Share News

వరాల జల్లు

ABN , Publish Date - Apr 06 , 2025 | 01:02 AM

ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తున్న వేదాద్రి-కంచెల ఎత్తిపోతల పథకానికి ఎట్టకేలకు విముక్తి కలిగింది. వేలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే ఈ పథకానికి మరమ్మతులు చేసేందుకు సీఎం చంద్రబాబు నిధులు కేటాయించడంపై నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో ఆనందం వెల్లివిరిసింది. బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామంలో శనివారం జరిగిన ప్రజావేదికలో పాల్గొన్న సీఎం కీలకమైన ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంతో పాటు పీ4 కార్యక్రమంలో భాగంగా ముప్పాళ్ల అభివృద్ధికి ముఖ్యమైన సూచనలు చేయడంపై హర్షం వ్యక్తమైంది.

వరాల జల్లు

వేదాద్రి-కంచెల ఎత్తిపోతలకు ఇక విముక్తి

రూ.15 కోట్లు మంజూరుచేసిన సీఎం చంద్రబాబు

మరమ్మతులు పూర్తిచేయాలని ఆదేశాలు

ఇకపై ఎత్తిపోతల బాధ్యతలు రైతు సంఘాలకు..

ఏటూరు-మోగులూరు వద్ద మునేటిపై కాజ్‌వే నిర్మాణం

ఏనుగుగడ్డ వాగుపై వంతెనల నిర్మాణానికీ నిధులు

సుబాబుల్‌, మిర్చి సమస్యలు పరిష్కారిస్తామని హామీ

పీ4 కార్యక్రమంలో భాగంగా ముప్పాళ్ల అభివృద్ధికి ప్రణాళిక

జగ్జీవన్‌రామ్‌ జయంతిలో సందడిగా గడిపిన సీఎం

చందర్లపాడు, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి) : నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో వేలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే వేదాద్రి-కంచెల ఎత్తిపోతల పథకం మరమ్మతులకు సీఎం చంద్రబాబు రూ.15 కోట్లు మంజూరు చేశారు. మెట్ట రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుచూపుతో గతంలో టీడీపీ హయాంలో ఏర్పాటు చేసిన ఈ పథకం మూలనపడటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు పట్టించుకోలేదని, ఒక్కపైసా కూడా కేటాయించలేదని ఆయన పేర్కొన్నారు. సాగునీటి ఎత్తిపోతల పథకాలను మూలనపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎత్తిపోతల పథకాల నిర్వహణ బాధ్యతలను పదేళ్ల పాటు అవుట్‌సోర్సింగ్‌ విధానంలో రైతు సంఘాలకు అప్పగించాలని యోచిస్తున్నట్టు చెప్పారు. మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామంలో శనివారం జరిగిన ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అడిగిందే తడవుగా ఆయన వరాల జల్లు కురిపించారు. చందర్లపాడు మండలం ఏటూరు-కంచికచర్ల మండలం మోగులూరు గ్రామాల మధ్య రాకపోకల నిమిత్తం మునేటిపై కాజ్‌వే నిర్మాణం కోసం రూ.2.20 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కంచికచర్ల, వీరులపాడు మండలాల్లో యేనుగుగడ్డ వాగుపై వంతెనలు నిర్మించేందుకు రూ.2.13 కోట్లు, కంచికచర్ల మండలం చెవిటికల్లు వద్ద వాగులపై వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. సుబాబుల్‌, మిర్చి రైతుల సమస్యలు తనకు తెలుసని, మార్కెట్‌ పరిస్థితులను సమీక్షించి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూస్తానన్నారు. అమెరికా ఆంక్షలతో ఆక్వాకు దెబ్బతగిలే పరిస్థితి ఏర్పడిందని చెప్పిన ఆయన వారు ఏమాత్రం నష్టపోకుండా ఆదుకుంటామన్నారు. రైతులకు లాభసాటిగా ఉండేందుకు వ్యవసాయంలో సాంకేతికను జోడించేందుకు గేట్‌ ఫౌండేషన్‌తో ఎంవోయూ కుదుర్చుకున్నామన్నారు.

ముప్పాళ్ల అభివృద్ధికి హామీ

ముప్పాళ్లను అభివృద్ధి చెందిన గ్రామంగా తీర్చిదిద్దనున్నట్టు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పీ4 కార్యక్రమంలో భాగంగా గ్రామంలో నెలకొన్న సమస్యలను ప్రస్తావించిన ఆయన వాటిని పరిష్కరించే బాధ్యత కలెక్టర్‌ లక్ష్మీశకు అప్పగించారు. 64 కుటుంబాలకు పక్కా గృహాలు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. మూడు సెంట్ల చొప్పున నివేశన స్థలాలు ఇస్తామన్నారు. 11 కుటుంబాలకు టాయిలెట్లు నిర్మిస్తామని పేర్కొన్నారు. 223 ఇళ్లకు తాగునీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వటంతో పాటు పరిశుభ్రమైన తాగునీరు అందిస్తామని చెప్పారు. 909 కుటుంబాలకు ఇంటర్నెట్‌ సదుపాయాన్ని కల్పిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత అందిస్తున్నామని, అయితే ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి తమ ఇంటిపై రెండు కిలోవాట్ల సామర్థ్యం కలిగిన రూప్‌టాఫ్‌ సోలార్‌ సిస్టమ్‌ అమర్చుకోవాలని చెప్పారు. ఇందుకోసం పైసా కూడా ఖర్చు కాదని, నిర్వహణ బాధ్యతలు కూడా ఏజెన్సీ సంస్థ చూస్తుందని, ఒకవేళ విద్యుత మిగిలితే యూనిట్‌కు రూ.2.09 వంతున తీసుకుంటామని, సొమ్ము నేరుగా బ్యాంకు ఖాతాకు జమ అవుతాయని చెప్పారు. బీసీ, ఓసీలు కూడా సోలార్‌ సిస్టమ్‌ బిగించుకోవాలన్నారు. ముఖ్యంగా రైతులు వ్యవసాయ పంపుసెట్లకు సోలార్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేసుకోవటం లాభదాయకమని, ట్రాక్టర్లు, మోటారు సైకిళ్లు కూడా రీచార్జి చేసుకోవచ్చన్నారు. ఈ ఏడాది ముప్పాళ్ల గ్రామంలో 4 కిలోమీటర్ల మేర సిమెంట్‌ రోడ్లు వేస్తామని సీఎం హామీ ఇచ్చారు. అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ ఏర్పాటుకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తున్నామని, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.

Updated Date - Apr 06 , 2025 | 01:02 AM