సర్వజనుల దురవస్థ
ABN , Publish Date - Apr 14 , 2025 | 12:15 AM
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల అనేక రుగ్మతలతో కునారిల్లుతున్నది. ఆస్పత్రికి వెళ్లిన వాళ్లు వ్యాధుల బాధల కన్నా అసౌకర్యాలతో ఇబ్బందిపడుతు న్నారు.

ముందుకు సాగని ఐపీడీబ్లాక్ పనులు
మందుల కొరత.. పరీక్షల కోసం ఇక్కట్లు
ఒకే ప్రధాన ద్వారంతో రోగుల ఇబ్బందులు
20 నెలల తర్వాత ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సమావేశం
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల అనేక రుగ్మతలతో కునారిల్లుతున్నది. ఆస్పత్రికి వెళ్లిన వాళ్లు వ్యాధుల బాధల కన్నా అసౌకర్యాలతో ఇబ్బందిపడుతు న్నారు. ఈ పరిస్థితుల్లో ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ కమిటీ సమావేశం దాదాపు 20 నెలల తర్వాత సోమవారం జరగనుంది. ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నా సౌకర్యాలు మాత్రం పెరగడం లేదని, హెచ్‌డీఎ్‌స సమావేశాల్లో చర్చలు తప్ప ఆచరణ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఆస్పత్రి దుస్థితిపై కథనం...
కర్నూలు హాస్పిటల్, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): ఆసుపత్రి ముందుండే ఎన్టీఆర్ సర్కిల్ నిత్యం రద్దీగా ఉంటుంది. కొంతకాలం కింద ఆసుపత్రి ప్రధాన ద్వారం మూసేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలోకి వెళ్లడానికి, రావడానికి ఒకటే గేటు ఉంది. అది సూపర్‌స్పెషాలిటీ ఓపీ బ్లాక్ వద్ద ఉంది. దీంతో అక్కడ రద్దీ నెలకొంది. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. అంబులెన్సులు కూడా రావడం కష్టంగా మారింది. నేడు జరగబోయే ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సమావేశంలోనైనా ఇన్‌గేట్‌ను ప్రారంభించాలని రోగులు కోరుతున్నారు.
ఫ్యాన్లు లేక ఉక్కపోత
ఆసుపత్రిలో ఫ్యాన్లు లేక రోగులు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. 8 నెలలుగా ఫ్యాన్లు కొనలేదు. చెడిపోయిన ఫ్యాన్లకు మరమ్మతులు చేయించలేదు. అధికారుల రూములో మాత్రమే మరమ్మతు చేయిస్తున్నారు. గైనిక్, చిన్నపిల్లల వార్డులతో పాటు చాలా వార్డుల్లో ఫ్యాన్లు తిరగడం లేదు.
పందులు, కోతుల బెడద
ఆసుపత్రిలోని సూపర్ స్పెషాలిటీ బ్లాక్, బూత్‌బంగ్లా, మానసిక వ్యాధుల విభాగం, హౌస్ సర్జన్ క్వార్టర్లు, ఎంసీహెచ్ బ్లాక్ వద్ద పందులు స్వైర విహారం చేస్తున్నాయి. సెక్యూరిటీ గార్డులు చేతులెత్తేశారు. పందులు గుంపులు గుంపులుగా చేరడంతో అపరిశుభ్రత నెలకొంది. ఎంసీహెచ్ బ్లాక్‌లో కోతుల బెడదతో రోగులు, వారి సహాయకులు ఆందోళన చెందుతున్నారు.
ఆగిపోయిన ఐపీడీ బ్లాక్
గత వైసీపీ ప్రభుత్వం నాడు-నేడు పనుల కింద రూ.500 కోట్లతో ఐపీడీ బ్లాక్, న్యూలెక్చరర్ గ్యాలరీ నిర్మాణ పనులు ప్రారంభించింది. రూ.500 కోట్లతో టెండరు కూడా పిలిచారు. ఐపీడీ బ్లాక్ పనులను కేఎంవీ సంస్థ ప్రారంభించింది. రూ.17.89 కోట్ల మేర బిల్లులు చెల్లించకపోవడంతో కొత్త పనులకు అనుమతులు లేకపోవడంతో పనులు ఆగిపోయాయి. ప్రస్తుతం నిర్మాణాలు పూర్తి కావాలంటే రూ.130 కోట్లు అవసరం అవుతోంది. హెచ్‌డీఎ్‌స సమావేశంలో ఐపీడీ బ్లాక్‌కు నిధులు కేటాయించాలని రోగులు కోరుతున్నారు.
