Share News

సత్తా చాటారు..!

ABN , Publish Date - Apr 13 , 2025 | 12:02 AM

గత 20 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా కర్నూలు జిల్లాలో ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. ప్రభుత్వ ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలలో కూడా ఉత్తమ ఫలితాలు వచ్చాయి.

సత్తా చాటారు..!

రికార్డు స్థాయిలో ఇంటర్మీడియట్‌ ఫలితాలు

ప్రథమ సంవత్సరంలో 73 శాతం

ద్వితీయ సంవత్సరంలో 83 శాతం

ప్రభుత్వ, ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలలో పెరిగిన ఉత్తీర్ణత

కర్నూలు ఎడ్యుకేషన్‌, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): గత 20 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా కర్నూలు జిల్లాలో ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. ప్రభుత్వ ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలలో కూడా ఉత్తమ ఫలితాలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు. ఇంటర్‌ విద్యాశాఖ అధికారులు, అధ్యాపకుల కృషి, చొరవ వలన కూడా ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలు అంచనాలను మించి వచ్చాయి. కర్నూలు జిల్లాలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులు మొత్తం 20,420 మంది పరీక్షలకు హాజరు కాగా, 14,859 మంది విద్యార్థులు పాసై 73 శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు మొత్తం 18,093 మంది హాజరు కాగా, ఇందులో 14,967 మంది పాసై 83 శాతం ఉత్తీర్ణత సాధించారు. కర్నూలు జిల్లా ఇంటర్‌ బోర్డు చరిత్రలో ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు రికార్డు స్థాయిలో నిలిచాయి. రాష్ట్రంలోనే ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 73 శాతం సాధించి రాష్ట్రంలోనే కర్నూలు జిల్లా 8వ స్థానంలో, ద్వితీయ సంవత్సరంలో 83 శాతం ఉత్తీర్ణత సాధించి 11వ స్థానంలో నిలిచింది. కర్నూలు ప్రభుత్వ టౌన్‌ మోడల్‌ జూనియర్‌ కళాశాలలో ఎంపీసీ గ్రూపునకు చెందిన విద్యార్థిని బండి పావని 983/1000, ఇదే కళాశాలకు చెందిన విద్యార్థిని పి. లలితారాణి 977/1000మార్కులు సాధించారు. కోడుమూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఎంపీసీ విద్యార్థిని రాజేశ్వరి 982 మార్కులు సాధించి అబ్బురపరిచారు. అలాగే పంచలింగాల కేజీబీవీకి చెందిన టి. మానస ఏఅండ్‌టీ గ్రూపులో 992/1000 మార్కులు, ఇదే కళాశాలకు చెందిన యు. మానస 991/1000 మార్కులు, కర్నూలు బీ. క్యాంపు ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలకు చెందిన ఈశ్వర్‌ రెడ్డి కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో 982/1000 మార్కులు సాధించారు. ఈ ఫలితాలను పరిశీలిస్తే కార్పొరేట్‌ కళాశాలలకు తీసిపోని విధంగా ప్రభుత్వ ఎయిడెడ్‌ కళాశాలలో చదివే విద్యార్థులు అత్యధిక ఉత్తీర్ణత సాధించారు. కర్నూలు జిల్లాలో గత ఐదు సంవత్సరాల ఇంటర్‌ ఫలితాలు పరిశీలిస్తే వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రభుత్వ యాజమాన్యాల జూనియర్‌ కళాశాలలో..

