ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Management Board: ఇచ్చిపుచ్చుకోండి!

ABN, Publish Date - Feb 28 , 2025 | 03:21 AM

నాగార్జున సాగర్‌లో మిగిలి ఉన్న జలాలను ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సర్దుకుంటూ వాడుకోవాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సూచించింది.

  • సాగర్‌లో మిగిలిన నీటిని పొదుపుగా వాడుకోండి

  • 2 రాష్ట్రాలకు కృష్ణా బోర్డు చైర్మన్‌ సూచన

  • వినియోగంపై 15 రోజులకోసారి ఈఎన్‌సీ స్థాయిలో సమీక్ష

  • హైదరాబాద్‌ జలసౌధలో కేఆర్‌ఎంబీ భేటీ

  • ఏపీ ఎక్కువ నీటిని వాడుకుందన్న తెలంగాణ

  • ఖండించిన ఏపీ.. గతం గతః అని సర్దిచెప్పిన అతుల్‌ జైన్‌

అమరావతి, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): నాగార్జున సాగర్‌లో మిగిలి ఉన్న జలాలను ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సర్దుకుంటూ వాడుకోవాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సూచించింది. గురువారం హైదరాబాద్‌ జలసౌధలోని కేఆర్‌ఎంబీ కార్యాలయంలో సాగర్‌, హంద్రీ-నీవా ద్వారా కృష్ణా జలాలను సాగు, తాగునీటి అవసరాలకు వాడుకోవడంపై కేఆర్‌ఎంబీ చైర్మన్‌ అతుల్‌ జైన్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక సీఎస్‌, జి.సాయిప్రసాద్‌, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు.. తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ఆ రాష్ట్ర ఈఎన్‌సీ అనిల్‌కుమార్‌, సీఈ రమేశ్‌ బాబు, ఎస్‌ఈ విజయ్‌కుమార్‌ హాజరయ్యారు. ‘నీటి వాడకంపై ఈఎన్‌సీ స్థాయిలో 15 రోజులకోసారి సమీక్షించుకోండి. కార్యదర్శుల స్థాయిలో నెల రోజులకోసారి చర్చించుకోవాలి. ఆ తర్వాత కేఆర్‌ఎంబీ త్రిసభ్య కమిటీ నెలకోసారి సమావేశమై.. పరిస్థితిని సమీక్షించుకుందాం’ అని జైన్‌ ఈ సందర్భంగా సలహా ఇచ్చారు. వరద సమయంలోనూ పోతిరెడ్డిపాడు నుంచి నీటిని ఏపీ వాడుకుందని.. కేసీ కెనాల్‌ ద్వారా కూడా నీటిని వాడుకుందని గతంలో చేసిన ఆరోపణలనే తెలంగాణ ప్రస్తావించింది. నాగార్జున సాగర్‌ నుంచీ వాడేసుకుందని తెలిపింది. ఈ వాదనలను ఏపీ తీవ్రంగా ఖండించింది. వరద నీరు సముద్రంలోకి వెళ్తుంటే రాష్ట్రావసరాలకు వాడుకున్నామని పునరుద్ఘాటించింది. పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తీసుకున్నా.. ఆతర్వాత పై నుంచి వచ్చిన వరద కారణంగా శ్రీశైలం జలాశయం నిండినందున.. 20 టీఎంసీల నష్టం వాటిల్లిందన్న వాదనలోనూ పస లేదంది. శ్రీశైలం, సాగర్‌లలో విద్యుదుత్పత్తి ద్వారా దిగువకు నీటిని వదిలి సముద్రంపాలు చేసింది తెలంగాణేనని ఆక్షేపించింది.


దీంతో చైర్మన్‌ జోక్యం చేసుకుని.. గతంలో జరిగినవి ఇప్పుడు అప్రస్తుతమన్నారు. ప్రస్తుతం సాగర్‌ కుడి ప్రధాన కాలువ నుంచి ఏపీకి వదులుతున్న ఏడు వేల క్యూసెక్కులు.. తెలంగాణ కోసం వదులుతున్న తొమ్మిది టీఎంసీలు.. పంటలను కాపాడుకోవడానికి సరిపోతాయో లేదో ఈఎన్‌సీల స్థాయిలో చర్చించుకోవాలన్నారు. ఉన్న నీటిని పంటలకు సర్దుకోవడం.. తాగునీటి అవసరాలు తీర్చుకోవడంపై దృష్టి సారించాలని, ఎలిమినేటి మాధవరెడ్డి కాలువ, హంద్రీ-నీవా నీటినీ సమీక్షించుకోవాలని సూచించారు. నెల తర్వాత కార్యదర్శుల స్థాయిలో మాట్లాడుకుని.. అవసరాలకు అనుగుణంగా సాగర్‌లో అందుబాటులో ఉన్న జలాలను ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వాడుకోవాలని సూచించారు. రెండు రాష్ట్రాల సీఈల కమిటీ జూన్‌ వరకు ఏపీకి 55, తెలంగాణకు 63 టీఎంసీలు అవసరమంటూ ఇచ్చిన నివేదికపైనా చర్చించారు. అనంతరం చైర్మన్‌ సూచన మేరకు ఈఎన్‌సీలు వెంకటేశ్వరరావు, అనిల్‌కుమార్‌ సమావేశమై సుహృద్భావ వాతావరణంలో చర్చించుకున్నారు. పంటల రక్షణకు సాగర్‌ కుడి కాలువ నుంచి 7 వేల నుంచి 8 వేల క్యూసెక్కులు.. ఎడమ కాలువ నుంచి 7 వేల క్యూసెక్కులను వాడుకోవాలని నిర్ణయించారు. శ్రీశైలం జలాల వాడకంలో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిచ్చేందుకు అంగీకరించారు.

Updated Date - Feb 28 , 2025 | 03:21 AM