CM Chandrababu: విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చింది టీడీపీనే
ABN , Publish Date - Mar 13 , 2025 | 02:41 PM
CM Chandrababu: గత వైసీపీ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు సీఎం చంద్రబాబు. విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఉన్న ఏపీని లోటు పరిస్థితికి తీసుకెళ్లింది వైసీపీ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. పరిశ్రమలు కరెంటు వాడితే సర్చార్జి విధించిన పరిస్థితి గత ప్రభుత్వానిదన్నారు.

అమరావతి, మార్చి 13: ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా విద్యుత్ వినియోగం ఆధారంగానే ప్రజల అభివృద్ధిని లెక్కిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అన్నారు. ఏపీ శాసనసభలో విద్యుత్ రంగంపై లఘు చర్చలో సీఎం మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయన్నారు. గతంలో కరెంటు కోతల సమయంలో రైతుల అవస్థలు ప్రత్యక్షంగా పరిశీలించానని.. రైతుల ఇబ్బందులు చూసాక పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. విద్యుత్ సంస్కరణలు అమలు చేసేందుకు ప్రయత్నిస్తే ప్రపంచ బ్యాంకు జీతగాడని అవహేళన చేశారన్నారు. అప్పుడే డిస్కమ్‌లు, నియంత్రణ మండలి, ఎనర్జీ ఆడిటింగ్ అనేది మొదలు పెట్టామన్నారు. గతంలో ట్రాన్స్ మిషన్ నష్టాలు 23 శాతం అని దేశంలో తొలిసారి నిర్ధారించింది కూడా ఏపీనే అని అన్నారు. విభజన తర్వాత కరెంటు కోతలు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దామని తెలిపారు. టీడీపీ హయాంలో చేసిన విద్యుత్ సంస్కరణలు వాడుకుని అప్పట్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు.
రాష్ట్ర విభజన సమయంలో..
ఎన్టీపీఎస్ లాంటి ప్రభుత్వ రంగ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌ను 83 శాతం పీఎల్ఎఫ్‌తో నడిపించామన్నారు. చాలా ప్రైవేటు సంస్థలకూ అది సాధ్యం కాదని.. ఈ పరిపాలనా మార్పులు ప్రజలు గుర్తించాలన్నదే తమ అభిప్రాయమన్నారు. గత 30 ఏళ్ల పాలనా సమయాన్ని బేరీజు వేసుకుంటే వాస్తవాలు వెలుగు చూస్తాయని తెలిపారు. విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఉన్న ఏపీని లోటు పరిస్థితికి తీసుకెళ్లింది వైసీపీ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. పరిశ్రమలు కరెంటు వాడితే సర్చార్జి విధించిన పరిస్థితి గత ప్రభుత్వానిదన్నారు. 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత రాష్ట్ర విభజన సమయంలో ఉందన్నారు.
ఓ వ్యక్తి ఈగోకు..
2018 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దామని తెలిపారు. ఏపీలో తలసరి విద్యుత్ వినియోగం 23 శాతం మేర పెరిగిందన్నారు. సౌర, పవన విద్యుత్‌ను 7700 మెగావాట్లు మేర ఉత్పత్తి చేసిన మొదటి రాష్ట్రం ఏపీనే అని చెప్పుకొచ్చారు. అయితే 2019-24లో అసమర్థ పాలన వల్ల రాష్ట్రంలో మళ్లీ చీకటి రోజులు వచ్చాయన్నారు. ఆలోచన లేకుండా వైసీపీ పీపీఏలను రద్దు చేసేసిందన్నారు. పీపీఏల రద్దు విషయం అంతర్జాతీయ అంశంగా మారిపోయిందన్నారు. దావోస్ లాంటి చోట కూడా పీపీఏలను రద్దు చేయటంపై చర్చ జరిగిందని తెలిపారు. ఒక వ్యక్తి ఈగో కారణంగా రాష్ట్ర ఖజనా నుంచి రూ.9 వేల కోట్లు పీపీఏలకు చెల్లించాల్సి వచ్చిందన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యం వల్ల అందులో జల విద్యుత్ కేంద్రం ఆగిపోయి 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి రాలేదన్నారు. వైసీపీ హయాంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీల పెంచి ప్రజలపై రూ.32 వేల కోట్ల భారం వేశారని మండిపడ్డారు.
విద్యుత్ వ్యవస్థపై వైసీపీ వేసిన భారం..
