Share News

నిర్లక్ష్యం!

ABN , Publish Date - Apr 07 , 2025 | 12:44 AM

కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యం కారణంగా విజయవాడ వెస్ట్‌ బైపాస్‌లో నిర్మించిన కీలకమైన ఆర్‌వోబీలు దేనికీ పనికి రాకుండాపోయాయి. చిన్న అవుటపల్లి నుంచి జక్కంపూడి వరకు నిర్మించిన వాటిలో కొన్నింటిని మట్టితో సహా తొలగించి తిరిగి పునర్నిర్మించాల్సిన దుస్థితి ఏర్పడింది. ల్యాంకో విద్యుత లైన్ల అలైన్‌మెంట్‌పై రైతులు న్యాయస్థానాలను ఆశ్రయించటంతో జరుగుతున్న జాప్యం వల్ల కాంట్రాక్టు సంస్థ గుట్టుచప్పుడు కాకుండా ఈ ఆర్‌వోబీలను తొలగించి మళ్లీ పునర్నిర్మిస్తోంది. అదే రైతుల వివాదం లేకపోతే .. గొల్లపూడి వరకు వెస్ట్‌ బైపాస్‌ ఇప్పటికే అందుబాటులోకి వచ్చేది. ఆర్‌వోబీలు కుంగిపోయి పరువు పోయేది. అంతా మంచికే అన్నట్టు రైతుల వివాదం కాస్తా కాంట్రాక్టు సంస్థకు కలిసి వచ్చింది.

నిర్లక్ష్యం!

- విజయవాడ వెస్ట్‌ బైపాస్‌లో కుంగిన కీలక ఆర్‌వోబీలు

- పిన్నమనేని దగ్గర, గన్నవరం, జక్కంపూడిలో తొలగింపు

- రెండు చోట్ల పునర్నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టు సంస్థ

- రైతుల వివాదం నేపథ్యంలో వెలుగు చూడని ఈ వ్యవహారం

- కోర్టు వివాదాలతో జాప్యం.. పునర్నిర్మాణానికి వెసులుబాటు

- అదే ఇప్పటికే ప్రారంభించి ఉంటే.. పరువు పోయేది!

కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యం కారణంగా విజయవాడ వెస్ట్‌ బైపాస్‌లో నిర్మించిన కీలకమైన ఆర్‌వోబీలు దేనికీ పనికి రాకుండాపోయాయి. చిన్న అవుటపల్లి నుంచి జక్కంపూడి వరకు నిర్మించిన వాటిలో కొన్నింటిని మట్టితో సహా తొలగించి తిరిగి పునర్నిర్మించాల్సిన దుస్థితి ఏర్పడింది. ల్యాంకో విద్యుత లైన్ల అలైన్‌మెంట్‌పై రైతులు న్యాయస్థానాలను ఆశ్రయించటంతో జరుగుతున్న జాప్యం వల్ల కాంట్రాక్టు సంస్థ గుట్టుచప్పుడు కాకుండా ఈ ఆర్‌వోబీలను తొలగించి మళ్లీ పునర్నిర్మిస్తోంది. అదే రైతుల వివాదం లేకపోతే .. గొల్లపూడి వరకు వెస్ట్‌ బైపాస్‌ ఇప్పటికే అందుబాటులోకి వచ్చేది. ఆర్‌వోబీలు కుంగిపోయి పరువు పోయేది. అంతా మంచికే అన్నట్టు రైతుల వివాదం కాస్తా కాంట్రాక్టు సంస్థకు కలిసి వచ్చింది.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

