ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi: ఆంధ్రాకు అండ

ABN, Publish Date - Jan 09 , 2025 | 05:09 AM

ఆంధ్రప్రదేశ్‌ ఆశయాల సాధనకు కేంద్రంలోని తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు.

PM Modi Rally in Vizag

మీ సంకల్పానికి మా సహకారం.. ప్రధాని భరోసా

ఆంధ్రుల ఆశయాల సాధనకు తోడ్పడతాం

బాబు ‘విజన్‌ 2047’కు సంపూర్ణ మద్దతు

ఐటీ, సాఫ్ట్‌వేర్‌ రంగాలకు ఏపీ కేంద్రంగా మారుతోంది

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికాభివృద్ధికి కేంద్రం మద్దతిస్తుంది

దేశంలో రెండు హైడ్రోజన్‌ హబ్‌లు.. ఏపీలో ఒకటి

దక్షిణ మధ్య రైల్వే జోన్‌తో రాష్ట్ర ప్రగతికి ఊతం

విశాఖ సభలో ప్రధానమంత్రి మోదీ భరోసా

రూ.2.08 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

విశాఖపట్నం, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ఆశయాల సాధనకు కేంద్రంలోని తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. చంద్రబాబు ‘విజన్‌-2047’కు సంపూర్ణ సహకారం అందిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. వరుసగా మూడోసారి ప్రధానమంత్రి అయ్యాక తొలిసారి విశాఖపట్నానికి వచ్చిన మోదీ రూ.2.08 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. విభజన హామీల్లో కీలకమైన విశాఖపట్నం రైల్వేజోన్‌తోపాటు గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌, బల్క్‌ డ్రగ్‌ పార్క్‌లకు శంకుస్థాపన చేశారు. పలు రైల్వే, రోడ్డు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో మోదీ ప్రసంగించారు. ‘ఆంధ్ర ప్రజల ప్రేమ, అభిమానానికి నా కృతజ్ఞతలు. మీపట్ల నాకున్న అభిమానం చూపించే అవకాశం ఇప్పుడు లభించింది. ముందుగా సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామికి నమస్కారం’ అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు.

ఆ తర్వాత హిందీలో మాట్లాడారు. ‘‘60ఏళ్ల తర్వాత కేంద్రంలో మూడోసారి వరుసగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రజల ఆశీర్వాదంతోనే ఇది సాధ్యమైంది. రాష్ట్రంలో ఎన్డీయేకు భారీ విజయాన్ని కట్టబెట్టారు. విశాఖపట్నంలో అద్భుత స్వాగతం, రోడ్డు పొడవునా ఆశీర్వాదం ఇవ్వడం సంతోషంగా ఉంది’’ అని మోదీ హర్షం వ్యక్తం చేశారు. అంతకుముందు మాట్లాడిన చంద్రబాబు తన ప్రసంగంలో సిక్స్‌లు కొట్టారని, ఆయన ఒక్కో మాటలో అంశాన్ని గుర్తుంచుకుంటానని తెలిపారు. ఆంధ్రుల ఆకాంక్షలను చంద్రబాబుతో కలిసి నెరవేరుస్తానని మోదీ మాటిచ్చారు. రాష్ట్రం, దేశం ప్రగతి పథంలో ప్రయాణిస్తాయన్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి మా విజన్‌. ఆంధ్రుల సేవ మా సంకల్పం. 2047నాటికి రాష్ట్రం 2 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలన్న విజన్‌తో చంద్రబాబు శ్రమిస్తున్నారు. ఈ ప్రయాణంలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి భుజం కలిపి తోడుగా నిలుస్తుంది’’ అని మోదీ ప్రకటించారు.


