి తన పాత పోస్టుకే వచ్చేం దుకు తొలుత ప్రయత్నాలు చేశారు. ఆ పోస్టులో ఇటీవలే మరొకరిని ప్రభుత్వం నియమిం చటంతో.. మరో కీలక పోస్టు కోసం ప్రయత్నాలు ఆరంభించారు. కూటమికి చెందిన ఓ పెద్ద నేత ద్వారా విజయవాడ కార్పొరేషన్‌లో కాలు పెట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం.
మేడం కన్నేసిన పోస్టు అధికారాలకు కమిషనర్ కత్తెర
సదరు అవినీతి అధికారిణి గురించి పూర్తి సమాచారం ఉన్న కమిషనర్ ధ్యానచంద్ర దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఆమె ఒకవేళ తనను అడిగితే తిరస్కరించాలని ఆయన నిర్ణయించినట్టు తెలిసింది. తనను అడగకుండా పోస్టింగ్ తెచ్చుకుంటే.. ఆమె అధికారాలు కత్తిరించాలన్న ఉద్దేశ్యంతో ముందస్తుగా ఆమె ఏ పోస్టు కోసం ప్రయత్నాలు చేస్తుందో ఆ పోస్టుకు సంబంధించిన కీలక అధికారాలన్నింటినీ మరో పోస్టుకు బదిలీ చేస్తూ కమిషనర్ ధ్యానచంద్ర ఏకంగా సర్క్యులర్‌ను జారీ చేశారు. దీంతో మేడం వచ్చినా.. అధికారాలు లేకుండా ఆ పోస్టులో పనిచేయాల్సి ఉంటుంది. ఈ విషయం కార్పొరేషన్‌లో చర్చనీయాంశంగా మారింది.