Jagans Visit Sparks Chaos: పరామర్శలో అరాచకం
ABN , Publish Date - Apr 09 , 2025 | 03:59 AM
వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటనలో బలప్రదర్శనతో అఘాయిత్యానికి దారితీసింది. పోలీసులపై దాడి, హెలికాప్టర్‌కు హానీ, భద్రతా వైఫల్యాన్ని కూర్చి రాజకీయ దూషణ చర్చలు మొదలయ్యాయి

జగన్నాటకం..!
జగన్ పర్యటనలో హైడ్రామా
పరామర్శకు వెళ్లి.. బల ప్రదర్శన
హెలిప్యాడ్ వద్ద వైసీపీ శ్రేణుల ఇష్టారాజ్యం
బారికేడ్లు విరిచి.. పోలీసులను పక్కకు తోసి..
హెలికాప్టర్ చుట్టూ మూగిన వైనం
పైలెట్ బ్యాగ్ తస్కరణ?
భద్రతా వైఫల్యంగా చిత్రీకరించే కుట్ర!?
విండ్‌షీల్డ్ దెబ్బతిన్నదని వెల్లడి
అదే నిజమైతే.. హెలికాప్టర్ ఎలా ఎగిరింది?
రోడ్డు మార్గంలో బెంగళూరుకు జగన్
(అనంతపురం/పుట్టపర్తి/అమరావతి - ఆంధ్రజ్యోతి)
పేరు.. పరామర్శ కోసం పర్యటన! చేసింది.. బల ప్రదర్శన!
స్వీయ నియంత్రణ లేదు. క్రమశిక్షణ అసలే లేదు. పోలీసులన్నా లెక్కలేదు. అంతా అడ్డగోలుతనం! వెరసి... మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ‘పరామర్శ యాత్ర’ ఒక అరాచక పర్వాన్ని తలపించింది. చేయాల్సిందంతా చేసి... ‘పోలీసులు తగిన భద్రత కల్పించలేదు. హెలికాప్టర్ విండ్‌షీల్డ్ దెబ్బతినడంతో జగన్ రోడ్డు మార్గాన వెళ్లాల్సి వచ్చింది’ అంటూ హైడ్రామాకు తెరలేపారు. విండ్‌షీల్డ్ దెబ్బతినడం నిజమే అయితే... మరమ్మతులు చేయకుండా మళ్లీ గాలిలోకి ఎగిరే అవకాశమే లేదు. కానీ... జగన్‌ను అక్కడ వదిలేసి, పైలట్ ఎంచక్కా బెంగళూరుకు వెళ్లిపోయాడు. ఒకవేళ నిజంగానే దెబ్బతిని ఉంటే... దానికి కారణం, వైసీపీ నేతలు, కార్యకర్తల అడ్డగోలుతనం, అరాచకమే! శ్రీసత్యసాయి జిల్లా జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని మంగళవారం జగన్ పరామర్శించారు. జగన్ పర్యటన నేపథ్యంలో.. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ ముఖ్యనేతలు భారీగా జన సమీకరణ చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు తరలి వచ్చారు. వచ్చిన వాళ్లు పద్ధతిగా ఉన్నారా అంటే అదీ లేదు. జగన్ హెలికాప్టర్ దిగింది మొదలు వీరంగం సృష్టించారు. ఈలలు, కేకలు వేస్తూ భయానక వాతావరణం సృష్టించారు.
జగన్ బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో కుంటిమద్ది సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద దిగారు. ఆ క్షణం నుంచే కార్యకర్తలు పూనకం వచ్చినట్లుగా ఊగిపోయారు. బారికేడ్లను తోసేసి ముందుకు దూసుకుపోయారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను లెక్కచేయలేదు. వారిపైనా తిరగబడి... తోసుకుని వెళ్లిపోయారు. ఈ పరిణామంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. వైసీపీ శ్రేణులను అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు నానా తంటాలు పడ్డారు. అప్పటికే... వైసీపీ కార్యకర్తలు జగన్ హెలికాప్టర్ చుట్టూ మూగారు. హెలికాప్టర్ డోర్లు లాగి, అందులోని పైలట్ బ్యాగ్‌ను తస్కరించినట్లు కూడా తెలుస్తోంది. పోలీసులు అతి కష్టం మీద జగన్‌ను బయటికి తీసుకొచ్చారు.
అంతా పథకం ప్రకారమేనా...
