Chandrababu Key Instructions: మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు
ABN, Publish Date - Apr 03 , 2025 | 04:11 PM
Chandrababu Key Instructions: ఏపీ మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. చేసిన మంచి చెప్పుకోవడానికి ఇబ్బందులు పడుతుంటే లేని నిందలు మనపై వేసే కుట్రలు చేస్తున్నారన్నారు.

అమరావతి, ఏప్రిల్ 3: పాస్టర్ ప్రవీణ్ మరణం విషయంలో ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని వైసీపీ చూస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) విమర్శించారు. కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయిన సీఎం.. పలు రాజకీయ అంశాలను ప్రస్తావించారు. ప్రవీణ్ మరణానికి సంబంధించి సీసీ కెమెరాల్లో ఒక్కో అంశం బయటకు వస్తోందన్నారు. ప్రవీణ్ డెత్ మిస్టరీ ఛేదనలో సీసీ కెమెరాలది కీలక పాత్ర అని చెప్పుకొచ్చారు. మనం అప్రమత్తంగా లేకుంటే.. బాబాయ్ గొడ్డలి, కోడికత్తి, గులకరాయి తరహాలో అన్నీ మనపైనే వేస్తారని అన్నారు. చేసిన మంచి చెప్పుకోవడానికి ఇబ్బందులు పడుతుంటే లేని నిందలు మనపై వేసే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో మంచి ఉద్దేశంతో పోస్టులు పెడుతుంటే వాటిని వక్రీకరించి చెడు సందేశాలను వ్యాప్తి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నింటిపై అప్రమత్తంగా ఉంటూ కుట్రలను తిప్పికొడదామని మంత్రులకు సీఎం సూచించారు.
గత వైసీపీ ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలను ఆప్కాస్ ద్వారా దుర్వినియోగం చేసిందని విమర్శించారు. విచ్చలవిడి నియామకాలతో వ్యవస్థలను నాశనం చేశారన్నారు. ఒక టీటీడీలోనే 4వేల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులున్నారని తెలిపారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు సరైన విధివిధానాలు అవసరమన్నారు. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి ఔట్ సోర్సింగ్ నియామకాలను సక్రమ పద్ధతికి తీసుకొద్దామని తెలిపారు. స్వర్ణ గ్రామం పేరుతో ఉన్నతాధికారులు పల్లె నిద్ర చేయాలి అని సీఎం ఆదేశించారు. ఉన్నతాధికారులు 3 రోజులు, 2 రాత్రులు పల్లెనిద్ర చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి పల్లెనిద్ర, పల్లె వెలుగు, స్వర్ణ గ్రామం పేర్లు పరిశీలన చేయాలన్నారు.
ఇరుగుపొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ ఇచ్చే సంక్షేమ పథకాలు నాలుగు రెట్లు అధికమని చెప్పుకొచ్చారు. ఇంత చేసి సరైన ప్రచారం చేసుకోలేక పోతున్నాం అని కేబినెట్ అనంతరం సీఎం అన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కర్మయోగి ట్రైనింగ్ ప్రోగ్రామ్‌పై కేబినెట్‌లో చర్చించారు. విజన్ 2047పైన మంత్రులతో చర్చించారు. శాఖలకు స్వయంప్రతిపత్తి కల్పించే దిశగా ఆప్కాస్‌ను ఎలా వినియోగించాలి, ఆప్కాస్ పైన మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసే యోచనపై క్యాబినెట్‌లో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. బుషికొండ ప్యాలెస్‌ను వినియోగంలోకి ఎలా తీసుకురావాలి అనే అంశంపై చర్చించాలని తెలిపారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఋషికొండ ప్యాలెస్‌ను సందర్శించి అభిప్రాయలు చెప్పాలని మంత్రులతో ముఖ్యమంత్రి అన్నారు.
ఇవి కూడా చదవండి
కళ్లను బాగా రుద్దుతున్నారా.. జాగ్రత్త
Vijay Kumar ACB Questioning: రెండో రోజు విచారణకు విజయ్ కుమార్.. ఏం తేల్చనున్నారో
Read Latest AP News And Telugu News
Updated Date - Apr 03 , 2025 | 04:35 PM