RK Roja: వారికి చంద్రబాబు భజనే ముఖ్యం.. క్రిమినల్ కేసులు పెట్టాల్సిందే
ABN, Publish Date - Jan 09 , 2025 | 02:45 PM
RK Roja: అసమర్థ టీటీడీ చైర్మన్, ఎస్సీ, కలెక్టర్ వలనే ఈ పరిస్థితి వచ్చిందని.. వీరు ఎవరికీ భక్తి లేదని మాజీ మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు భజనే వీరికి ముఖ్యమంటూ విరుచుకుపడ్డారు. పోలీసులను చంద్రబాబు సేవలో పెట్టారని.. వచ్చిన భక్తులకు కనీసం సౌకర్యాలు కూడా కల్పించలేదని ఆరోపించారు.
తాడేపల్లి, జనవరి 9: చంద్రబాబు (AP CM Chandrababu Naidu) అసమర్ధ పాలనకు నిదర్శనంగా తిరుపతి ఘటన ఉందని మాజీ మంత్రి ఆర్కే రోజా (Former Minister RK Roja) వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనకు ఎవరు బాధ్యులో తేల్చాలని డిమాండ్ చేశారు. అసమర్థ టీటీడీ చైర్మన్, ఎస్సీ, కలెక్టర్ వలనే ఈ పరిస్థితి వచ్చిందని.. వీరు ఎవరికీ భక్తి లేదన్నారు. చంద్రబాబు భజనే వీరికి ముఖ్యమంటూ విరుచుకుపడ్డారు. పోలీసులను చంద్రబాబు సేవలో పెట్టారని.. వచ్చిన భక్తులకు కనీసం సౌకర్యాలు కూడా కల్పించలేదని ఆరోపించారు. ఇది ప్రభుత్వం చేసిన హత్యలే అని.. అందరిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. హీరో అల్లు అర్జున్‌కు సంబంధం లేకుండా తొక్కిసలాట జరిగితే ఆయనపై కేసు పెట్టారని.. మరి తిరుపతి ఘటనలో చంద్రబాబు నుంచి బీఆర్ నాయుడు, ఎస్పీలపై కేసులు పెట్టాలన్నారు.
105 సెక్షన్ పెట్టాల్సి ఉండగా.. 194 సెక్షన్ ఎలా పెడతారని ప్రశ్నించారు. ఆరుగురు భక్తులు చనిపోతే హైందవ శంఖారావం నిర్వాహకులు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఆ పీఠాధిపతులు బయటకు రావాలని.. చంద్రబాబు మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాలన్నారు. ప్రధాని మోదీ కూడా దీనిపై స్పందించాలన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దారుణాలు జరుగుతున్నాయని అంటూ కామెంట్స్ చేశారు. సనాతన యోధుడిని అని చెప్పుకునే ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని నిలదీశారు. కూటమి ప్రభుత్వం ఆరుగురిని చంపేసిందని.. ఎవరి నిర్లక్ష్యం వలన జరిగిందో తేల్చాలన్నారు. అందరిపై కేసులు పెట్టించుకుని విచారణ జరిపించుకోవాలని అన్నారు. చంద్రబాబు లెగ్ మహిమ వలన ఎప్పుడూ జనాల చావులు తప్పటం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గోదావరి పుష్కరాల సమయంలో 29 మంది చనిపోయారని.. విజయవాడలో వరదల వలన 60 మంది చనిపోయారని.. అదంతా చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే అంటూ ఆరోపణలు గుప్పించారు. అయినా సరే ఈ పాలకులకు బాధ అనిపించటం లేదన్నారు. గేమ్ ఛేంజర్ సినిమా ఫంక్షన్ మీద ఉన్న పిచ్చి శ్రీవారి భక్తుల మీద ఎందుకు చూపటంలేదని ప్రశ్నించారు. టీటీడీని టీడీపీ ఆఫీసులాగ మార్చేశారని దుయ్యబట్టారు. వైకుంఠ ఏకాదశికి ఎలాంటి సౌకర్యాలు కల్పించాలో టీటీడీ ఛైర్మన్‌కు తెలీదన్నారు. ఆయనకు భక్తి భావమే లేదని.. అలాంటి వారికి ఛైర్మన్ పదవి ఎలా ఇస్తారని అన్నారు. ఎవరిని బలి చేద్దామా? అని టీటీడీ, ప్రభుత్వం ఆలోచన చేస్తోందంటూ వ్యాఖ్యలు చేశారు. ఎస్పీని రక్షించటానికి డీఎస్పీ మీదకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం సిన్సియర్‌గా స్పందించి విచారణ జరపాలని మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి...
TTD EO: తిరుపతిలో తొక్కిలాటపై టీటీడీ ఈవో ఏమన్నారంటే..
Tirupati Stampede: తిరుపతి ఘటన మృతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సర్కార్
Read Latest AP News And Telugu News
Updated Date - Jan 09 , 2025 | 02:47 PM