జిల్లాలోని 22 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జనరల్‌ కోర్సులో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 3,112 మంది పరీక్షకు హాజరుకాగా, 1529 మంది పాసై 49 శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే ద్వితీయ సంవత్సరంలో 2848 మంది పరీక్షకు హాజరు కాగా, 1853 మంది పాసై 65శాతం ఉత్తీర్ణత సాధించారు. ఏపీ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలో 185 మందికి 171 మంది పాసై 92 శాతం ద్వీతీయ సంవత్సరంలో 168 మందికి గాను 163 మంది పాసై 97 శాతం ఉత్తీర్ణత సాధించారు. బీసీ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలో 145 మంది పరీక్షకు హాజరు కాగా 144 మంది పాసై 99 శాతం ఉత్తీర్ణత, ద్వితీయ సంవత్సరంలో 123 మందికి గాను 120 మంది పాసై 98 శాతం ఉత్తీర్ణత సాధించారు. నాలుగు ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో 467 మందికి గాను 286 మంది పాసై 61 శాతం ఉత్తీర్ణత, ద్వితీయ సంవత్సరంలో 411 మందికి గాను 305 మంది పాసై 74 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలోని ఆదర్శ పాఠశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం జనరల్‌ కోర్సులో 1325 మంది పరీక్షకు హాజరు కాగా, 817 మంది పాసై 61.66 శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 1052 మంది విద్యార్థులు హాజరు కాగా, 783 మంది పాసై 74.83 శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే జిల్లాలోని డా. బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలలో 643 మంది పరీక్షకు హాజరు కాగా, 631 మంది పాసై 98.13 శాతం ఉత్తీర్ణత సాధించారు. వెల్దుర్తి, పత్తికొండ రెసిడెన్షియల్‌ గురుకులాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. కర్నూలు జిల్లాలోని 26 కేజీబీవీల్లో జనరల్‌ కోర్సులో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 722 మందికి గాను 542 మంది పాసై 73 శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే ద్వితీయ సంవత్సరంలో 534 మందికి గాను 475 మంది పాసై 87 శాతం ఉత్తీర్ణత సాధించారు. పంచలింగాల కేజీబీవీలోని ఒకేషనల్‌ కోర్సులో ఏఅండ్‌ టీ కోర్సులో ద్వితీయ సంవత్సరం విద్యార్థిని టి. మానస 992/1000 మార్కులు, అలాగే ఇదే కళాశాలకు చెందిన యు. మానస 991/100 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. మూడు కేజీబీవీల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు.

ప్రైవేటు జూనియర్‌ కళాశాలలో

జిల్లాలోని 81 ప్రైవేటు జూనియర్‌ కళాశాలలో అత్యుత్తమ ఫలితాలు వచ్చాయి. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో జనరల్‌ కోర్సులో 13,920 మందికి గాను 10,891 మంది పాసై 78 శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే ద్వితీయ సంవత్సరంలో 12,419 మందికిగాను 10,758 మంది పాసై 87 శాతం ఉత్తీర్ణత సాధించారు.

జిల్లాలో టాపర్స్‌

ఫ సీనియర్‌ ఎంపీసీ విభాగంలో టాపర్స్‌ : కే. రాజేశ్వరి - 992/1000, మద్దిలహరి - 991/1000, కే. జోహ - 990/1000, బి. గోపినాథ్‌ - 990, ముల్ల అఫ్రహా సన్నా 990, పి. హరిణి 989, కనికె చరణ్‌ కుమార్‌ 989, ముక్కమల్ల వెంకట హర్షనందిని 988, బట్ల చార్మిల 998, ఎర్రగుంట్ల రమ్యశ్రీ 988, షేక్‌ రుక్సానాబీ 987, బండి పావని 986, పి.లలితారాణి 977,

ఫ సీనియర్‌ ఒకేషనల్‌ విభాగంలో - ఆస్పరి కేజీబీవీ - ఎస్‌. నిర్మల 996/1000.

ఫ సీనియర్‌ బైపీసీ విభాగంలో టాపర్స్‌: దుగ్గి అఖిల - 989, దీపిక వేముగోడు 988, ఉప్పర శరణ్య సాయి 988, సురవరపు నాయన హర్షిత యాదవ్‌ 988, మరాఠి మౌనిక జాదవ్‌ 988, సీహెచ్‌ సాదృశ్య 988.

మే 12 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 12 నుంచి 20వ తేదీ వరకు కొనసాగుతాయని ఆర్‌ఐవో ఎస్‌వీఎస్‌ గురువయ్యశెట్టి శనివారం తెలిపారు. ఈ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఇంటర్‌ ఫెయిల్‌ అయిన విద్యార్థులు, ఇంప్రూవ్‌ మెంటు కోసం ఏప్రిల్‌ 15 నుంచి 22వ తేదీ వరకు పరీక్ష ఫీజులు చెల్లించాలన్నారు. ప్రాక్ట్టికల్స్‌ పరీక్షలు మే 28 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు జరుగుతాయన్నారు. జూన్‌ 4వ తేదీ ఉదయం 10 నుంచి మఽధ్యాహ్నం 1 గంట వరకు ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వాల్యు ఎగ్జామినేషన్‌ జూన్‌ 6వ తేదీన పర్యావరణ పరీక్ష జరుగుతుందన్నారు. ఏప్రిల్‌ 13 నుంచి 22వ తేదీ వరకు రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Updated Date - Apr 13 , 2025 | 12:02 AM