వ్యాపారికి అండ.. రైతుకు ఎండ..!
ABN , Publish Date - Apr 15 , 2025 | 12:29 AM
మార్కెట్ యార్డులో రూ.కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటుచేసిన గోదాములను వ్యాపారులకు ధారాదత్తం చేస్తున్నారు.

మండుటెండలో పంట ఉత్పత్తులు
ఉన్న ప్లాట్‌ఫారాలు వ్యాపారాలకు ధారాదత్తం
అమ్మకాల కోసం అన్నదాతల ఎదురు చూపు
అధికారుల తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు
కర్నూలు అగ్రికల్చర్, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): మార్కెట్ యార్డులో రూ.కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటుచేసిన గోదాములను వ్యాపారులకు ధారాదత్తం చేస్తున్నారు. దీంతో రైతులు అమ్మకానికి తెచ్చిన పంట ఉత్పత్తులు మండు టెండలో మాడిపోతున్నాయి. ఎప్పుడెప్పుడు కొనుగోలు చేస్తారా అని వ్యాపారుల కోసం రైతులు ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. గుంటూరు మిర్చి యార్డు తర్వాత అదేస్థాయిలో కర్నూలు మార్కెట్ యార్డుకు ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా తెలంగాణ ప్రాంతం నుంచి ఎండుమిర్చిని రైతులు అమ్మకా నికి తెస్తున్నారు. ప్రస్తుతం 500 క్వింటాళ్ల దాకా ఎండుమిర్చి అమ్మకానికి వస్తోంది. అయితే.. ఎర్రని ఎండలకు మిర్చి రైతులు పడుతున్న ఆగచాట్లను మార్కెట్ కమిటీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే ఫిర్యాదులు వెల్లువెత్తుతు న్నాయి. ఈ మార్కెట్ కమిటీకి చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్న జాయింట్ డైరెక్టర్ రామాంజనేయులు ప్రతి నెలా సమీక్ష చేసేందుకు ఏడీఎం కార్యాలయానికి వచ్చి వెళ్తున్నారే తప్పా కూతవేటు దూరంలోని మిర్చి యార్డులో రైతులు పడుతున్న ఆవేదనను మాత్రం పట్టించుకోవడం లేదు. వివిధ ప్రాంతాల నుంచి రైతులు తెస్తున్న ఎండు మిర్చిని వెంటవెంటనే వ్యాపారుల చేత కొనుగోలు చేయించేందుకు మార్కెట్ కమిటీ అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రూ.కోట్లు ఖర్చు పెట్టి.. వ్యాపారులకు కట్టబెట్టి:
ఎండలు, వర్షాలకు రైతులు తెచ్చిన పంట ఉత్పత్తులను కాపాడేందు కోసం ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు పెట్టి ప్లాట్‌ఫారాలను ఏర్పాటు చేసింది. అయితే కర్నూలు మార్కెట్ యార్డులో ప్లాట్‌ఫారాలన్నీ వ్యాపారుల వశం చేసేశారు. ఈ యార్డులో మిర్చి వ్యాపారులకు రూ.కోట్ల విలువ చేసే ప్లాట్‌ఫారాలను వ్యాపారులకు ఉచితంగా ధారాదత్తం చేయడంపై అన్నదాతలు ఇదేమీ దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్లాట్‌ఫారాల్లో వ్యాపారులు మిర్చిని నిల్వ చేసుకున్నందుకు వారి నుంచి ఒక్క రూపాయి కూడా మార్కెట్ కమిటీ అధికారులు వసూలు చేయడం లేదు. కొంత మంది వ్యాపారులు అక్కడే ఎలక్ర్టానిక్ కాటాలు ఏర్పాటు చేసుకొని రిటైల్‌గా వినియోగదారులకు అమ్ముకుంటున్నారు. దీని వల్ల మార్కెట్ కమిటీకి ఎటువంటి ఆదాయం లేకపోగా రైతులు అష్టకష్టాలు పడాల్సిన దుస్థితి ఏర్పడింది.
