‘రవాణా’సురులు
ABN , Publish Date - Apr 13 , 2025 | 12:34 AM
చేసేది రవాణా శాఖలో ఓ సాధారణ ప్రైవేట్ ఉద్యోగం. జీతం రూ.30 వేలకు మించి ఉండదు. అటువంటి ఉద్యోగుల చేతిలో ఖరీదైన ఐ ఫోన్లు.. ఆకర్షించే హూందాయ్ కార్లు.. మెరిసిపోయే బంగారు చైన్లు.. బ్రాస్‌లెట్లు.. ఇంత సాధారణ ఉద్యోగికి ఇంత లగ్జరీ లైఫ్ ఎలా సాధ్యమనే అనుమానం అందరికీ వస్తుంది. అదే అనుమానం ఉన్నతాధికారులకు కూడా రావడంతో తెరవెనుక అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ వస్తున్నాయి. రవాణా శాఖలోని సాఫ్ట్‌వేర్ విభాగంలోని ప్రైవేట్ ఉద్యోగుల అవినీతిపై ఎట్టకేలకు అప్రమత్తమైన ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు.

రవాణా శాఖలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల అవినీతి కథలు
చేసేది ప్రైవేట్ ఉద్యోగం.. తక్కువ జీతం
వాడేది ఐఫోన్లు, హుందాయ్ కార్లు, లగ్జరీ లైఫ్
సమస్త ఆన్‌లైన్ సమాచారం ఏజెంట్లకు చేరవేత
నాడు వాహన్ ఆన్‌లైన్ సేవల్లో అక్రమాలు
నేడు ఫ్యాన్సీ నెంబర్లు, లైసెన్స్‌ల జారీలో..
తెరవెనుక భారీగా నగదు వసూళ్లు
ఎట్టకేలకు గుర్తింపు.. విధుల నుంచి తొలగించాలని నిర్ణయం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : రవాణా శాఖ సాఫ్ట్‌వేర్ విభాగంలో పనిచేస్తున్న కొందరు ప్రైవేట్ ఉద్యోగులు అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న సమాచారం ఆర్టీఏ ఉన్నతాధికారులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. విజయవాడ కేంద్రంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో వెలుగుచూసిన నకిలీ ఆర్సీల కుంభకోణం దగ్గర నుంచి ఇటీవల ఫ్యాన్సీ నెంబర్ల బిడ్డింగ్, హెవీ డ్రైవింగ్ లెసెన్స్‌ల జారీలో భారీగా అవకతవకలు చోటుచేసుకోవటానికి కొందరు ప్రైవేట్ ఉద్యోగులే కారణమని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. వారిని తొలగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
గతంలో ఈ-ప్రగతి, వాహన్‌లో అక్రమాలు
రవాణా శాఖలో గతంలో ‘ఈ-ప్రగతి’, ప్రస్తుతం ‘వాహన్’ సాఫ్ట్‌వేర్‌ల ఆధారంగా ఆన్‌లైన్‌లో పారదర్శక సేవలు అందుతున్నాయి. దీనివల్ల ఈ శాఖలో అవినీతి తగ్గినా.. ఏజెంట్ల వ్యవస్థ మాత్రం తగ్గలేదు. అప్పట్లో దరఖాస్తులు పట్టుకునే ఏజెంట్లు.. ఇప్పుడు కంప్యూటర్ల ముందు కూర్చుంటున్నారు. ఏజెంట్ల వ్యవస్థ నిర్మూలించకపోవడం వల్ల ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వచ్చినా ఉపయోగం లేకుండాపోతోంది. ఈ సాఫ్ట్‌వేర్‌ను పర్యవేక్షించే ప్రైవేట్ సిబ్బందిలో కొందరు, అధికారులు మరికొందరు అవినీతి రుచిమరిగి అడ్డదారులు తొక్కుతున్నారు. సాఫ్ట్‌వేర్ లాగిన్ అధికారాలను, వాటిని చూసే అవకాశాలు కలిగి ఉండటాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ కేంద్రంగా భారీ కుంభకోణం జరిగింది. ఈశాన్య రాష్ర్టాల్లో పాత లారీలను కొన్నట్టు, అక్కడి రాష్ర్టాల నుంచి ఎన్‌వోసీ పత్రాలను పొందినట్టు చూపించి అసలు వాహనాలే లేకుండా అక్రమ రిజిస్ర్టేషన్లు చేయించారు. లేని వాహనాలకు ఆర్సీలు సృష్టించటానికి అవసరమయ్యే డేటా ఎంట్రీ విజయవాడలోనే చేశారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో లేని వాహనాలకు ఫిజికల్ వెరిఫికేషన్ కూడా పూర్తిచేశారు. అసలు లేని వాహనాల వివరాలు వాహన్ పోర్టల్‌లోకి ఎక్కించారు. నకిలీ చాసిస్ నెంబర్లు కొట్టి.. లేని వాహనాలు ఉన్నట్టుగా ఆన్‌లైన్‌లో చూపించారు. వీటి ఆధారంగా నకిలీ ఆర్సీలు బయటకు వచ్చాయి. అప్పట్లో ఈ సాఫ్ట్‌వేర్‌ను నిర్వహించే వారి పాత్రపై అనుమానాలు కలగలేదు. కానీ, ఆ తర్వాత కూడా అధికారుల లాగిన్లను అడ్డం పెట్టుకుని వాహనాల అక్రమ రిజిస్ర్టేషన్లు చేయటం, లైసెన్సులు జారీ చేయటాన్ని గుర్తించి, అందుకు కారకులైన వారిపై వేటు వేశారు. అయినా ఈ అక్రమాలు ఆగలేదు.
