ఈ-స్టాంపుల్లో ఇష్టారాజ్యం
ABN , Publish Date - Apr 08 , 2025 | 12:14 AM
గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో రిజిస్ర్టేషన్ కార్యాలయాల్లో నాన్ జ్యుడీషియల్ స్టాంపుల క్రయ, విక్రయాలకు మంగళం పాడింది.

అరకొరగా నాన్ జ్యుడీషియల్ స్టాంపుల సరఫరా
బ్లాక్‌లో అధిక ధరలకు విక్రయం
కల్లూరు, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో రిజిస్ర్టేషన్ కార్యాలయాల్లో నాన్ జ్యుడీషియల్ స్టాంపుల క్రయ, విక్రయాలకు మంగళం పాడింది. వాటి స్థానంలో ఈ-స్టాంపు పత్రాలను తెచ్చింది. అంతే కాకుండా స్టాక్ హోల్డింగ్ ఏజెన్సీ ద్వారా స్టాంపువెండర్లతో విక్రయిం చేందుకు గతంలో జగన్ సర్కార్ చర్యలు తీసుకుంది. ఈ-స్టాంపింగ్ విధానం అమల్లోకి వచ్చాక నాన్ జుడిషియల్ స్టాంపులు దొరకడం గగనమైంది. అయా విలువలతో ముద్రించే స్టాంపులు అందుబాటులో లేకపోవడంతో క్రయ, విక్రయదారులు ఈ-స్టాంపింగ్‌పైనే ఆధారపడాల్సి వచ్చింది. ఈ క్రమంలో వీటి అమ్మకాల్లో పెద్దఎత్తున లొసుగులు బయటకు వస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ విధానాలపై ప్రజల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో ఎన్నికల ముందు కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన అనంతరం ఈ-స్టాంపు ప్రక్రియను తొలగిస్తామని సూచించారు. అదేవిధంగా నాన్ జ్యుడీషియల్ స్టాంపులను అందుబాటులోకి తీసుకువచ్చి స్థిరాస్థి వ్యాపారులు, క్రయ,విక్రయదారుల అందజేస్తామని ప్రకటించింది. అందులో భాగంగా కర్నూలు జిల్లాకు అక్టోబరు 2024లో 32వేలు, ఫిబ్రవరి 2025లో 24వేల స్టాంపులను కేటాయించారు..అధికారులు వాటిని జిల్లాలోని 13 సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాలతో పాటు స్లాంపు వెండర్లకు పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లో రూ.100 మినహా స్టాంపులన్నీ ఖాళీ అయ్యాయి. దాదాపు మూడు నెలలకు పైగా స్టాంపులు లేకపోవడంతో వీటి అమ్మకాలు దాదాపు నిలిచి పోయాయి. కర్నూలు, కల్లూరు సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో ప్రస్తుతం రూ.10, 20, 50 రూపాయల నాన్ జ్యుడీషియల్ స్టాంపులు లభించని పరిస్థితి నెలకొంది.
ఈ-చలాన్ కట్టాల్సిందే..
ప్రజలు ఈ-చలాన్ కడితేనే ఈ-స్టాంపు ఇస్తున్నారు. స్టాంపు వెండర్లకు ఏజెన్సీ టార్గెట్ పెట్టిమరీ ఈ-చలాన్ కట్టిస్తున్నట్లు విమర్శలున్నాయి. గతంలో ప్రజలు సీఎఫ్‌ఎంఎస్, బ్యాంకులో చలానా ఇచ్చేవిధానం అమలులో ఉండేది. ప్రస్తుతం ఈవిధానానికి దాదాపు స్వస్తి పలికినట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లాలోని 13 సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లో ప్రతి రోజు దాదాపు 350-500 రిజిస్ర్టేషన్లు జరుగుతాయి. ఈ-స్టాంపు పత్రాల జారీకి గత ప్రభుత్వం కర్నూలుకు చెందిన ఒక స్టాక్ హోల్డింగ్ సంస్థకు ఏజెన్సీ కట్టబెట్టింది. సదరు ఏజెన్సీ తాను ఏర్పాటు చేసుకున్న స్టాంపువెండర్ల ద్వారా డిమాండును బట్టి ఈ-స్టాంపు పత్రాలు అమ్ముతూవస్తోంది. రిజిస్ర్టేషన్ల కోసం కొనుగోలుదారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానాను కూడా ఈ-స్టాంపు పత్రాలు అమ్మే స్టాక్ హోల్డింగ్ ఏజెన్సీకే చెల్లించాలని.. లేకుంటే ఈ-స్టాంపు ఇవ్వకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తు న్నారన్న విమర్శలు ఉన్నాయి. మొత్తంమీద రేట్లుపెంచి కృత్రిమకొరత సృష్టించి అక్రమంగా ఈ-స్టాంపు పత్రాలను ఎక్కువ మొత్తాన్ని వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. కృత్రిమ కొరత వల్ల రూ.10, 20, 50 స్టాంపులు దొరకడం లేదు. కేవలం రూ.100 మాత్రమే అందుబాటులో ఉండగా రూ.50 నుంచి 100 అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వానికి ప్రతిపాదనలు
నాన్ జ్యూడీషియల్ స్టాంపుల ఇండెంట్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపు తాం. సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాలు, స్టాంపు వెండర్లు కృత్రిమ కొరత సృష్టించి ప్రజలు స్థిరాస్తి వ్యాపారులను ఇబ్బందులకు గురిచేస్తే సహించం. అధిక మొత్తం వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లాలో ఈ-స్టాంపింగ్ ఏజెన్సీ పరిధిలో క్రయవిక్రయాలు జరుగుతు న్నాయి. ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు చేపడతాం.
- డీఐజీ పీజీఎస్ కళ్యాణి