విజయవాడ వెస్ట్‌ బైపాస్‌ పనుల్లో అంతులేని నిర్లక్ష్యం చోటు చేసుకుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఈ పనుల్లో అణువణువునా అలసత్వమే రాజ్యమేలుతోంది. గతంలో వేసిన రోడ్డుకు బీటలు వారిన ఘటనలను పలుమార్లు ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకువచ్చింది. తాజాగా ఆర్‌వోబీ(రోడ్డు ఓవర్‌ బ్రిడ్జి)లనే పూర్తిగా తొలగించి మళ్లీ పునర్నిర్మిస్తున్నారంటే ఎంత భారీ స్థాయిలో లోపాలు చోటు చేసుకున్నాయో అర్థమవుతోంది. చిన్న అవుటపల్లి నుంచి జక్కంపూడి వరకు నిర్మించిన ఆర్‌వోబీలు లోపభూయిష్టంగా నిర్మాణాలు జరిగాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తగిన పర్యవేక్షణ లేకపోవటంతో ఆర్‌వోబీల పనులు ఇష్టారాజ్యంగా జరిగాయి. నిర్మించిన ఆర్‌వోబీలు ఎందుకూ పనికి రాకుండా పోయాయి. దీంతో మళ్లీ ఈ ఆర్‌వోబీల పునర్నిర్మాణ పనులను కాంట్రాక్టు సంస్థ చేపడుతోంది. చాలా కీలకమైన, అత్యంత ప్రధానమైన ఆర్‌వోబీలనే తొలగించి పునర్నిర్మించాల్సి వస్తోంది.

అన్ని కీలకమైన ఆర్‌వోబీలే..

పదహారవ నంబర్‌ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-16)కి అనుసంధానంగా కృష్ణాజిల్లా చిన్న అవుటపల్లి నుంచి మొదలయ్యే వెస్ట్‌ బైపాస్‌ పనుల్లోనే నిర్లక్ష్యం చోటు చేసుకుంది. పిన్నమనేని మెడికల్‌ కాలేజీ ఎదురుగా వెస్ట్‌ బైపాస్‌ ప్రారంభమే ఆర్‌వోబీతో మొదలవుతోంది. అతిపెద్ద ఆర్‌వోబీ ఇది. ఈ ఆర్‌వోబీని సరిగా నిర్మించలేదు. దీంతో ఈ ఆర్‌వోబీని మొత్తంగా తొలగించి పునర్నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ ఆర్‌వోబీ దాటిన తర్వాత మర్లపాలెం ఫ్లై ఓవర్‌ వస్తుంది. మర్లపాలెం ఫ్లైఓవర్‌ దాటిన తర్వాత గన్నవరం - నూజివీడు రోడ్డులో గన్నవరం ఆర్‌వోబీ వస్తుంది. ఈ ఆర్‌వోబీని కూడా ఇంతకు ముందే నిర్మించారు. ఈ ఆర్‌వోబీని కూడా ఇప్పుడు పూర్తిగా తొలగించేశారు. పునర్నిర్మాణ పనులు చేపడుతున్నారు. జక్కంపూడి పాముల కాల్వ దగ్గర కూడా ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. ఇంకా ఇక్కడ పునర్నిర్మాణ పనులు చేపట్టలేదు. విజయవాడ వెస్ట్‌ బైపాస్‌లోనే అత్యంత కీలకమైన ఆర్‌వోబీలు ఎందుకు పనికిరాకుండా పోవటం.. వాటిని పునర్నిర్మించాల్సి రావటం పెనుసంచలనంగా మారింది.

పనుల్లో తీవ్ర అలసత్వం

పునర్నిర్మాణం చేస్తున్న ఆర్‌వోబీలన్నీ కూడా బయటకు చొచ్చుకు వచ్చేశాయి. ఇవి కూలి సర్వీసు రోడ్డు మీద పడే పరిస్థితి రావటంతో.. వీటిని గప్‌చుప్‌గా భారీ ఎత్తున ప్రొక్లెయిన్లు, లారీలను సిద్ధం చేసి తొలగించేశారు. ఈ ఆర్‌వోబీలలో వీయూపీ దగ్గర కాంక్రీట్‌ స్లాబ్‌ తప్పితే రెండు వైపులా నిర్మించిన అప్రోచ్‌లు కుంగిపోయాయి. భారీ ఎత్తున కాంక్రీట్‌ పలకలను జాయింట్‌ చేస్తూ నిర్మించిన గోడలు వెలుపలకు తన్నుకువచ్చాయి. ఈ గోడలను నిర్మిస్తున్న దశలోనే మట్టిని నింపి రోలింగ్‌ చేపట్టారు. ఒకవైపు గోడలను నిర్మిస్తున్న దశలోనే మట్టిని బాగా రోడ్డు రోలర్స్‌తో తొక్కించి సమాంతరంగా అటు వాల్‌, ఇటు మట్టి ఫిల్లింగ్‌ను చేపట్టారు. ఈ పనుల్లో నిర్లక్ష్యం చోటు చేసుకుందని తెలుస్తోంది. వాల్‌గా కాంక్రీట్‌ బ్లాక్స్‌ను అనుసంధా నించటంలో కూడా లోపాలు చోటు చేసుకున్నాయని సమాచారం. మట్టిని ఫిల్‌ చేసే విషయంలో కూడా రోలింగ్‌ సరిగా చేయకపోవటంతో అటు వాల్స్‌, ఇటు మట్టి మధ్యన బ్యాలెన్స్‌ తప్పి బయటకు చొచ్చుకువచ్చి కూలటానికి సిద్ధమైనటు సమాచారం.