‘భద్రతా వైఫల్యం’ అంటూ ప్రభుత్వంపై నిందలు వేసేందుకు వైసీపీ నేతలు పథకం ప్రకారం నడుచుకున్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. జగన్ వచ్చింది... హత్యకు గురైన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు! అక్కడ ర్యాలీలు, సభలూ నిర్వహించలేదు. అయినా సరే... హెలిప్యాడ్ వద్దకు కూడా కార్యకర్తలను తరలించారు. పోలీసులు హెలిప్యాడ్‌లోకి అనుమతి పొందిన వైసీపీ ముఖ్యనాయకులను మాత్రమే పంపించారు. కానీ జగన్ హెలికాప్టర్ ల్యాండ్ అవ్వగానే వందలమంది కార్యకర్తలు దూసుకెళ్లారు.
దెబ్బతినడం నిజమా...: పరామర్శ యాత్ర సందర్భంగా వైసీపీ ఆడిన డామ్రాలన్నీ కొన్ని గంటల్లోనే బట్టబయలయ్యాయి. ‘‘పోలీసులు జగన్ పర్యటనకు అడ్డు తగులుగుతున్నారు. కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. హెలిప్యాడ్‌వద్దకు ఎవరినీ రానివ్వడంలేదు’’ అంటూ మంగళవారం ఉదయం 11 గంటలకు వైసీపీ ఒక ట్వీట్ చేసింది. ఆ తర్వాత అరగంటలోనే... ‘హెలిప్యాడ్ వద్ద కనీస భద్రత కరువు.
జనం తాకిడితో దెబ్బతిన్న హెలికాప్టర్ విండ్ షీల్డ్’ అంటూ మరో ట్వీట్ పెట్టారు. కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారని వాపోయిందీ వాళ్లే... అడ్డుకోలేక పోయారని నిందించేదీ వాళ్లే. ఇక... ‘విండ్ షీల్డ్ దెబ్బతినింది. దీని వెనుక కుట్ర ఉంది’ అని వైసీపీ నేతలు మరో హైడామ్రాకు తెరలేపారు. హెలిప్యాడ్ చుట్టూ బారికేడ్లు పెట్టి... ఏకంగా 250 మంది పోలీసులను మోహరించినా వైసీపీ కార్యకర్తలు అరాచకంగా వ్యవహరించారు. కొందరైతే హెలికాప్టర్‌ను పట్టుకుని వేలాడారు. దీంతో జగన్ సుమారు 15 నిమిషాలపాటు లోపలే ఉండిపోవాల్సి వచ్చింది. పోలీసులు అతికష్టం మీద కార్యకర్తలను పక్కకు తోసేసి... జగన్‌ను బయటికి తీసుకొచ్చారు. జగన్ అక్కడి నుంచి పాపిరెడ్డిపల్లికి వెళ్లిన అరగంటకు...హెలికాప్టర్ బెంగళూరుకు వెళ్లిపోయింది. ‘విండ్‌షీల్డ్ దెబ్బతినడంతో వీవీఐపీని తీసుకెళ్లలేమంటూ పైలట్ వెళ్లిపోయారు’ అని వైసీపీ నేతలు పేర్కొన్నారు. అయితే... విండ్‌షీల్డ్ దెబ్బతింటే పైలట్ ఎందుకు హెలికాప్టర్‌లో ప్రయాణిస్తారని టీడీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ‘వన్ వే’కే హెలికాప్టర్‌ను మాట్లాడుకున్నారని కూడా అనుమానిస్తున్నారు.
బాధితులకే ట్రైనింగ్: మృతుడు కురబ లింగమయ్య కుటుంబ సభ్యుల పరామర్శ కూడా చిత్ర విచిత్రంగానే జరిగింది. బాధిత కుటుంబాన్ని సముదాయించి... సంఘటన ఎలా జరిగిందో వారి నుంచి తెలుసుకోవాల్సిన జగన్, రివర్స్‌లో వారికే సంఘటన గురించి ఎలా చెప్పాలో ట్రైనింగ్ ఇచ్చారు. లింగమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడారు. 2019 ఎన్నికల ముందు బాబాయ్ వివేకాను గొడ్డలితో నరికి చంపిన తీరును కళ్లారా చూసినట్లు ఎలా చెప్పారో... అదే విధంగా లింగమయ్య హత్య గురించి కూడా వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు..
సీతమ్మవారికి తాళి కట్టిన వైసీపీ ఎమ్మెల్యే
For More AP News and Telugu News