AP Toppers Honored: టాపర్లు బ్రాండ్ అంబాసిడర్లు
ABN , Publish Date - Apr 16 , 2025 | 05:43 AM
ప్రభుత్వ ఇంటర్ టాపర్లను మంత్రి లోకేశ్ అభినందిస్తూ వారిని ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రకటించారు. విద్యా సంస్కరణలు జూన్‌లో పూర్తవుతాయని, పీజీ ఫీజు రీయింబర్స్‌మెంట్ పునరుద్ధరించనున్నట్లు తెలిపారు.

మంచి ఫలితాలు రావనే ముద్రను చెరిపేశారు
ప్రభుత్వ పరువును కాపాడారు పీజీకి ఫీజు రీయింబర్స్‌మెంట్ పునరుద్ధరిస్తాం
ఐటీ ఒక్కటే కాదు.. అన్ని రంగాల్లోనూ అవకాశాలు
జూన్ నాటికి విద్యా సంస్కరణలు పూర్తి
ప్రభుత్వ ఇంటర్ టాపర్లతో మంత్రి లోకేశ్
అమరావతి, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కాలేజీల్లో చదివితే మంచి మార్కులు రావనే ముద్రను ఈ సంవత్సరం విద్యార్థులు చెరిపివేశారని మంత్రి లోకేశ్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ మేనేజ్‌మెంట్లలో చదివి ఇంటర్‌లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులను ఆయన అభినందించారు. మంగళవారం ఉండవల్లిలోని ఆయన నివాసంలో షైనింగ్ స్టార్స్-2025 పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో 52 మంది టాపర్లకు ల్యాప్‌ట్యా్‌పలు, మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘మీతో కలిసి కూర్చోవడం నా అదృష్టం. నేనెప్పుడూ చదువులో టాపర్‌ను కాను. మీరంతా టాపర్లు. టాపర్ అవ్వాలన్న ఆలోచన కూడా నాకెప్పుడూ రాలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే బ్యాక్ బెంచ్ స్టూడెంట్‌ని. కానీ మీరు విజేతలుగా నిలిచారు. ప్రభుత్వ పరువు కాపాడారు. పేదరికం వల్ల విద్యార్థులు చదువులకు దూరం కాకూడదు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థలను తీర్చిదిద్దుతాం. ఈ ఏడాది జూనియర్ కాలేజీల్లో అనేక సంస్కరణలు అమలుచేశాం. నేను పాయకాపురం పర్యటనకు వెళ్ళినప్పుడు ఓ చెల్లి చెప్పిన మాటలు గుర్తున్నాయి. తనకు అమ్మానాన్న లేరని, చేపలు అమ్ముతూ అమ్మమ్మ చదివిస్తోందని, మధ్యాహ్న భోజన పథకం తిరిగి ప్రవేశపెట్టడం వల్ల అమ్మమ్మపై కొంత భారం తగ్గిందని ఆ విద్యార్థి చెప్పింది.
మీరు బ్రాండ్ అంబాసిడర్లు
మీరంతా ఆంధ్రప్రదేశ్‌కు బ్రాండ్ అంబాసిడర్లు. విద్యార్థుల మధ్య పోటీ ఉండాలి. నేను తొమ్మిదో తరగతి వరకూ ఆడుతూపాడుతూ చదివేవాడిని. క్రికెట్ ఎక్కువగా ఆడేవాడిని. పదో తరగతి నుంచి నన్ను బాగా రుద్దారు. నేను కూడా రుద్దుడు బ్యాచ్ విద్యార్థినే. ఉన్నత విద్య తర్వాత ప్రపంచ బ్యాంకులో పనిచేశాను. ఆ తర్వాత ఎంబీఏ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చేశాను. అందుకే విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక సంస్కరణలపైనే దృష్టి పెట్టాను. పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు ఉచితంగా ఇచ్చాం. ప్రిన్సిపాళ్లకు పదోన్నతులు కల్పించాం. జూన్ నాటికి మొత్తం సంస్కరణలు పూర్తిచేస్తాం.
అన్ని రంగాల్లో అవకాశాలున్నాయి
అందరూ ఐటీ రంగంవైపే వెళ్లాలనుకోవడం సరికాదు. నేడు అనేక అవకాశాలు వస్తున్నాయి. రాష్ర్టానికి సోలార్, బయో గ్యాస్ కంపెనీలు వస్తున్నాయి. ఉత్పత్తి రంగంలోనూ భారీగా ఉపాధి అవకాశాలున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా మన లక్ష్యాలను మార్చుకోవాలి. ఈ మధ్య విద్యార్థులు సున్నితంగా మారుతున్నారు. ఒక సబ్జెక్టులో ఫెయిలైతే జీవితం అక్కడే ఆగిపోదు. అది స్పీడ్ బ్రేకర్ మాత్రమే. చిన్నచిన్న ఆటుపోట్లు ఎదురైనా ఎదుర్కోవాలి. మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత మాది. ప్రభుత్వ కాలేజీల్లో వసతులు మెరుగుపరుస్తాం. స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోవద్దు. డ్రగ్స్‌కు విద్యార్థులు దూరంగా ఉండాలి. ఈమధ్య కాలంలో పనిఒత్తిడి వల్ల నేను మా అమ్మతో, దేవాన్ష్‌తో కూడా మాట్లాడలేకపోయాను. అందుకే అలారం పెట్టుకుని మరీ వారితో మాట్లాడటం అలవాటుగా మార్చుకున్నా. మీరంతా ఉద్యోగాలు కోసం ఎదురుచూసేవా రిగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి.
ఐపీఎస్ అయ్యాక నాపై కేసు పెట్టొద్దు.. లోకేశ్ సరదా వ్యాఖ్య
విద్యార్థుల లక్ష్యాలపై లోకేశ్ సరదా వ్యాఖ్యలు చేశారు. ఐపీఎస్ అధికారి కావాలనుకుంటున్నాను అని ఓ విద్యార్థిని రాయడంపై స్పందించారు. ‘‘ఐపీఎస్ కావాలనుకోవడం మంచి లక్ష్యం. కానీ ఐపీఎస్ అయ్యాక నాపై కేసులు పెట్టొద్దు. ఇప్పటికే నాపై 23 కేసులున్నాయి. ఇంకా పెడితే బండి సంజయ్ అన్నతో పోటీ పడాలి. ఆయనపై 109 కేసులున్నాయంటున్నారు’’ అని సరదాగా వ్యాఖ్యానించారు.
నా కంటే బ్రాహ్మణి బెటర్
టాపర్లలో బాలికలు ఎక్కువ మంది ఉన్నారు. చదువుతోపాటు అన్ని రంగాల్లోనూ రాణించాలి. మహిళలు వ్యాపారంలో కూడా రాణిస్తారు. చదువులోగానీ, వ్యాపారంలోగానీ నా కంటే బ్రాహ్మణి బెటర్. అందుకే బాలికలు చదువుతోపాటు అన్ని రంగాలపైనా దృష్టి సారించాలి. పీజీ విద్యకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పునరుద్ధరిస్తాం. విదేశీ విద్య పథకానికి ప్రత్యామ్నాయం తీసుకొస్తాం. భవిష్యత్తులో ఇంకా కఠిన సవాళ్లు ఎదుర్కోవాలి. అందుకే నేను తెలుగుదేశం 40ఏళ్లుగా గెలవని మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకుని గెలిచాను. విద్యాశాఖ వద్దని చాలామంది చెప్పినా, కష్టపడడానికి ఇదో మంచి అవకాశమని.. కావాలనే ఈ శాఖ తీసుకున్నాను.