కొత్త శిఖరాలకు...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ రాష్ట్రంలో పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ‘‘విశాఖపట్నంలో ఈ రోజు 2లక్షల కోట్లకు పైగా నిధులతో ప్రాజెక్టులు ప్రారంభించాం. దీంతో రాష్ట్రాభివృద్ధి కొత్త శిఖరాలకు చేరుతుంది. ఇక్కడి ప్రజల సృజనాత్మకత వల్ల రాష్ట్రం ప్రగతిశీలకంగా మారింది. ఐటీ, టెక్నాలజీకి ఆంధ్రప్రదేశ్‌ సరికొత్త కేంద్రంగా మారుతుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే గ్రీన్‌ హైడ్రోజన్‌ వైపు అడుగులు వేస్తున్నామన్నారు. 2023లో నేషనల్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌ ప్రారంభించామని... రెండు కేంద్రాల్లో ఒకటి విశాఖకు కేటాయించామని చెప్పారు. భవిష్యత్తులో హైడ్రోజన్‌ ఉత్పత్తిలో విశాఖపట్నం ప్రపంచంతో పోటీ పడుతుందని, గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ ఏర్పాటుతో ఉద్యోగ అవకాశాలు ఆపారంగా ఉంటాయని ప్రధాని తెలిపారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో హబ్‌ ఏర్పాటు చేసే అవకాశం లభించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. పెట్టుబడులకు అనుకూలమైన మూడు రాష్ట్రాల్లో ఆంధ్రపద్రేశ్‌ ఒకటని తెలిపారు. ‘‘రాష్ట్రం పెట్టుబడిదారులకు అనుకూలం. ఫార్మా రంగానికి ఉపయోగం. ఎన్డీయే ప్రభుత్వం పట్టణీకరణ, పారిశ్రామికీకరణకు ప్రాధాన్యం ఇస్తుంది. అందులో భాగంగా క్రిస్‌సిటీ ఏర్పాటు చేస్తున్నాం. చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో భాగమైన ఇందులో భారీగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఇది వేల కోట్ల పెట్టుబడులకు కేంద్రం కాబోతోంది’’ అని ప్రధాన మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీ ఇప్పటికే తయారీ రంగం దూసుకుపోతోందని, ఉత్పత్తి రంగంలో దేశంలో అగ్రస్థానంలో నిలబడేలా రాష్ట్రానికి మరింత సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. సెల్‌ఫోన్ల తయారీలో ప్రపంచంలోనే ఉన్నతమైన స్థానంలో భారత దేశం ఉందని సంతోషం వ్యక్తం చేశారు.

రైల్వే జోన్‌తో...

విశాఖపట్నంలో సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌కు శంకుస్థాపన చేశామని... ప్రత్యేక జోన్‌ కావాలన్న ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతోందని ప్రధాని పేర్కొన్నారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి రైల్వేజోన్‌ ఎంతో కీలకం. వ్యవసాయ, వ్యాపార, పర్యాటక రంగాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఏపీలో వందశాతం రైల్వే లైన్ల విద్యుదీకరణ జరిగింది. వందే భారత్‌ రైళ్లతోపాటు అమృత్‌ భారత్‌ సర్వీసులు రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. మౌలిక సదుపాయాల విప్లవంతోపాటు మెరుగైన కనెక్టివిటీతో ఏపీ ముఖచిత్రం మారబోతోంది. ఇప్పుడు ప్రారంభించిన పనులు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతాయి’’ అని ప్రధాని పేర్కొన్నారు. ‘బ్లూ ఎకానమీ’ని (సముద్ర వాణిజ్యం) మిషన్‌ మోడ్‌లో వినియోగించుకుంటామని ప్రధాని తెలిపారు. ఏపీలో మత్సకారుల ఆదాయం పెరిగేందుకు నిబద్ధతతో పని చేస్తున్నామని అన్నారు. మత్స్యకారులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు, సముద్రంలో రక్షణ కోసం చర్యలు చేపట్టామన్నారు. విశాఖపట్నం ఫిషింగ్‌ హార్బర్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. అభివృద్ధిలో అందరినీ కలుపుకొని వెళ్తామన్నారు. ‘‘అభివృద్ధి అన్ని రంగాల్లో జరగాలి. ఫలాలు అందరికీ అందాలి. నేడు ప్రారంభించిన ప్రాజెక్టులు ఏపీ ప్రజల భవిష్యత్తు, శ్రేయస్సుకు తోడ్పాడు అందించబోతున్నాయి’ అంటూ ప్రసంగాన్ని ముగించారు.

Updated Date - Jan 09 , 2025 | 07:42 AM