Share News

కండిషన్‌ సీరియస్‌..!

ABN , Publish Date - Apr 08 , 2025 | 01:07 AM

‘ఉమ్మడి కృష్ణాజిల్లా వాసులారా.. పారాహుషార్‌. మీ ఆరోగ్యాలను కాపాడుకోండి. లేదంటే ప్రమాదం పొంచి ఉంది.’ నిజమే.. ప్రాణాంతక వ్యాధులకు ముఖ్యంగా ఎన్టీఆర్‌ జిల్లా ప్రజలు దగ్గరవుతుండగా, కృష్ణాజిల్లా ఆ తర్వాత స్థానంలో నిలుస్తోంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, చెడు వ్యసనాల కారణంగా హృద్రోగాలతో పాటు బీపీ, షుగర్‌, కేన్సర్‌, ఇతర వ్యాధులకు ఉమ్మడి కృష్ణాజిల్లావాసులు బాగా దగ్గరవుతుండగా, వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు సోమవారం జిల్లాలవారీగా హెల్త్‌ రిపోర్టులను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించి ప్రమాద తీవ్రతను, ఆరోగ్య సూత్రాలను తెలియజేశారు.

కండిషన్‌ సీరియస్‌..!

డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న ఉమ్మడి కృష్ణాజిల్లా ఆరోగ్య గణాంకాలు

హృద్రోగ సమస్యల్లో రాష్ట్రంలోనే ఎన్టీఆర్‌ జిల్లా ఫస్ట్‌

డయాబెటిస్‌లో ఎన్టీఆర్‌, కృష్ణాలు.. రెండు, మూడు స్థానాలు

షుగర్‌, న్యూరో, కేన్సర్‌, లివర్‌ వ్యాధుల్లోనూ హెచ్చు కేసులు

గణాంకాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : సీఎం చంద్రబాబు విడుదల చేసిన గణాంకాల ప్రకారం జిల్లాలో అనారోగ్య డేంజర్‌ బెల్స్‌ మోగుతున్నాయి. హృద్రోగాలు, కేన్సర్‌, బీపీ, షుగర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులకు రెండు జిల్లాల ప్రజలు దగ్గరగా ఉన్నారు. గుండె సంబంధ వ్యాధుల్లో ఎన్టీఆర్‌ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానం, కృష్ణాజిల్లా ఆరో స్థానంలో నిలవడం కలవరపడాల్సిన విషయం. ఎన్టీఆర్‌ జిల్లాలో సగటున 15,665 మందికి గుండెజబ్బులు వస్తున్నాయి. ఈ ఏడాది కొత్తగా మొత్తం 13,106 కేసులు నమోదయ్యాయి. ఎన్టీఆర్‌ జిల్లాలో 50-54 ఏళ్లు, కృష్ణాజిల్లాలో 60-64 ఏళ్ల వారికి ఎక్కువగా గుండెవ్యాధులు వస్తున్నాయి. ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవటం, దురలవాట్ల కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది.

డయాబెటిస్‌లో టాప్‌-2

59,921 డయాబెటిస్‌ కేసులతో ఎన్టీఆర్‌ జిల్లా రాష్ట్రంలోనే రెండోస్థానంలో నిలవగా, 58,136 కేసులతో కృష్ణాజిల్లా మూడో స్థానంలో ఉంది. ఎన్టీఆర్‌ జిల్లాలో 45-59 ఏళ్లు, కృష్ణాజిల్లాలో 50-54 ఏళ్లు వారికి డయాబెటిస్‌ ఎక్కువగా వస్తోంది. బీపీ, డయాబెటిస్‌లను కలిపి చూసినా కూడా ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాలు రాష్ట్రంలోనే 2, 3 స్థానాల్లో ఉన్నాయి. ఎన్టీఆర్‌ జిల్లాలో 1,25,339 కేసులు, కృష్ణాజిల్లాలో 1,11,932 కేసులు ఉన్నాయి.

కేన్సర్‌, కాలేయ వ్యాధుల్లోనూ..

కేన్సర్‌ కేసుల్లో ఎన్టీఆర్‌ జిల్లా దూసుకెళ్తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 5,151 కేసులతో రాష్ట్రంలోనే ఎన్టీఆర్‌ మిగతా 6లో..ఏడో స్థానంలో ఉంది. 4,376 కేసులతో కృష్ణా 17వ స్థానంలో నిలిచింది. 1,351 కాలేయ సంబంఽధ కేసులతో ఎన్టీఆర్‌ జిల్లా రాష్ట్రంలోనే 9వ స్థానంలో, 1,002 కేసులతో కృష్ణాజిల్లా 17వ స్థానంలో నిలిచాయి. రెండు జిల్లాల్లో 50-54 ఏళ్లలోపు వారిలోనే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

మిగిలిన వ్యాధుల్లోనూ..

రెండు జిల్లాల్లో న్యూరో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. 4,154 కేసులతో కృష్ణాజిల్లా పదో స్థానం, 4,063 కేసులతో ఎన్టీఆర్‌ జిల్లా 11వ స్థానంలో నిలిచాయి. అలాగే, 6,291 కిడ్నీ కేసులతో ఎన్టీఆర్‌ 16వ స్థానంలో, 4,761 కేసులతో కృష్ణా 22వ స్థానంలో నిలిచాయి.

బీపీలోనూ తగ్గేదేలే..!

బీపీ కేసుల్లో ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లాలు వరుసగా 3, 5 స్థానాల్లో నిలిచాయి. ఎన్టీఆర్‌ జిల్లాలో 98,337 కేసులు నమోదు కాగా, కృష్ణాజిల్లాలో 94,266 కేసులు నమోదయ్యాయి. ఎన్టీఆర్‌లో 50-54 సంవత్సరాల్లోపు ఉన్న వారికి, కృష్ణాజిల్లాలో 60-64 ఏళ్ల వారికి బీపీ ఎక్కువగా వస్తోంది.

Updated Date - Apr 08 , 2025 | 01:07 AM