కనికరం లేని అధికారులు
దూర ప్రాంతాల నుంచి మండుతున్న ఎండలను లెక్క చేయకుండా రైతులు ఎండుమిర్చిని కర్నూలు మార్కెట్‌యార్డుకు తెస్తున్నారు. ఈ ఎండుమిర్చిని ప్లాట్‌ఫారాల్లో నిల్వ చేసి విక్రయాలు చేపట్టాల్సిన బాధ్యతను మార్కెట్ కవిటీ అధికారులు ఎప్పుడో మరిచిపోయారు. వ్యాపారుల అవసరాన్ని మాత్రమే వీరు గుర్తించి వారికి వసతులు ఏర్పాటు చేస్తున్నారే తప్పితే.. తమను ఎందుకు పట్టించుకోవడం లేదని మిర్చి రైతులు గొల్లుమంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్లాట్‌ఫారాలను రైతుల కోసం వినియోగించాల్సిన అవసరం ఉంది.
వ్యాపారులకు ప్లాట్‌ఫారాన్ని కేటాయించాం
కర్నూలు మార్కెట్ యార్డులో రైతులు తెచ్చిన పంట ఉత్పత్తులను నిల్వ చేసేందుకు అవసరమైన ప్లాట్‌ఫారాలు లేవు. దీని వల్ల ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే. మిర్చి వ్యాపారాన్ని అభివృద్ధి చేసి పన్నును పెంచేందు కోసమని మిర్చి వ్యాపారులకు ప్లాట్‌ఫారాన్ని కేటాయించాం. ఈ వ్యవహారంలో ఎటువంటి నిర్లక్ష్యం లేదు. ప్రస్తుతం మిర్చి వ్యాపారులకు వారి సొంత ఖర్చుతోనే షాపులు నిర్మించుకునేలా నిర్ణయం తీసుకున్నాం. ప్లాట్‌ఫారాల్లో మిర్చిని వ్యాపారులు నిల్వ చేసుకుని గిరాకీ వచ్చిన వెంటనే బయటకు తరలించాలని ఆదేశించాం.
- జయలక్ష్మి, సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ
ఇంత దారుణం ఎక్కడా లేదు
నేను దాదాపు రూ.5 లక్షలు ఖర్చు పెట్టి రెండెకరాల్లో మిర్చి పంటను సాగు చేశా. అధిక వర్షాలు, తెగుళ్ల కారణంగా 20 బస్తాల ఎండుమిర్చి మాత్రమే చేతికందింది. కనీసం ఈ ఎండుమిర్చిని అమ్ముకుందామని గుంటూరు మార్కెట్‌కు వెళ్లకుండా శనివారం తెల్లవారుజామునే కర్నూలు మార్కెట్ యార్డుకు వచ్చాను. తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మండుతున్న ఎండకు ఎప్పుడెప్పుడు కొంటారా అని వ్యాపారుల కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. టెండరు ఫారాలు వ్యాపారుల చేతికి మధ్యాహ్నం తర్వాతనే వస్తాయని చెబుతుండటంతో మా ప్రాణాలు పైపైనే పోతాయోనని ఆందోళనగా ఉంది.
- లింగమయ్య, ఎల్కూరు, గూడూరు మండలం
ప్లాట్‌ఫారాలను వ్యాపారులకు ఇస్తారా?
రూ.కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం మా పంట ఉత్పత్తులను నిల్వ చేసేందుకు గోదాములను, ప్లాట్‌ఫారాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే అధికారులు, వ్యాపారుల నుంచి ఏం ప్రయోజనం పొందుతున్నారో గానీ ప్లాట్‌ఫారాలను వ్యాపారులకు ధారాదత్తం చేస్తున్నారు. కర్నూలు మార్కెట్ కమిటీలో మిర్చి ప్లాట్‌ఫారాలను వ్యాపారులకు ఉచితంగా ధారాదత్తం చేశారు. దీంతో మండుటెండలకు మాతోపాటు తెచ్చిన మిర్చి బస్తాలు ఎర్రని ఎండలకు మాడిపోవాల్సిన దుస్థితి దాపురించింది. వ్యాపారులు కోరిన వెంటనే వారికి షాపులు కేటాయిస్తున్నారు. మిర్చి బస్తాలను ప్లాట్‌ఫారాల్లో నిల్వ చేసి ఎందుకు విక్రయాలు చేపట్టడం లేదో అధికారులే సమాధానం చెప్పాలి.
- మద్దిలేటి, గూడూరు