Share News

Revenue Department Reports: భూదందాల్లో ఆరుగురు జగన్‌ మంత్రులు

ABN , Publish Date - Mar 31 , 2025 | 03:40 AM

జగన్ హయాంలో జరిగిన భూదందాల్లో ఆరుగురు మంత్రులు, 42 మంది ప్రజాప్రతినిధులు, 120 మంది వైసీపీ నేతలు పాత్ర వహించినట్లు రెవెన్యూ శాఖ నివేదిక వెల్లడించింది. అసైన్డ్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది.

Revenue Department Reports: భూదందాల్లో ఆరుగురు జగన్‌ మంత్రులు

42 మంది ప్రజాప్రతినిధులు, 120 మంది నేతలు కూడా

22 మంది డిప్యూటీ కలెక్టర్లకూ ప్రధాన పాత్ర

48 మంది తహశీల్దార్లు, 23 మంది సర్వేయర్లు సైతం

ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ నివేదిక

మొత్తం 13.59 లక్షల ఎకరాలు ఫ్రీహోల్డ్‌

చట్టవ్యతిరేకంగా నిషేధ జాబితా నుంచి

5.74 లక్షల ఎకరాలకు విముక్తి

8,483 ఎకరాలు అక్ర మ రిజిస్ట్రేషన్‌

అంతర్గత విచారణలో నిగ్గుతేలిన నిజాలు

రాజకీయ పెద్దలు, అవినీతి అధికారులపై

క్రిమినల్‌ చర్యలకు సిఫారసు

వేటేస్తారా.. వదిలేస్తారా?.. సీఎం కోర్టులో ‘రెవెన్యూ’ బంతి

జగన్‌ జమానాలో ప్రభుత్వ, ప్రైవేటు భూములు ఎన్ని అన్యాక్రాంతమయ్యాయి.. జరిగిన భూదందాల్లో ఏ మంత్రి పాత్ర ఎంత.. వైసీపీ నేతలెవరు కీలక పాత్ర పోషించారు.. మదనపల్లె ఆఫీసు-ఫైళ్ల దహనం సూత్రధారులెవరు.. పాత్రధారులెవరు.. ఆ ప్రాంతంలో అసైన్డ్‌, ఇతర భూములను చేజిక్కించుకుని లబ్ధి పొందిన రాజకీయ నేతలెవరు.. వారి కొమ్ముగాసి అవినీతి, అడ్డగోలు అక్రమాలకు పాల్పడిన అధికారులెవరు.. ఇందులో రెవెన్యూ యంత్రాంగం పాత్రేంటో రెవెన్యూ శాఖ నిగ్గుతేల్చింది. అయితే తనంత తాను వారిపై కఠిన చర్యలు తీసుకునే ఆస్కారం లేదు. ప్రభుత్వ స్థాయిలోనే నిర్ణయాలు తీసుకోవాలి. ఈ నేపథ్యంలో ఆ శాఖ కీలక అంశాలపై నాలుగు సమగ్ర నివేదికలను ముఖ్యమంత్రి ఆమోదానికి పంపించింది. ఇప్పుడాయన ఏం నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లోనే గాక అధికార వర్గాల్లోనూ నెలకొంది.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

