Nara Bhuvaneshwari : అతడితో నా పెళ్లి వల్లే.. నేను మారిపోయా..
ABN , Publish Date - Jan 21 , 2025 | 06:00 PM
Nara Bhuvaneshwari : తనకు చిన్న వయస్సులోనే వర్క్ హలిక్‌తో పెళ్లి అయిందని.. దీంతో తాను సైతం వర్క్ హలిక్‌గా మారిపోయానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చమత్కరించారు.

అమరావతి, జనవరి 21: తలసేమియా వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యుఫోరియా మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ నారా భువనేశ్వరి వెల్లడించారు. మంగళవారం అమరావతిలో నారా భువనేశ్వరి విలేకర్లతో మాట్లాడుతూ.. ఫిబ్రవరి 15వ తేదీ విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరవుతారని చెప్పారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఆహ్వానిస్తామన్నారు.
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు ఎప్పుడు ఏదీ ఆశించలేదని నారా భువనేశ్వరి చెప్పారు. ఆయన కష్టపడి పైకొచ్చిన వ్యక్తి అని గుర్తు చేశారు. అలాంటి ఎన్టీఆర్.. బడుగు, బలహీన వర్గాల కోసం రాజకీయాల్లోకి వచ్చారన్నారు. వారి కోసం రూ.2 కిలో బియ్యం, ఆడ పిల్లలకు ఆస్తి హక్కు చట్టం వంటి వాటిని తీసుకు వచ్చారన్నారు.
అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితోనే సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ట్రస్ట్‌ను స్థాపించారని పేర్కొన్నారు. గత 28 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వ సాయం లేకుండా పలువురికి ఈ ట్రస్ట్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నామని నారా భవనేశ్వరి వివరించారు. ఎవరు పిలువక పోయినా.. తమ ట్రస్ట్ సేవలు అందిస్తుందని పేర్కొన్నారు.
గతంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ వివిధ రూపాల్లో అందించిన సేవలను ఈ సందర్భంగా ఆమె సోదాహరణగా వివరించారు. తలసేమియా బాధితుల సహాయార్దం ఈ ఈవెంట్ చేయనున్నామన్నారు. అలాగే ఈ వ్యాధి భారిన పడిన వారికి సహయ పడేందుకు బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తున్నామన్నారు. రక్తదానం అనేది చాలా మంది ప్రాణాలను నిలబెడుతుందని తెలిపారు.
ఇక ఈ మ్యూజికల్ నైట్ కార్యక్రమం కోసం ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌ను సంప్రదించామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన నగదు సమాజ సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని స్పష్టం చేశారు. అయితే తమ ఈవెంట్‌కు సిఎం అయినా.. డిప్యూటీ సిఎం అయినా టికెట్ కొనుక్కొని రావాల్సిందేనన్నారు. కానీ చిన్న వయస్సులో తనను ఓ వర్క్ హాలిక్‌కి ఇచ్చి పెళ్లి చేశారని.. దీంతో తాను సైతం వర్క్ హాలిక్‌గా మారిపొయానంటూ నారా భువనేశ్వరి చమత్కరించారు. తనకు సంగీతంపై ఎలాంటి అవగాహన లేదని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధాన మిచ్చారు.
For AndhraPradesh News And Telugu News