నెంబర్ ప్లేట్ బిడ్డింగ్, హెవీ వెహికల్ లైసెన్స్ జారీలో అవకతవకలు
కొంతకాలంగా రవాణా శాఖలోని కొంతమంది ప్రైవేట్ ఉద్యోగులు.. బడా ఏజెంట్లతో సంబంధాలను కలిగి ఉంటున్నారు. రవాణా రహస్యాలను బయటకు తీసుకెళ్లేంత సంబంధాలు వీరిమధ్య ఏర్పడ్డాయి. నెంబర్ ప్లేట్ బిడ్డింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని బయటకు చేరవేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. సాధారణంగా ఫ్యాన్సీ నెంబర్ల కోసం కొందరు పోటీలు పడుతుంటారు. ఎట్టి పరిస్థితుల్లో తమకు నచ్చిన ఫ్యాన్సీ నెంబర్లను దక్కించుకోవటానికి బడాబాబులు చూస్తుంటారు. ఎంత ఖర్చయినా పర్వాలేదు.. ఆ నెంబర్ కావాలంటూ ఏజెంట్లకు ఆఫర్ ఇస్తారు. బేరాలు కుదుర్చుకున్నాక.. సదరు ఏజెంట్లు సాఫ్ట్‌వేర్ విభాగంలో పనిచేస్తూ తమకు టచ్‌లో ఉన్న ప్రైవేట్ ఉద్యోగుల సహాయంతో కొటేషన్ వేసిన వివరాలు తెలుసుకుంటారు. ఈ సమాచారం తెలుసుకుని తమ పార్టీతో స్వల్ప మొత్తానికి కోట్ చేయిస్తారు. మిగిలిన డబ్బు అందరూ పంచుకుంటారు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. హెవీ డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీలోనూ ఇలాగే ఉద్యోగుల లాగిన్లలో అడ్డగోలుగా వ్యవహరించినట్టు తెలుస్తోంది.
ఉద్యోగుల తొలగింపునకు నిర్ణయం
ఈ ఉదంతాలతో సాఫ్ట్‌వేర్ వ్యవహారాలను పర్యవేక్షించే ఉద్యోగులపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిని విధుల నుంచి తొలగించాలని రవాణా శాఖ కమిషనర్ ఆదేశించినట్టు తెలిసింది.
‘మీ జీతాలెంత? మీ దర్జాలేంటి? : ఉన్నతాధికారి మండిపాటు
సాఫ్ట్‌వేర్ వ్యవహారాలను పర్యవేక్షించే ఉద్యోగులంతా ఇటీవల రవాణా శాఖ ఉన్నతాధికారిని కలవగా, ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ‘మీ జీతాలెంత? మీ దర్జాలేంటి? విధుల్లో జాయిన్ అయినపుడు మీరెలా ఉన్నారు? ఇప్పుడెలా ఉన్నారు?’ అంటూ మండిపడినట్టు సమాచారం. ‘మేమిచ్చే జీతాలకు మీరు ఇంత ఆధునిక జీవితాన్ని గడపగలరా..’ అని ఆయన సీరియస్ కావడంతో చేసేదేమీ లేక సదరు ఉద్యోగులంతా మౌనంగా వచ్చేసినట్టు సమాచారం.