జగన్‌ లిక్కర్‌ స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలి: ఎంపీ సానా

ABN, Publish Date - Feb 12 , 2025 | 05:40 AM

‘ఏపీలో గత ప్రభుత్వ హయాంలో రూ.వేల కోట్ల లిక్కర్‌ స్కాం జరిగింది. దానిపై సీబీఐ విచారణ జరిపించాలి’ అని రాజ్యసభలో టీడీపీ ఎంపీ సానా సతీశ్‌ డిమాండ్‌ చేశారు.

జగన్‌ లిక్కర్‌ స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలి: ఎంపీ సానా

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): ‘ఏపీలో గత ప్రభుత్వ హయాంలో రూ.వేల కోట్ల లిక్కర్‌ స్కాం జరిగింది. దానిపై సీబీఐ విచారణ జరిపించాలి’ అని రాజ్యసభలో టీడీపీ ఎంపీ సానా సతీశ్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఏపీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజ్యసభలో టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ బీద మస్తాన్‌రావుతో పాటు ఆయన మాట్లాడారు. ‘ఢిల్లీ లిక్కర్‌ స్కాం రూ.2 వేల కోట్లే. దాని కంటే ఏపీ లిక్కర్‌ స్కాం పెద్దది. విచారణలో అన్నీ బయటకు వస్తాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డి అటవీ భూములు, లిక్కర్‌ స్కాంకు సంబంధించిన అంశాలను సభలో మాట్లాడా. ప్రజల దృష్టి మరల్చేందుకే రాజ్యసభలో నా ప్రసంగానికి వైసీపీ నేతలు అడ్డుపడ్డారు. ఇష్టారీతిన మాట్లాడారు. మిథున్‌రెడ్డి, ఇతరులు నేరం రుజవైతే శిక్ష అనుభవించాల్సిందే. కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపునకు దిగితే ఇప్పటికే వారు అరెస్టు అయ్యేవారు’ అని సతీశ్‌ అన్నారు. ఎంపీ బీద మస్తాన్‌రావు మాట్లాడుతూ... ‘వైఎస్‌ జగన్‌ చెప్పినట్లు వైసీపీ ఎంపీలు మాట్లాడుతున్నారు. పోలవరం ఎత్తు తగ్గించారని వైసీపీ ఎంపీలు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. జగన్‌ పత్రికలో ఇష్టారీతిన రాసుకున్నా... ఆ పత్రికను చదివేవారు ఎవరూ లేరు. అది వైసీపీ కరపత్రం’ అని బీద మస్తాన్‌ రావు ఎద్దేవా చేశారు.

Updated Date - Feb 12 , 2025 | 05:40 AM