Share News

Minister Kollu Ravindra : పాపం పండింది!

ABN , Publish Date - Feb 14 , 2025 | 06:28 AM

‘వైసీపీ నాయకులపై కక్ష సాధించాలనుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలలోనే వంశీ, కొడాలి నాని వంటివారు జైలుకు వెళ్లేవారు. కక్షసాధింపు అనేది టీడీపీ డిక్షనరీలో లేదు’ అని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర

Minister Kollu Ravindra : పాపం పండింది!

కక్షసాధించాలనుకుంటే ఎప్పుడో జైలుకెళ్లేవారు: కొల్లు రవీంద్ర

ప్రతీకారం తీర్చుకునే అవసరం ‘కూటమి’కి లేదు: అచ్చెన్న

వంశీలాంటి మృగాలకు జైలే గతి: సోమిరెడ్డి

వంశీపై మరిన్ని కేసులు పెట్టడం ఖాయం: యార్లగడ్డ వెంకట్రావు

అక్రమ కేసులు బనాయించే సంస్కృతి వైసీపీదే: కొనకళ్ల

నాపైనా దాడి చేశారు.. ఆ ఫిర్యాదును విచారించాలి: నాదెండ్ల బ్రహ్మం

అమరావతి, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ నాయకులపై కక్ష సాధించాలనుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలలోనే వంశీ, కొడాలి నాని వంటివారు జైలుకు వెళ్లేవారు. కక్షసాధింపు అనేది టీడీపీ డిక్షనరీలో లేదు’ అని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ అరెస్టుపై పలువురు టీడీపీ నేతలు స్పందించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో, సచివాలయంలో గురువారం వారు విలేకరులతో మాట్లాడారు. కొల్లు రవీంద్ర మాట్లాడుతూ... ‘తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేసి వంశీ అడ్డంగా దొరికిపోయాడు. జగన్‌ హయాంలో రాజారెడ్డి రాజ్యాగం అమలైంది. రాష్ట్రవ్యాప్తంగా నాతోసహా అనేక మంది టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టారు’ అని అన్నారు.

వంశీ అరెస్టు కక్షసాధింపు కాదు: మంత్రి అచ్చెన్న

దాడికి ప్రతిదాడి, వేధింపులపై ప్రతీకారం తీర్చుకునే అవసరం కూటమి ప్రభుత్వానికి, టీడీపీకి లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని, అలాగని కక్ష తీర్చుకోవడం తమ విధానం కాదు’ అని అన్నారు. వంశీ లాంటి మృగాలు ఉండాల్సింది జైలులోనేనని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు. వంశీతోపాటు త్వరలో మరో మూడు మృగాలు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షించాల్సినవారే చీడ పురుగల్లా తయారయ్యారని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఈ అరెస్టుతో వంశీ అక్రమాలు మరిన్ని వెలుగులోకి వస్తాయి. ఆయనపై త్వరలో మరిన్ని కేసులు పెట్టడం ఖాయమని యార్లగడ్డ అన్నారు. వంశీ పాపాల పుట్ట బద్దలైందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పెద్ద సైకో డైరెక్షన్‌లో పనిచేస్తున్న చిన్న సైకో చివరకు కటకటాలపాలయ్యాడన్నారు. అక్రమ కేసులు బనాయించే సంస్కృతి వైసీపీదేనని ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణ అన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసి, వారిపైనే కేసులు పెట్టించిన ఘనుడు వంశీ అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం మాట్లాడుతూ... ‘నా ఇంటిపైనా వంశీ, ఆయన అనుచరులు దాడి చేశారు. తాడేపల్లి పోలీసుస్టేషన్‌లో కేసుకూడా పెట్టాను. ఆ ఫిర్యాదుపైనా పోలీసులు చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్‌ చేశారు. వంశీ పెద్ద అరాచకశక్తి అని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు.

Updated Date - Feb 14 , 2025 | 06:28 AM