తాడేపల్లి డైరెక్షన్‌లోనేనా?
ABN , Publish Date - Feb 27 , 2025 | 12:24 AM
గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ మూకల దాడి ఘటనలో ప్రత్యక్ష సాక్షి, ఫిర్యాది సత్యవర్ధన్‌ను తమ వైపునకు తిప్పుకొనే విషయంలో తాడేపల్లి వైసీపీ పెద్దల పథక రచన ఉందా..? అంటే అవుననే సందేహం కలగకమానదు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ విచారణ సందర్భంగా పోలీసులు అడుగుతున్న ప్రశ్నలను పరిశీలిస్తే.. ఇదే అనుమానం కలుగుతుంది.

సత్యవర్ధన్ బెదిరింపుల ఎపిసోడ్ పథకం ప్రకారమేనా?
నాడు వంశీ కలిసిన వైసీపీ ముఖ్య నేతలు ఎవరు?
విచారణలో పోలీసుల ప్రశ్నలతో బలపడుతున్న అనుమానాలు
తాడేపల్లి పెద్దల సూచనతోనే నాడు టీడీపీ ఆఫీసులపై దాడులు
సత్యవర్ధన్‌ను తమవైపు తిప్పుకొనే ప్లాన్ కూడా వారిదే..?
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ మూకల దాడి ఘటనలో ప్రత్యక్ష సాక్షి, ఫిర్యాది సత్యవర్ధన్‌ను తమ వైపునకు తిప్పుకొనే విషయంలో తాడేపల్లి వైసీపీ పెద్దల పథక రచన ఉందా..? అంటే అవుననే సందేహం కలగకమానదు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ విచారణ సందర్భంగా పోలీసులు అడుగుతున్న ప్రశ్నలను పరిశీలిస్తే.. ఇదే అనుమానం కలుగుతుంది. సత్యవర్ధన్.. హైదరాబాద్‌లోని తన ఇంటి నుంచి వచ్చిన మరుసటి రోజే వంశీ తాడేపల్లి వెళ్లి వైసీపీకి చెందిన ముఖ్యనేతలు ఇద్దరిని కలిసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై వంశీ స్పష్టత ఇవ్వలేదని తెలుస్తోంది. దీనిని బట్టి చూస్తే.. ఈ మొత్తం ఎపిసోడ్.. తాడేపల్లి వైసీపీ పెద్దల డైరెక్షన్‌లోనే వంశీ, ఆయన అనుయాయులు సత్యవర్ధన్‌ను బెదిరింపులకు గురిచేశారన్న అనుమానాలు కలుగుతున్నాయి. విచారణ మరింత లోతుగా జరిగే క్రమంలో ఈ అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఊహించని రీతిలో..
వైసీపీ హయాంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు నివాసం, గన్నవరం, గుడివాడ టీడీపీ కార్యాలయాలపై వరుసగా దాడులు జరిగాయి. ఇవన్నీ వేర్వేరు దాడులే అయినా.. తాడేపల్లి వైసీపీ పెద్దల డైరెక్షన్‌లోనే జరిగాయన్న విమర్శలు అప్పట్లోనే వచ్చాయి. తాజాగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాది సత్యవర్ధన్‌ను తమ వైపునకు తిప్పుకొనే విషయంలో కూడా తాడేపల్లి పెద్దల ఒత్తిడి ఉందన్న అనుమానాలకు బలం చేకూరుతోంది. ఈ కేసులో వల్లభనేని వంశీమోహన్ ఏ71గా ఉన్నారు. ఏ71గా ఉండటం వల్ల ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టమేమీ లేదని ఆంతరంగికంగా పలువురు ముఖ్యులతో వంశీ అప్పట్లో చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలు చేసిన కొద్దిరోజులకే సత్యవర్ధన్ కోర్టుకు వాంగ్మూలం ఇచ్చాడు. ఇంత వేగంగా పరిణామాలు మారడం వెనుక తాడేపల్లి వైసీపీ పెద్దల ప్రోద్బలం ఉందన్న అనుమానాలు వచ్చాయి. కేసులు ఎప్పుడూ ఉండేవేనని, గన్నవరం నియోజకవర్గంలోకి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని ఆ పార్టీ ముఖ్యనేత ఒకరు వంశీకి గట్టిగా చెప్పిన అనంతర క్రమంలోనే ఈ పరిణామాలన్నీ చోటుచేసుకున్నాయి. తొందరగా ఈ కేసు నుంచి తప్పించుకోవచ్చని భావించిన వంశీకి ఊహించని విధంగా వరుసగా కేసులు వచ్చిపడ్డాయి.
వైసీపీ పెద్దలకు షాక్
వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు వంశీ అనుయాయులు సాగించిన అరాచకాలు, మైనింగ్ అక్రమ తవ్వకాలు, భూ కబ్జాలు, రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్, బెదిరింపులపై ఇప్పుడు అనేక కేసులు నమోదవుతున్నాయి. తాజాగా వంశీ అక్రమాలపై ప్రభుత్వం సిట్ కూడా వేయటంతో అన్నింటిపై విచారణలు సాగే అవకాశముంది. ఈ హఠాత్పరిణామాలతో తాడే పల్లి పెద్దలు తలలు పట్టుకుంటున్నారు.