Share News

Supreme Court: వివేకా హత్య కేసు..ఉదయ్ కుమార్ రెడ్డికి సుప్రీం నోటీసులు..

ABN , Publish Date - Apr 15 , 2025 | 12:52 PM

వైఎస్ వివేకా హత్య జరిగిన తరువాత గాయాలు కనపడకుండా కట్లు కట్టి, గుండెపోటుగా చిత్రీకరించిన వారిలో ఉదయ్ కుమార్ రెడ్డి ఒకరని సునీతా తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీంతో సుప్రీంకోర్టు ఉదయ్ కుమార్ రెడ్డికి నోటీసులు జారీచేసింది.

Supreme Court: వివేకా హత్య కేసు..ఉదయ్ కుమార్ రెడ్డికి సుప్రీం నోటీసులు..
YS Vivekananda Reddy murder case

న్యూఢిల్లీ: వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (YS Vivekananda Reddy murder case) పై మంగళవారం సుప్రీంకోర్టు (Supreme Court) కీలక విచారణ జరిపింది. వివేకా హత్య కేసులో నిందితుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి (Uday Kumar Reddy) బెయిల్ రద్దు (bail cancellation) చేయాలని సునీతా రెడ్డి ( Sunitha Reddy) సుప్రీంలో పిటీషన్ (petition) దాఖలు చేశారు. దీనిపై సీజేఐ సంజీవ్ ఖన్నా (CJI Sanjiv Khanna) ధర్మాసనం ముందు విచారణ (Hearing) జరిగింది. వివేకా హత్య కేసులో గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి పాత్ర ఏమిటని సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు. వివేకా హత్య జరిగిన తరువాత గాయాలు కనపడకుండా కట్లు కట్టి, గుండెపోటుగా చిత్రీకరించిన వారిలో ఉదయ్ కుమార్ రెడ్డి ఒకరని సునీతా తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీంతో సుప్రీం కోర్టు ఉదయ్ కుమార్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. అవినాశ్ రెడ్డితో పాటు మిగతా వారి బెయిల్ రద్దుకు సంబంధించిన పిటీషన్లతో ఈ పిటీషన్‌ను జతచేయాలని సూచిస్తూ.. తదుపరి విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.

Also Read..: ఏపీ మంత్రివర్గం కీలక చర్చలు..


కాగా వైఎస్‌ వివేకా హత్య కేసు విచారణలో ఏం జరుగుతోందని తెలంగాణ హైకోర్టు సీబీఐని ప్రశ్నించింది. గత 19 నెలలుగా సీబీఐ కోర్టులో విచారణ ఒకే దశలో ఉందని.. ముందుకు కదలడం లేదని వ్యాఖ్యానించింది. ‘సీఆర్పీసీ 207 (ప్రాసిక్యూషన్‌ పత్రాల కాపీలను నిందితులకు అందజేయడం) దశ దాటడానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుంది.. సీబీఐ సమర్పించిన హార్డ్‌డిస్క్‌లలోని మొత్తం 13 లక్షల పత్రాలలో దాదాపు 11 లక్షలు తెరవడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది’ అని అడిగింది. వివేకా హత్య కేసులో నిందితుడైన దస్తగిరికి కడప కోర్టు క్షమాభిక్ష పెడుతూ అప్రూవర్‌గా గుర్తించడాన్ని సవాల్‌ చేస్తూ.. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. దస్తగిరిని సాక్షిగా గుర్తిస్తూ నాంపల్లి సీబీఐ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ నిందితులు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి మరో పిటిషన్‌ దాఖలు చేశారు. మొత్తం మూడు వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ విచారణ చేపట్టారు. వివేకా హత్య కేసు విచారణ సీబీఐ కోర్టులో ఏ దశలో ఉందని ప్రశ్నించారు. సీబీఐ సమర్పించిన 13 లక్షల పత్రాలలో ఇప్పటివరకు దాదాపు 2.30 లక్షలు తెరిచినట్లు న్యాయవాదులు పేర్కొన్నారు. అంటే మిగతా 11 లక్షలు తెరవడానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుందని న్యాయమూర్తి ప్రశ్నించారు.


ఈ సమస్యను పరిష్కరించడానికి నిందితులకు కొత్త హార్డ్‌డి‌స్కులు ఇచ్చినట్లు సీబీఐ తరఫు న్యాయవాది కాపాటి శ్రీనివాస్‌ తెలిపారు. ఇక మీ ఇష్టమని న్యాయమూర్తి అన్నారు. కాగా.. దస్తగిరికి క్షమాభిక్ష పెట్టడం సరికాదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తెలిపారు. తమ పిటిషన్లపై సీబీఐ కౌంటర్‌ దాఖలు చేసిందని.. పూర్తి స్థాయి వాదనలకు సమయం కేటాయించాలని కోరారు. వివేకా కుమార్తె సునీతారెడ్డి తరఫు న్యాయవాది ఎస్‌.గౌతమ్‌ వాదనలు వినిపిస్తూ.. దస్తగిరికి కడప కోర్టు ఇచ్చిన క్షమాభిక్ష కేసులో తాము ఇప్పటికే ఇంప్లీడ్‌ అయ్యామని తెలిపారు. అలాగే సీబీఐ కోర్టు సాక్షిగా గుర్తించిన కేసులోనూ ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేస్తామని పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ నెల 16న (బుధారం) పూర్తి స్థాయి వాదనలు వింటామన్నారు. అలాగే హత్య కేసు విచారణను వేగవంతం చేయాలంటూ సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సీజే ధర్మాసనానికి బదిలీ చేసినట్లు తెలిపారు. తదుపరి విచారణను 16వ తేదీకి వాయిదా వేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఖైదీతో స్నేహితుల రీల్స్.. వీడియో వైరల్..

పాము కాటుకు గురైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

చిత్తూరు జిల్లాలో పరువు హత్య..

For More AP News and Telugu News

Updated Date - Apr 15 , 2025 | 12:52 PM