మందుల కొరత
ఆసుపత్రిలో మందులు తగినన్ని లేవు. మూడు నెలలుగా సాధారణ మందులు కూడా అందుబాటులో లేవు. దీంతో అత్యవసర విభాగాల్లో రాత్రివేళలో మందుల కోసం బయటికి రాస్తున్నారు. క్యాజువాల్టీలో ప్యాంటాప్ ఇంజెక్షనర్లు కొరత తీవ్రంగా నెలకొంది.
మరికొన్ని సమస్యలు
ఆసుపత్రిలో రోగులు, వారి సహాయకుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఒక రోగికి ఇద్దరు, ముగ్గురు సహాయకులు వస్తుంటారు. దీంతో అత్యవసర విభాగాలు, వార్డుల్లో రద్దీ పెరిగింది. వార్డుల్లో ఇన్‌ఫెక్షన్లు పెరుగుతున్నాయి. ఈసారైనా రోగుల సహాయకులకు విజిటర్ పాసులను ఏర్పాటు చేసి ఈ సమస్యను పరిష్కరించాల్సి ఉంది.
ఆసుపత్రిలో పారిశుధ్య కార్మికులకు 5 నెలలు, సెక్యూరిటీ గార్డులకు 4 నెలల నుంచి వేతనాలు అందడం లేదు. గత ఏడాదిగా దోమల నివారణకు ఫాగింగ్ చేయడం లేదు. పెస్ట్ కంట్రోల్‌కు రూ.5.90 లక్షలు నెలకు చెల్లిస్తున్నా ఎలుకలు, పాముల నివారణకు మందులు కూడా లేవు.
ఆసుపత్రిలో సౌకర్యాలు కరువయ్యాయి. అత్యవసర విభాగాల్లో చేరిన రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. స్టెచ్చర్లు, వీల్ చైర్లు అందుబాటులో లేవు. ఎంఎన్‌వో, ఎఫ్‌ఎన్‌వోల కొరత ఉంది.
ఔట్ సోర్సింగ్‌లకు పూర్తి స్థాయిలో సేవలు అందించేందుకు ప్రవేశపెట్టిన సాయంత్రం ఓపీలు సరిగ్గా అమలు కావడం లేదు. ఈ ఓపీల్లో కేవలం పీజీలు పనిచేస్తున్నారు. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
ఫ్యాన్ పని చేయడం లేదు
మాది అవుకు మండలం సింగనపల్లె. కాన్పు కోసం ఐదు రోజుల క్రితం గైనిక్-4 యూనిట్‌కు వచ్చాం. ప్యాన్ పని చేయడం లేదు. ఉక్కపోతతో అల్లాడిపోతున్నాము.
- శ్రీలేఖ, గర్భిణి, గైనిక్‌విభాగం
కాన్పుకు రూ. 1000 ఇచ్చాం
ఆసుపత్రికి శనివారం లొద్దిపల్లె నుంచి నా కూతురు మాధవిని తీసుకుని వచ్చాము. మగబిడ్డ పుట్టాడు. మగబిడ్డ పుట్టాడని సిబ్బంది రూ.1000 లు తీసుకున్నారు.
- వెంకటేశ్వర్మ, గర్భిణి తల్లి
నేడు హెచ్‌డీఎ్‌స సమావేశం
కలెక్టర్ అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం, కోడుమూరు ఎమ్మెల్యేలు డీఎంహెచ్‌వో, డీసీహెచ్‌ఎ్‌స, ఐదు మంది హెచ్‌డీఎ్‌స సభ్యులు పాల్గొంటారు. ఆసుపత్రి అభివృద్ధికి కొన్ని తీర్మానాలు చేస్తాం.
- డా.కే. వెంకటేశ్వర్లు సూపరింటెండెంట్, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల