Nellore: జిల్లాలో పర్యటిస్తున్న ఐదుగురు మంత్రులు.. ఏఏ కార్యక్రమాలు ప్రారంభించారంటే..

ABN, Publish Date - Feb 09 , 2025 | 03:42 PM

నెల్లూరు: ఏపీలో 27 వేల కి.మీ. రోడ్లలో వాహనాలు తిరిగే పరిస్థితి లేదని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అవన్నీ పునర్ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 70 శాతం పనులు పూర్తి చేసినట్లు చెప్పారు.

Nellore: జిల్లాలో పర్యటిస్తున్న ఐదుగురు మంత్రులు.. ఏఏ కార్యక్రమాలు ప్రారంభించారంటే..
Atmakur Constituency

నెల్లూరు జిల్లా: ఆత్మకూరు నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఐదుగురు మంత్రుల పర్యటన కొనసాగుతోంది. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, ఎన్‌ఎండీ ఫరూక్‌, సవిత, బీసీ జనార్దన్‌రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆత్మకూరు టిడ్కో హౌసింగ్‌ కాలనీలో శ్రీ సీతారామస్వామివారి ఆలయ నిర్మాణం, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో అతిథి గృహ నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. అలాగే రహదారులు, భవనాల శాఖ నిర్మించిన నూతన అతిథి గృహాన్ని సైతం ప్రారంభించారు. బీసీ సంక్షేమ శాఖ మంజూరు చేసిన బాలికల గురుకుల పాఠశాల ప్రారంభోత్సవంలో ఐదుగురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రసంగించారు.


యువగళం హామీ మేరకు..

ఈ సందర్భంగా మంత్రి రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.."ఆత్మకూరు అభివృద్ధిలో మంత్రులు, ఎంపీ, పార్టీ శ్రేణులు భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంది. ఆత్మకూరు నియోజకవర్గం పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైంది. ఉమ్మడి ఏపీలో జరిగిన అభివృద్ధిని ఒక్కశాతం కూడా వైసీపీ ఎమ్మెల్యేలు ముందుకు తీసుకెళ్లలేకపోయారు. యువగళం పాదయాత్రలో ఆత్మకూరు అభివృద్ధిని పట్టాలెక్కిస్తామని హామీ ఇచ్చాం. ఉమ్మడి ఏపీలో మొదలుపెట్టి నిలిచిన పనులను ముందుగా పూర్తి చేస్తాం. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి సోమశిల ప్రాజెక్ట్ పరిస్థితి అయోమయంగా మారినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీసం ఒక్కతట్ట మట్టీ వేయలేదు. సోమశిలను ఆకస్మిక పర్యటన చేసి సీఎం చంద్రబాబు పరిశీలించారు. సోమశిల హైలెవల్ కెనాల్ పనులు ప్రారంభించమని ఆదేశాలిచ్చారు. అభివృద్ధి అంటే మనం తెల్లచొక్కాలు వేసుకోవడం కాదు. బీసీ రెసిడెన్షియల్ స్కూల్, ఐటీఐ కాలేజీలని మొదలెట్టాం. అమృత్ పథకం కింద రూ.10 కోట్ల నిధులు ఇస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. హౌసింగ్ స్కీమ్ నిధులు గురించి ఎంపీ వేమిరెడ్డి మాట్లాడారు‌. ఏఎస్ పేట దర్గాకి వక్ఫ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ నిధులు ఇస్తామని చెప్పారని" తెలిపారు.


అన్నీ సరిచేస్తున్నాం..

కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సవిత మాట్లాడుతూ.."ఎన్డీయే ప్రభుత్వం బీసీల ప్రభుత్వం. కేంద్ర బడ్జెట్‌లో రూ.36 వేల కోట్లు బీసీలకు కేటాయించారు. ప్రతి ఇంటి నుంచి ఒక ఉత్పత్తిదారుడు రావాలనేది మా ఆకాంక్ష. హైస్కూళ్లలో డైట్ బిల్లుల బకాయిలు పేరుకుపోయాయి. అవన్నీ సరి చేస్తున్నాం. పులివెందులలో సైతం బీసీ హాస్టల్ నిర్వీర్యంగా ఉంది. దాంతోపాటు అన్ని హాస్టళ్లని ముందుకు తీసుకువెళ్తున్నాం. రాబోయే ఏడాది నుంచి అన్ని హాస్టళ్లలో విద్యార్థులకి సన్నబియ్యం అన్నం పెట్టాలని మంత్రి నారా లోకేశ్ భావిస్తున్నారు. ఇవ్వని హామీలనీ సైతం పూర్తి చేస్తున్నాం. వైసీపీ నేతలు ఏదేదో మాట్లాడుతున్నారు. దగ్గర్లోనే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయబోతున్నామని" చెప్పారు.


పునర్ నిర్మాణం చేపట్టాం..

ఏపీలో 27 వేల కి.మీ. రోడ్లలో వాహనాలు తిరిగే పరిస్థితి లేదని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అవన్నీ పునర్ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 70 శాతం పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. వైసీపీ హయాంలో జరిగిన పనులకు సంబంధించిన రూ.2500 కోట్ల నిధులు కూటమి ప్రభుత్వం ఇచ్చినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు నిర్ణయాల వల్లే పెద్ద సంఖ్యలో జాతీయ రహదారులు వచ్చాయని చెప్పారు. బీపీపీ మోడల్ ద్వారా 13 వేల కి.మీ. రోడ్ల వెడల్పు పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు. అలాగే నెల్లూరు జిల్లాలో రోడ్ల కోసం రూ.37 వేల కోట్ల నిధులు కేటాయించినట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు.


వైఎస్ జగన్ వల్లే..

మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ.. "మంత్రి ఆనం అందరితోనూ చర్చించి ఆత్మకూరుకి నిధులు తెస్తున్నారు. టిడ్కో ఇళ్ల వద్ద ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ప్రతి ఒక్క కుటుంబం హాయిగా ఉండాలనే లక్ష్యంతో టిడ్కో ఇళ్లని డిజైన్ చేశాం. ఏపీలో టిడ్కో ఇళ్ల నిర్మాణం తిరిగి మొదలైంది. గత టీడీపీ ప్రభుత్వంలో 4,90,000 టిడ్కో ఇళ్లు టీడీపీ ప్రకటిస్తే జగన్ సర్కార్ వాటిని 2,61,000 కు కుదించింది. వాటిలో మేమే ఎక్కువ భాగం పూర్తి చేశాం. జగన్ ఖజానా ఖాళీ చేసి వెళ్లిపోయారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 15వ పంచవార్షిక నిధులన్నీ మళ్లించేశారు. 2019లో రూ.5,300 కోట్లు ఏషియన్ బ్యాంకులో లోన్ మంజూరు చేయిస్తే, జగన్ నిర్లక్ష్యం వల్ల అవి ఆగిపోయాయి. స్వచ్ఛభారత్, అమృత్ పథకాల నిధులు సైతం వెనక్కిపోయాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సరిచేస్తోంది. ఏపీలో రూ.1,300 కోట్ల నిధులు స్థానిక సంస్థలకి రిలీజ్ చేస్తామని" చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Kerala Temple: మగాళ్లకు మాత్రమే..

Atrocities.. ఎన్టీఆర్ జిల్లా: విద్యార్థినిపై అమానుషం..

Updated Date - Feb 09 , 2025 | 03:45 PM