శతాబ్ది బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ABN , Publish Date - Apr 13 , 2025 | 01:08 AM
పాతనగరంలోని వనటౌన పేట శ్రీరామాలయంలో శతాబ్ది బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి.

కర్నూలు కల్చరల్, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): పాతనగరంలోని వనటౌన పేట శ్రీరామాలయంలో శతాబ్ది బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. చైత్ర శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని శనివారం వేకువ జామున స్వామి, అమ్మవార్లకు సుప్రభాత సేవ, పంచామృతాభిషేకాలు, విశేష పుష్పాలంకరణ సేవ, బ్రహ్మోత్సవ హోమం, ధ్వజారోహణం, పుణ్యాహవాచనం తదితర కార్యక్రమాలను సుధా పండితుడు, కడప ఉత్తరాది మఠాధికారి పండిత విద్యానిధి ఆచార్య శాసో్త్రక్తంగా చేపట్టారు. అలాగే ఆలయంలో హనుమాన జయంతి సందర్భంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పవమాన హోమం, మహా నైవేద్యం, అనంతరం అన్న ప్రసాదం పంపిణీ చేశారు. సాయంత్రం స్వామి వారి రథోత్సవం కన్నుల పండువగా సాగింది. రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి, పూజలు చేసి రథోత్సవాన్ని ప్రారంభించారు. హనుమద్ వాహన రథంపై సీతారామ లక్ష్మణ సహితంగా పాతనగరం వీధుల్లో విహరించారు. అనంతరం సూర్యకళా కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో భక్తి సంగీత విభావరి, రామావదూత భజన మండలి ఆధ్వర్యంలో అఖండ శ్రీరామ భజనలు భక్తులను అలరింపజేశాయి. కార్యక్రమంలో ఆలయ ఈవో దినేష్ చౌద రి, ప్రధాన అర్చకులు మాళిగి హనుమేషాచార్యులు, మాళిగి అనంత రాఘవేంద్ర మూర్తి, మాళిగి భానుప్రకాశ, సత్యప్రియ తీర్థ, ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు చిలుకూరు ప్రభాకర్, నందకిషోర్ పాల్గొన్నారు.