జగన్‌ హయాంలో భూదందాలకు పాల్పడిన మంత్రులు, వైసీపీ నేతలు, రెవెన్యూ అధికారులెవరో రెవెన్యూ శాఖ నిర్ధారించింది. నాటి మంత్రుల్లో ఆరుగురు ఈ అక్రమాలకు పాల్పడ్డారని తేల్చింది. 42 మంది ప్రజాప్రతినిధులు, 120 మంది వైసీపీ నేతలు, 22 మంది డిప్యూటీ కలెక్టర్లు, 48 మంది తహశీల్దార్లు ప్రధాన పాత్ర పోషించారని స్పష్టంచేసింది. వారందరిపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని సిఫారసు చేసింది. వాస్తవానికి రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుతీరిన నెలన్నర రోజులకే 2024 జూలై 22న దుండగులు ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ ఆఫీసుకు కుట్రపూరితంగా నిప్పుపెట్టారు. కీలకమైన భూ రికార్డులను తగలబెట్టారు. ఈ ఉదంతంపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. మరోవైపు రెవెన్యూ శాఖ అంతర్గత విచారణ చేపట్టింది. ఓ సీనియర్‌ అసిస్టెంట్‌, ఆర్‌డీవో, మాజీ ఆర్‌డీవోను ప్రభుత్వం సస్పెం డ్‌ చేసింది. సీనియర్‌ అసిస్టెంట్‌ గౌతమ్‌ తేజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ కేసులో రెవెన్యూ విభాగం శాఖాపరమైన విచారణకు ఉపక్రమించింది. మదనపల్లె రెవెన్యూ డివిజన్‌ పరిధిలో వేలాది ఎకరాల అసైన్డ్‌ భూములు అక్రమంగా ఫ్రీహోల్డ్‌ చేశారని తేల్చారు. ఈ నేపథ్యంలో గతేడాది ఆగస్టులోనే ఫ్రీహోల్డ్‌ భూముల రిజిస్ట్రేషన్‌ను ప్రభుత్వం నిలిపివేసింది. డిప్యూటీ కలెక్టర్ల నేతృత్వంలో ఎక్కడికక్కడ విచారణ బృందాలు ఏర్పాటు చేసి అసైన్డ్‌ భూములపై విచారణ చేయించింది. భూముల రికార్డులను పునఃపరిశీలన చేయించింది. రాష్ట్రవ్యాప్తంగా 13.59 లక్షల ఎకరాలను ఫ్రీహోల్డ్‌ చేయగా.. అందులో 5.74 లక్షల ఎకరాలను అక్రమంగా, చట్టవ్యతిరేకంగా, జీవో 596ని ఉల్లంఘించి నిషేధ జాబితా నుంచి బయటకు తీశారని విచారణలో తేలింది. 25 వేల ఎకరాలను రిజిస్ట్రేషన్‌ చేయగా, అందులో 8,483 ఎకరాలు అక్ర మంగా చేశారని తేల్చారు. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం.. నాటి వైసీపీ ప్రభుత్వంలో ఆరుగురు మంత్రులు, 42 మంది ప్రజాప్రతినిధులు, 120 మంది నేతలు, 22 మంది డిప్యూటీ కలెక్టర్లు, 48 మంది తహశీల్దార్లు, 23 మంది మండల సర్వేయర్లు.. ఈ భూదందాల్లో ప్రధాన పాత్రధారులని రెవెన్యూ శాఖ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. నేతలు, అధికారులపై అసైన్డ్‌ భూముల చట్టం-1977లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని సిఫారసు చేసింది.


క్రిమినల్‌ కేసులు, క్రమశిక్షణ చర్యలు..: చట్టవిరుద్ధంగా, కుట్రపూరితంగా ప్రభుత్వ, అసైన్డ్‌ భూములు కాజేసిన వారిపై భూముల ఆక్రమిత చట్టం-1905 కింద క్రిమినల్‌ కేసులు పెట్టాలని.. ప్రభుత్వ భూములను చెరపట్టేందుకు కుట్రలు, కుయుక్తులు పన్నినందుకు కూడా కేసులు నమోదు చేయాలని రెవెన్యూ శాఖ ప్రతిపాదించినట్లు తెలిసింది. నాడు ఆర్‌డీవోలు, తహశీల్దార్లుగా పనిచేసిన రెవెన్యూ అధికారులపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవడమే గాక ఏసీబీ లేదా విజిలెన్స్‌-ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో విచారణకు ఆదేశించాలని సూచించినట్లు సమాచారం. ఇవన్నీ ప్రభుత్వ స్థాయిలో తీసుకోవలసిన నిర్ణయాలే. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తప్పనిసరి. దీంతో ఆయా ప్రతిపాదనలను ఆయన పరిశీలనకు పంపించారు. సదరు ఫైలు ప్రస్తుతం సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన ఇచ్చే ఆదేశాల కోసం రెవెన్యూ శాఖ ఎదురుచూస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి...

Ugadi Wishes 2025: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్..

Ugadi Awards 2025: ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే: సీఎం చంద్రబాబు..

TDP Nara Lokesh: సీనియర్లకు గౌరవం.. జూనియర్లకు ప్రమోషన్‌

For More AP News and Telugu News

Updated Date - Mar 31 , 2025 | 03:40 AM