CM Chandrababu: ప్రత్యేక సాయం ఇచ్చేలా చూడండి..
ABN , Publish Date - Apr 16 , 2025 | 12:52 PM
ఏపీ రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు.. వీడియో ప్రదర్శించి 16వ ఆర్థిక సంఘం బృందానికి సీఎం చంద్రబాబు వివరించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అందాల్సిన ప్రత్యేక సాయం వంటి అంశాలపై ఫైనాన్స్ కమిషన్ బృందానికి ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, రాష్ట్ర ప్రభుత్వ పాలసీలను వివరించారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం (AP Government) ఆశలన్నీ 16వ ఆర్థిక సంఘం (16th Finance Commission)పైనే పెట్టుకుంది. ప్రత్యేకంగా రాష్ట్రాన్ని ఆదుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. రాష్ట్ర విభజన, అప్పులు, రాజధాని లేకపోవడం, సేవా రంగం దూరం కావడం, ఉపాధి అంతంతమాత్రం కావడం, రెవెన్యూలోటు, తుపానులు, విపత్తులు ఏపీని నష్టపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పనగారియా నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘం మంగళవారం ఏపీకి వచ్చింది. 2026 జనవరి నుంచి 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమలులోకి వస్తాయి. ఏపీకి కేంద్ర నిధులు, ప్రత్యేక గ్రాంట్లు రావాలంటే ఆర్థిక సంఘం సిఫార్సులే ముఖ్యం. బుధవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు, మంత్రివర్గ సహచరులు, అధికారులతో ఆర్థిక సంఘం సమావేశమైంది. ఈ సందర్భంగా సచివాలయం మొదటి బ్లాక్ వద్ద ఆర్థిక సంఘం సభ్యులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) స్వాగతం పలికారు.
Also Read..: వైసీపీ హయాంలో శ్రీవారి ఆలయంలో భారీ స్కాం..
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, పోలవరం – బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు వంటి అంశాలపై ఎగ్జిబిషన్ ఏర్పాటు ఏర్పాటు చేశారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు వివరిస్తూ వీడియో ప్రదర్శించి ఆర్థిక సంఘం బృందానికి చంద్రబాబు వివరించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అందాల్సిన ప్రత్యేక సాయం వంటి అంశాలపై ఫైనాన్స్ కమిషన్ బృందానికి ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు వివరించారు. అలాగే విభజన అనంతరం రాష్ట్రం ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలు, తదనంతర పరిణామాలను సిఎం చంద్రబాబు వివరించారు. గత 5 ఏళ్ల కాలంలో ఆర్థికంగా జరిగిన విధ్వంసం కారణంగా నేడు ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో కేంద్రం అదనపు సాయం చేయాలని ముఖ్యమంత్రి ఆర్థిక సంఘాన్ని కోరారు. కేంద్రం తగు విధంగా కేటాయింపులు చేసేలా ప్రతిపాదనలు ఇవ్వాలని 16వ ఆర్థిక సంఘాన్ని చంద్రబాబు కోరారు.
పనగారియా బృందానికి ఘన స్వాగతం..
కాగా మంగళవారం రాత్రి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న 16వ ఆర్థిక సంఘం బృందానికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. ఫైనాన్స్ కమిషన్ బృందం రాష్ట్రంలో ఈ నెల 18వ తేదీ వరకు పర్యటించనుంది. విజయవాడ (Vijayawada), తిరుపతి (Tirupati) నగరాల్లో పర్యటించనుంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అందాల్సిన సాయం వంటి కీలకమైన అంశాలపై చర్చించేందుకు ఫైనాన్స్ కమిషన్ (Finance Commission) బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu), ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సచివాలయంలో భేటీ అయ్యారు.
అనేక అంశాలపై బృందానికి సీఎం ప్రజంటేషన్..
సచివాలయంలో ఆర్థిక సంఘం సభ్యులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఇతర అనేక అంశాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ తర్వాత విజయవాడలో వివిధ పార్టీల ప్రతినిధులతో ఆర్థిక సంఘం సభ్యులు మాట్లాడతారు. సాయంత్రం మూడున్నరకు నోవాటెల్ హోటల్లో ఆర్థిక సంఘం సభ్యులు మీడియా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం రాత్రి ఏడు గంటలకు విజయవాడలోని బెర్మ్ పార్కులో ముఖ్యమంత్రి ఇచ్చే డిన్నర్‌కు హాజరవుతారు. రాత్రి పది గంటలకు విజయవాడ ఎయిర్ పోర్టు నుంచి తిరుపతికి బయలుదేరి వెళతారు. గురువారం మధ్యాహ్నం రెండున్నరకు స్థానిక ప్రజాప్రతినిధులతో 16వ ఆర్థిక సంఘం సభ్యులు సమావేశం అవుతారు. అనంతరం వాణిజ్య, వ్యాపారవర్గాలతో తిరుపతిలో సమావేశం నిర్వహిస్తారు. తిరిగి ఈ నెల 18వ తేదీ (శుక్రవారం) తెల్లవారుజామున వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అనంతరం ఈ బృందం ఢిల్లీకి బయలుదేరి వెళుతుంది. కాగా రాష్ట్రాలకు పంపిణీ చేసే వాటా శాతాన్ని పెంచేలా ఆర్థిక సంఘం సిఫార్సులు చేసే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో రెండోసారి ఈడీ సోదాలు..
ఆంధ్రావాసికి శబరిమల తొలి గోల్డ్ లాకెట్..
For More AP News and Telugu News