టారిఫ్ అడ్జస్ట్‌మెంట్, ఫ్యూయల్ సర్చార్జ్ , ట్రూ ఆప్ ఛార్జెస్, ఎలక్ట్రిసిటీ డ్యూటీ అని చెప్పి రూ. 32,166 కోట్లు ప్రజలపై భారం మోపారన్నారు. గత ప్రభుత్వంలో విద్యుత్ వినియోగం కూడా 4.6 శాతం మేర తగ్గిపోయిందని చెప్పారు. వినియోగదారులు, విద్యుత్ వ్యవస్థపైనా గత ప్రభుత్వం వేసిన భారం రూ.1 లక్ష కోట్లు అని తెలిపారు. విద్యుత్ రంగంలో వారసత్వంగా కొన్ని సమస్యలు కూటమి ప్రభుత్వానికి వచ్చాయన్నారు. సెకీ ద్వారా చేసుకున్న పవర్ సప్లై అగ్రిమెంటు రాష్ట్రానికి భారంగా మార్చేశారన్నారు. ఒకసారి సంతకాలు చేసిన తర్వాత ప్రభుత్వంగా దాన్ని వెనక్కు తీసుకోలేమన్నారు. ఇలాంటి ఇబ్బందులు ఉన్నా వాటిని సరిచేసేందుకు ప్రయత్నాలు కూటమి ప్రభుత్వం చేస్తోందని వెల్లడించారు. భూతాపం వల్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి కోసం ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయన్నారు. సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ, బ్యాటరీ, బయోప్యూయెల్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను స్మార్ట్ గ్రిడ్ ద్వారా సరఫరా చేయాలని ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.
ప్రతీ ఇంటిపై సోలార్ ఫలకాలు...
విద్యుత్ రంగం విస్తృతంగా పెరిగినందున వ్యయం అనేది గణనీయంగా తగ్గాలన్నారు. గత ఐదేళ్లలో రూ. 5.16 పైసలు ప్రతీ యూనిట్ సగటు విద్యుత్ కొనుగోలు వ్యయం చేశారన్నారు. 2025 ఏప్రిల్ 1 నుంచి యూనిట్ కొనుగోలు వ్యయం రూ4.80కు తగ్గిస్తామన్నారు. వచ్చే విద్యుత్‌ను పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి కోసం వినియోగిస్తామన్నారు. దేశం 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తే ఏపీ ఒక్కటే 160 గిగావాట్లను ఉత్పత్తి చేస్తుందని ప్రకటించామన్నారు. పీఎం సూర్యఘర్ కింద ప్రతీ ఇంటిలోనూ విద్యుత్ ఉంటుందన్నారు. డెమాక్రాటైజేషన్ ఆఫ్ ఎనర్జీ అన్నది ఇప్పుడు ఓ కీలక విధానమని తెలిపారు. అలాగే ప్రోస్యూమర్ అన్నది ఇప్పుడు ఓ కొత్త పదమని, ప్రోడ్యుసర్ కమ్ కంజ్యూమర్‌గా ప్రతీ ఇల్లూ మారాలని ఆకాంక్షించారు. 2 కిలోవాట్ల సామర్ధ్యంతో సౌర ఫలకాలను ప్రతీ ఇంటిపైనా ఏర్పాటు చేసుకోవాల్సి ఉందన్నారు. వందశాతం మేర సోలార్ రూఫ్ టాప్ విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రంగా ఏపీ మారాలన్నారు. ప్రతీ నియోజకవర్గంలో కనీసం 10 వేల ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్ రావాలని తెలిపారు. ప్రతీ ఇంటికీ 240 యూనిట్ల మేర విద్యుత్ ఉత్పత్తి అవుతుందని.. ప్రస్తుతం రాష్ట్రంలో సగటు వినియోగం 100 యూనిట్ల మేర ఉంటోందన్నారు. మిగతా విద్యుత్ అంతా డిస్కమ్‌లు కొనుగోలు చేసి డబ్బులు చెల్లిస్తాయని చెప్పారు.
ఇదే లక్ష్యం...
20 ఏళ్ల పాటు ఉచితంగా విద్యుత్ వచ్చే పరిస్థితి ఉంటుందన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయాల్లోనూ సౌర విద్యుత్ ఫలకాలు ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నామన్నారు. ఈ ఏడాది 20 లక్షల ఇళ్లపై ఈ తరహా రూఫ్ టాప్ సోలార్ కనెక్షన్లు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. తద్వారా 1440 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుందన్నారు. అటు సోలార్ పంప్ సెట్ల వద్ద కూడా సౌర విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందన్నారు. రైతులు కూడా ఈ సౌర విద్యుత్ ఫలకాలను ఏర్పాటు చేసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. సబ్ స్టేషన్లను కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం ద్వారా పంపిణీ నష్టాలను అరికట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం విద్యుత్ సరఫరా, పంపిణీ నష్టాలు 9 శాతంగా ఉన్నాయన్నారు. మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేసి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తామని తెలిపారు. 960 మెగావాట్ల జల విద్యుత్ కూడా పోలవరం ప్రాజెక్టు ద్వారా అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
Raja Singh Targets BJP leaders: వారిని తరమిస్తేనే.. పార్టీకి మంచి రోజులు.. రాజాసింగ్ సంచలన కామెంట్స్
Congress vs BRS: ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్
Read Latest AP News And Telugu News