మన నిర్మల నెంబర్ వన్..
ABN , Publish Date - Apr 13 , 2025 | 12:25 AM
మన నిర్మల నెంబర్ వన్..

ఇంటర్ బైపీసీలో 966 మార్కులు
అక్షరం వైపు నడిపించిన ఆంధ్రజ్యోతి
కలెక్టర్ స్ఫూర్తినిచ్చారు.. ఐపీఎస్ కావడమే లక్ష్యం : నిర్మల
ఆదోని రూరల్ ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి) : నిరుపేద కుటుంబంలో జన్మించి.. 2021-22లో 10వ తరగతిలో 537 మార్కులు సాధించి కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఏడాదిపాటు చదువుకు దూరమై కూలి పనులకెళ్లిన నిర్మల మళ్లీ చదువు కొనసాగించి ప్రస్తుతం ఇంటర్మీడియట్ బైిపీసీ ఫలితాల్లో జిల్లా టాపర్‌గా నిలిచింది. ఆదోని మండలం పెద్దహరివాణం గ్రామానికి చెందిన హనుమంతమ్మ, శీనప్పలకు నలుగురు కుమార్తెలు. ఇందులో చివరి కూతురు నిర్మల గ్రామ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు చదివింది. 10వ తరగతిలో 537 మార్కులు సాధించింది. కుటుంబ పేదరికం వల్ల తల్లిదండ్రులు చదువు మాన్పించి పొలంబాట పట్టించారు. ఓ సందర్భంలో ఎంపీడీవో గీతావాణి, తహసీల్దార్ వెంకటలక్ష్మి, ఇస్వీ ఎస్.ఐ విజయలక్ష్మిలతో తాను చదువుకొని పోలీసు అధికారిని అవుతానని కన్నీరు పెట్టింది. తన తల్లిదండ్రులకు చెప్పి తన చదువు కొనసాగేలా చూడమని అర్థించింది. బాలిక బలీయమైన విద్యా ఆకాంక్షను గుర్తించిన ఆంధ్రజ్యోతి.. ప్లీజ్ మా అమ్మకు మీరైనా చెప్పండి.. అని జూన్ 29వ తేదీన ఓ కథనం ప్రచురించింది. దీంతో స్పందించిన అప్పటి కలెక్టర్ సృజన సంబంధిత అధికారులతో నిర్మలను తీసుకొని సాయంత్రంలోగా తన వద్దకు రావాలని ఆదేశించారు. కలెక్టర్ సృజన బాలికను అభినందించి, నేను నీకు అండగా ఉంటాను, ఎంతవరకు చదివితే చదివిస్తానని, ఆర్థిక సహాయం చేయడంతోపాటు ఆస్పరి కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో బైపీసీలో చేర్పించారు. నిర్మల కలెక్టర్ ఆశయాలను నిజం చేస్తూ, శనివారం విడుదలైన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 1000 మార్కులకు 966 మార్కులు సాధించింది. 26 కస్తూర్బా కాలేజీలలో 217మంది బైపీసీ విద్యార్థుల్లో అత్యధిక మార్కులు తెచ్చుకొని జిల్లాలో టాప్-1 స్థానంలో నిలిచింది. మున్ముందు కూడ ఇదే స్ఫూర్తితో విద్యలో కొనసాగాలని నిర్మలను ఇతర బాలికలు ఆదర్శంగా తీసుకోవాలని కర్నూలు గర్ల్ ఛైల్డ్ డెవలప్‌మెంట్ (జిసిడిఓ) అధికారి మేరీ స్నేహలత తెలిపారు.
ఆంధ్రజ్యోతికి జీవితాంతం రుణపడి ఉంటా: నిర్మల
చదువుకోవాలని ఉన్నా, తల్లిదండ్రులు అడ్డుప డ్డారు.... నాకు బాల్య వివాహం చేయడానికి సిద్ధమ య్యారు. రోజు వారి కూలీగా పొలం పనులకు వెళ్లేదాన్ని. నా స్నేహితులు కాలేజీకి వెళ్తుంటే వారిలో నేను లేను అని కుమిలిపోయేదాన్ని. ఒకరోజు మా ఇంటి వద్ద సామాన్లు శుభ్రం చేస్తుండగా, మా ఇంటి వద్దకొచ్చిన ఎస్.ఐ, తహ సీల్దార్, ఎంపీడీఓలను వేడుకున్నా నేను ఎలాగైనా చదువుకుంటా.. మా అమ్మ, నాన్నలను ఒప్పించండని ఏడ్చాను. వారు సరే అని వెళ్ళిపో యారు. కానీ మరుసటిరోజు ఆంధ్రజ్యోతి ప్లీజ్ మా అమ్మకు మీరైనా చెప్పండని కథనం ఇది చూసిన కలెక్టర్ సృజన నన్ను చేరదీసి ధైర్యం తోపాటు నాకు స్ఫూర్తినిచ్చారు. ఈరోజు ఇంటర్మీడియట్‌లో జిల్లా నెంబరు వన్‌గా మార్కులు సాధించడం ఎంతో గర్వకారణం. ఆంధ్రజ్యోతి వలనే నేను అక్షరం వైపు నడిచాను. నా జీవితాంతం ఆంధ్రజ్యోతికి రుణపడి ఉంటాను. ఆంధ్రజ్యోతి నన్ను గుర్తించకలేకపోయి ఉంటే నా జీవితం వ్యర్థమయ్యేది.
కలెక్టర్ మేడం నమ్మకాన్ని వమ్ము చేయను
కలెక్టర్ సృజన మేడమ్ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను... ఖచ్చితంగా ఐపీఎస్ సాధించి కలెక్టర్ మేడమ్‌కు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటా... ఐపీఎస్ అయి నేరాలు, బాల్య వివాహాలు, అవినీతిని నిర్మూలిస్తా. ఇంటర్మీడియట్‌లో నన్ను ఉపాధ్యాయులు తమ బిడ్డలా చూసుకున్నారు. ఏ రోజూ ఇబ్బందికి గురి చేయలేదు. హైద్రాబాదులో డిగ్రీ విత్ సివిల్ కాలేజీలో జాయిన్ అవుతా.