నిపుణులు ఏమంటున్నారంటే..

విజయవాడ వెస్ట్‌ బైపాస్‌లో కీలకమైన ఆర్‌వోబీలు బయటకు చొచ్చుకురావటం వల్ల తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడటానికి అనేక కారణాలు ఉంటాయని ఇంజినీరింగ్‌ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రధానంగా ఫౌండేషన్‌ సమస్యలు కనిపిస్తున్నాయని, సాయిల్‌ టెస్ట్‌ సరిగా నిర్వహించారా అన్న దానిపై కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బలహీనంగా ఉన్న సాయిల్‌పై ఆర్‌వోబీని నిర్మిస్తే అది కుంగిపోవటానికి అవకాశం ఉంటుందని అంటున్నారు. బలహీనమైన సాయిల్‌ ఈ ప్రాంతాల్లో ఉండి ఉంటే సాయిల్‌ టెస్ట్‌లో తెలిసేదని, దీని ద్వారా దృఢంగా ఆర్‌వోబీ ఏ విధంగా చేపట్టాలన్నది తెలుస్తుందని పేర్కొంటున్నారు. బలహీనమైన పునాదులు వేసినా కూడా ఈ పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉందంటున్నారు. ఈ పునాదుల చుట్టూ వర్షపునీరు చేరినా మెత్తబడి కుంగిపోవటానికి అవకాశం ఉంటుందని, కిందటి సారి కురిసిన భారీ వర్షాల సందర్భంలోనే ఈ ఆర్‌వోబీలలో కుంగుదల సంభవించిందని చెబుతున్నారు. కాబట్టి వర్షపు నీరు వాల్‌ కాంక్రీట్‌ బ్లాక్స్‌ నుంచి లోపలికి చేరి ఉంటుందన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. వాల్స్‌ మధ్యన మట్టిని నింపే సమయంలోనే రెండు వైపులా షీట్స్‌ అమర్చుతారని, ఈ షీట్స్‌ వర్షపు నీటిని లోపలికి చేరనివ్వదని, ఈ ఆర్‌వోబీల డి జైన్ల విషయంలో కూడా లోపాలు చోటు చేసుకున్నాయని భావిస్తున్నారు. తగినంత లోడ్‌ కాలిక్యులేషన్‌ లేకుండా నిర్మించటం వల్ల కూడా ఈ పరిస్థితి వచ్చిందేమోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ పనుల్లో తక్కువ గ్రేడ్‌ కాంక్రీట్‌, మట్టి ఇతర మెటీరియల్స్‌ వాడినా కూడా ఇదే పరిస్థితి ఎదురు కావచ్చునని చెబుతున్నారు. కాంక్రీట్‌ బ్లాక్స్‌ జాయింట్స్‌ దగ్గర సరిగా సీల్‌ వేయకపోవటం వల్ల కూడా సమస్య తలెత్తే ప్రమాదం ఉందని అంటున్నారు. అన్నింటికంటే నిర్వహణ లోపాలు ప్రధాన కారణమన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి.

Updated Date - Apr 07 , 2025 | 12:45 AM