NTR Health Services: సాక్షిపత్రిక కథనాలపై మండిపడిన మంత్రి సత్యకుమార్ యాదవ్..
ABN , Publish Date - Apr 13 , 2025 | 10:09 PM
అవినీతి సొమ్ముతో పెట్టిన సాక్షి పత్రికలో తప్పుడు రాతలే రాస్తారని, అబద్ధపు ప్రచారాలే చేస్తారని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. పేదలకు అందించే వైద్య సేవలపైనా ఇలాంటి అబద్ధపు రాతలు రాయడం దారుణమని అన్నారు.

జగ్గయ్యపేట: ఎన్టీఆర్ వైద్య సేవలపై సాక్షిపత్రిక తప్పుడు ప్రచారం చేస్తోందంటూ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు. సాక్షి యాజమాన్యం ఇకనైనా తప్పుడు, అబద్ధపు ప్రచారాలను ఆపాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా సాక్షి దినపత్రికలో ఎన్టీఆర్ వైద్య సేవలపై వచ్చిన అసత్యపు వార్తా కథనాలపై మంత్రి ఆగ్రహించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఆదివారం నాడు మంత్రి సత్యకుమార్ పర్యటించారు. పీవీఆర్ పంక్షన్ హాల్లో జయప్రద ఫౌండేషన్ ఉచిత నేత్ర చికిత్స వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సాక్షి యాజమాన్యం వ్యవహార శైలిపై విరుచుకుపడ్డారు.
అవినీతి సొమ్ముతో పెట్టిన సాక్షి పత్రికలో తప్పుడు రాతలే రాస్తారని, అబద్ధపు ప్రచారాలే చేస్తారని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. పేదలకు అందించే వైద్య సేవలపైనా ఇలాంటి అబద్ధపు రాతలు రాయడం దారుణమని అన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్.. వందల మంది ప్రాణాలు పోయాయని వారు ఇచ్చిన కథనం చూసి ఆందోళనకు గురైనట్లు చెప్పారు. తీరా ఆరా తీస్తే.. వారు చెప్పిన రోజు 6,600 రోగులు అడ్మిట్ కాగా అందులో 6,300 మందికి ప్రిఆథరైజేషన్ ఇచ్చారని తెలిపారు. అలాగే మార్చి నెలలో సగటున 5,500 మంది రోగులకు ఎన్టీఆర్ వైద్య సేవల ట్రస్ట్ చికిత్స అందించిందని వెల్లడించారు.
సగటు కంటే వెయ్యి మంది రోగులకు అదనంగా సేవలందించారని మంత్రి సత్యకుమార్ తెలిపారు. కొన్ని దుష్టశక్తులు, వ్యక్తులు చేసే అసత్యపు ప్రచారాల్ని నమ్మొద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఆయన కోరారు. భవిష్యత్‌లోనూ ఇలాంటి దుష్టశక్తులు దుష్ప్రచాలు చేస్తారని, అలాంటి వారి మాటల్ని నమ్మకుండా తిప్పికొట్టాలని సూచించారు. కేంద్రం, రాష్ట్రంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఎంతగానో పాటు పడుతున్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Harish Rao: సన్నబియ్యం పేరుతో పేదల్ని మోసం చేస్తున్నారు: ఎమ్మెల్యే హరీశ్ రావు..
MLA Komatireddy: నాకు మంత్రి పదవి రాకుండా చూస్తోంది అతనే: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి..