Share News

ప్రారంభమైన ‘పది’ పరీక్షల మూల్యాంకనం

ABN , Publish Date - Apr 04 , 2025 | 12:17 AM

నంద్యాల ఎస్‌డీఆర్‌ ఉన్నత పాఠశాలలో గురువారం పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం 1339 మంది ఉపాధ్యాయులతో ప్రారంభమైంది.

ప్రారంభమైన ‘పది’ పరీక్షల మూల్యాంకనం
ఉపాధ్యాయులకు సూచనలిస్తున్న డీఈవో జనార్దన్‌రెడ్డి

విధుల్లో 1,339 మంది ఉపాధ్యాయులు

నంద్యాల ఎడ్యుకేషన్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): నంద్యాల ఎస్‌డీఆర్‌ ఉన్నత పాఠశాలలో గురువారం పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం 1339 మంది ఉపాధ్యాయులతో ప్రారంభమైంది. ఉదయం 9గంటలకే ఉపాధ్యాయులు కేంద్రానికి చేరుకుని 11గంటలకు మూల్యాంకనాన్ని ప్రారంభించారు. ప్రతి ఉపాధ్యాయుడు 40 పేపర్లను మూల్యాంకనం చేసేవిధంగా డీఈవో జనార్దన్‌రెడ్డి పర్యవేక్షణలో ఏర్పాట్లు చేశారు. డీఈవో మాట్లాడుతూ ఈనెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మూల్యాంకనం పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించిందని చెప్పారు. దీంతో మూల్యాంకనం కోసం 168 చీఫ్‌ ఎగ్జామినర్లు, 966 మంది సహాయ ఎగ్జామినర్లు, 205 మంది ప్రత్యేక సహాయకులను నియమించామని తెలిపారు. జిల్లాకు 1,90,000 జవాబు పత్రాలను కేటాయించారని, మూల్యాంకనం కోసం నియమించిన ఉపాధ్యాయులకు అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్పారు. అనివార్య కారణాల వల్ల రాలేకపోయిన ఉపాధ్యాయుల స్థానంలో వేరొకరిని నియమించేందుకు అదనంగా మరో 30 మంది ఉపాధ్యాయులను సిద్ధంగా ఉంచామన్నారు. మొదటి రోజు ఉపాధ్యాయులకు ఏదైనా అసౌకర్యంగా ఉంటే గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు.

ఉపాధ్యాయుల అసంతృప్తి

మూల్యాంకనం కేంద్రంలో సరిపడా మరుగుదొడ్లు, నీటి సదుపాయం లేవని పలువురు ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. స్కూలు ఉపాధ్యాయులకు, ఇతరులను కూడా ఒకే గేటు నుంచి పరీక్ష కేంద్రాల మీదుగా రాకపోకలు సాగించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అసలే ఎండాకాలం కావడం ఉష్ణోగ్రత తీవ్రస్థాయిలో ఉన్నా రేకుల షెడ్డుతో ఉన్న ఆడిటోరియంలో సుమారు వంద మందికి పైగా ఉపాధ్యాయులు మూల్యాంకనం విధులు చేయడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Updated Date - Apr 04 , 2025 | 12:17 AM