Indian Tax Department : విదేశీ ప్రయాణాలపై ఐటీ నజర్?
ABN, Publish Date - Jan 04 , 2025 | 04:45 AM
విదేశీ ప్రయాణాలు జరిపే భారతీయులపై ఇకపై ఆదాయపన్ను (ఐటీ) శాఖ కూడా నిఘా పెట్టనుంది. ఇప్పటి వరకు అడ్వాన్స్‌డ్ ప్యాసింజర్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఏపీఐబీ) ద్వారా ఇంటిలిజెన్స్ వర్గాలు..
దుబాయ్, అమెరికా ప్రయాణాలపై దృష్టి
విమాన టికెట్, భోజనాలు, లగేజీ విశ్లేషణ
వివరాల కోసం ఎయిర్‌లైన్స్‌కు సర్క్యులర్లు
ఈ నెల 10వ తేదీ వరకు గడువు విధింపు
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
విదేశీ ప్రయాణాలు జరిపే భారతీయులపై ఇకపై ఆదాయపన్ను (ఐటీ) శాఖ కూడా నిఘా పెట్టనుంది. ఇప్పటి వరకు అడ్వాన్స్‌డ్ ప్యాసింజర్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఏపీఐబీ) ద్వారా ఇంటిలిజెన్స్ వర్గాలు.. అతిథి యాప్ ద్వారా కస్టమ్స్ శాఖ, డీఆర్‌ఐ నిఘా పెట్టేవి. అదే కోవలో ఇప్పుడు ఐటీ శాఖ కూడా విమానయాన సంస్థలు భారతీయుల ప్రయాణాల వివరాలను అందించేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. భారత్‌కు రాకపోకలు సాగించే దేశ, విదేశీ విమానయాన సంస్థలు ఈ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించాల్సిందేనని.. ఈ నెల 10వ తేదీలోగా ఆ పనిని పూర్తి చేయాలని సర్క్యులర్లు జారీ చేసింది. అంతేకాదు.. ఏప్రిల్ 1 నుంచి రెండు విదేశీ విమానయాన సంస్థల విషయంలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేయనుంది. జూన్ 1 నుంచి అన్ని విమానయాన సంస్థలను తన నిఘా పరిధిలోకి తీసుకురానుంది.
విమానయాన సంస్థలకు ఆదేశాలు
ఈ వివరాల సేకరణకు ఐటీ శాఖ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. భారత్‌కు రాకపోకలు సాగించే అన్ని విమానయాన సంస్థలు దీన్ని వినియోగించాలంటూ సర్క్యులర్లు జారీ చేసింది. ఈ నెల 10వ తేదీ వరకు గడువిచ్చింది. ఆలోగా సాఫ్ట్‌వేర్‌లో లాగిన్ అవ్వని విమానయాన సంస్థలకు దేశంలోని విమానాశ్రయాల్లో ప్రవేశం ఉండబోదని హుకుం జారీ చేసింది. ప్రయాణికుల సమ్మతితో సంబంధం లేకుండా.. ఈ సమాచారాన్ని అందజేయాలని విమానయాన సంస్థలను ఆదేశించింది. రెండు విదేశీ విమానాయాన సంస్థల్లో ఈ విధానాన్ని ఫిబ్రవరి 25 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు ఆ సర్క్యులర్‌లో పేర్కొంది. మార్చి 1 నుంచి అన్ని విమానయాన సంస్థలకూ ఈ విధానం అమలవుతుంది.
వ్యక్తిగత వివరాలు ఇవే..
విమానయాన సంస్థల నుంచి ఐటీ శాఖ సేకరించే వ్యక్తిగత వివరాల్లో ప్రయాణికుడి పేరు, పుట్టిన తేదీ, పాస్‌పోర్టు నంబర్, మొబైల్ ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, విమాన టికెట్ కొనుగోలు తేదీ, టికెట్ కొనుగోలు చేసేందుకు వినియోగించిన క్రెడిట్ కార్డు నంబర్ వంటి వివరాలను సేకరించనుంది. ఈ సమాచారాన్ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి(సీబీడీటీ) విశ్లేషించి, సంబంధిత ఐటీ జోన్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్(సీఐయూ)కు పంపుతుందని సమాచారం. సీబీడీటీ ఇప్పటికే ఈ వివరాలను కృత్రిమ మేధ(ఏఐ) సాయంతో సేకరిస్తూ.. పన్ను మోసాలు, జీఎస్టీ ఎగవేతలను నియంత్రిస్తోంది. ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా కచ్చితత్వంతో సమగ్ర డేటా అందుతుందని ఐటీ శాఖ భావిస్తోంది.
ఆన్‌బోర్డ్ చాయ్ వివరాలు కూడా
విదేశీ ప్రయాణాలు చేసే భారతీయులు చాలా వరకు ఆదాయపన్ను చెల్లించేవారే ఉంటారు. అయితే.. కొందరు ఎగవేతదారులు కూడా విదేశీ ప్రయాణాలు చేస్తున్నట్లు ఐటీ శాఖ అనుమానిస్తోంది. ఈ క్రమంలో విమాన టికెట్ పీఎన్‌ఆర్ నంబరుపై ఎంత మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు? బంధుమిత్రులను వెంట తీసుకెళ్తున్నారా? టికెట్‌ను ఎంతకు కొన్నారు? ఎలా కొన్నారు? బ్యాగేజీ బరువెంత? విమానంలో ఏం తిన్నారు(చాయ్ మొదలు వెజ్, నాన్‌వెజ్, లిక్కర్)? అనే వివరాలను కొత్త సంవత్సరంలో రికార్డు చేయనుంది.
Updated Date - Jan 04 , 2025 | 04:45 AM