CID : అగ్రిగోల్డ్‌ బినామీ ఆస్తుల గుర్తింపు!

ABN, Publish Date - Feb 15 , 2025 | 06:10 AM

అగ్రిగోల్డ్‌ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ సంస్థ యజమానులు..

CID : అగ్రిగోల్డ్‌ బినామీ ఆస్తుల గుర్తింపు!
  • 4 రాష్ట్రాల్లో స్థిర, చరాస్తులు కంపెనీల్లో షేర్లు కూడా..

  • వీటి విలువ రూ.వేల కోట్లపైనే!

  • వాటి జప్తునకు హోం శాఖ ఉత్తర్వులు

ఏలూరు క్రైం, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): అగ్రిగోల్డ్‌ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ సంస్థ యజమానులు.. బినామీల పేరుతో దాచుకున్న రూ.వేల కోట్ల విలువైన ఆస్తులను రాష్ట్ర సీఐడీ అధికారులు గుర్తించారు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో స్థిర, చరాస్తులు, కంపెనీల్లో షేర్లు ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదించారు. దీంతో వాటిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశిస్తూ రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజీత్‌ శుక్రవారం రాత్రి జీవో 21 విడుదల చేశారు. దీంతో వీటిని కూడా జప్తు చేసేందుకు అనుమతి కోసం సీఐడీ అధికారులు కోర్టులో పిటిషన్‌ వేయనున్నారు. అగ్రి గోల్డ్‌ సంస్థపై 2015 జనవరిలో ఏలూరు జిల్లా పెదపాడు పోలీసు స్టేషన్‌లో మొట్టమొదటి కేసు నమోదైన సంగతి తెలిసిందే. పెదపాడు మండలం వడ్డిగూడేనికి చెందిన ఘంటసాల వెంకటేశ్వరమ్మ ఈ సంస్థలో రూ.20 వేలు డిపాజిట్‌ చేశారు. గడువు తీరిపోయాక 2014 అక్టోబరులో ఆమెకు రూ.40 వేలను చెల్లించాల్సి ఉంది. ఆమె మనవడు వెంకన్నబాబు డిపాజిట్‌ బాండ్‌ను తీసుకుని ఏలూరు అగ్రిగోల్డ్‌ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ నగదు ఇవ్వకపోవడంతో 2015 జనవరిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలా అగ్రిగోల్డ్‌పై తొలి ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. తర్వాత ఏడు రాష్ట్రాల్లో ఆ సంస్థపై కేసులు దాఖలయ్యాయి. మొత్తం 40 లక్షల మంది బాధితుల నుంచి రూ.వేల కోట్లు డిపాజిట్లుగా సేకరించారని ఫిర్యాదులు అందడంతో 2016లోనే ఆ సంస్థ చైర్మన్‌ అవ్వా వెంకట రామారావు సహా మొత్తం 25 మందిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లోని అగ్రిగోల్డ్‌ కేసులపై ఏలూరు జిల్లా కోర్టులోనే విచారణ సాగుతోంది. పెదపాడు పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులో అగ్రిగోల్డ్‌ ఆస్తుల జప్తునకు ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు ఇచ్చింది.


ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కర్నూలు, ప్రకాశం, కడప, చిత్తూరు, నెల్లూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మొత్తం 15 కేసులు నమోదయ్యాయి. అప్పట్లో ఈ కేసులకు సంబంధించి సీఐడీ పోలీసులు రూ.6 వేల కోట్ల విలువైన స్థిర, చరాస్తులను జప్తు చేశారు. ఇవికాకుండా పలువురు బినామీల పేర్లతో ఆస్తులు ఉన్నట్లు వచ్చిన సమాచారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టారు. 179 స్థిరాస్తులు (విశాఖపట్నం జిల్లా సౌభాగ్యపురం, గండిగుండంలోని 26 స్థిరాస్తులతో కలిపి), 16చరాస్తులు, 17కంపెనీల పేరిట షేర్లు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో ఖరీదైన వ్యాపార కాంప్లెక్స్‌లు, కమర్షియల్‌ సైట్లు, గ్రీన్‌ సిటీలు, వెంచర్స్‌ కూడా ఉన్నాయి.

Updated Date - Feb 15 , 2025 | 06:10 AM