Railway Zone : ‘రైల్వే జోన్ డీపీఆర్’
ABN , Publish Date - Jan 07 , 2025 | 06:40 AM
ఉత్తరాంధ్ర ప్రజలు నాలుగు దశాబ్దాలుగా కోరుకుంటున్న ప్రత్యేక రైల్వే జోన్‌కు ప్రధాని నరేంద్రమోదీ బుధవారం శంకుస్థాపన చేయనున్నారు.
ఆలస్యంగా నడుచుచున్నది!.. ఐదేళ్లయినా దరిచేరని వైనం
జోన్ ప్రధాన కార్యాలయానికి రేపు ప్రధాని మోదీ శంకుస్థాపన
ఈలోగా అనుమతి లభించేనా?.. ఇక్కడ పనులు మొదలవకుండానే
రాయగడ డివిజన్‌కు భూమిపూజ.. వాల్తేరు డివిజన్‌పైనా సందేహాలే
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఉత్తరాంధ్ర ప్రజలు నాలుగు దశాబ్దాలుగా కోరుకుంటున్న ప్రత్యేక రైల్వే జోన్‌కు ప్రధాని నరేంద్రమోదీ బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. అయితే దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)కు రైల్వే బోర్డు ఆమోదం తెలపకపోవడం గమనార్హం. మరోవైపు విశాఖలో దక్షిణ కోస్తా జోన్‌కు శంకుస్థాపన జరగక ముందే ఈ ప్రక్రియలో భాగంగా ఏపీ నుంచి విడదీసిన కొన్ని ప్రాంతాలతో కలిపి కొత్తగా రాయగడ డివిజన్ ఏర్పాటు చేయబోతున్నారు. భవన నిర్మాణానికి టెండర్లు పిలిచారు. దాని నిర్మాణానికి ప్రధాని మోదీ సోమవారం ఆన్‌లైన్‌లో శంకుస్థాపన చేశారు. ఇక్కడ కూడా ఒడిశా రాజకీయ నాయకులు తమ ఆధిపత్యం చాటుకున్నారు. విశాఖలో జోన్ కార్యాలయం శంకుస్థాపనకు రెండు రోజుల ముందే ఒడిశాలో కొత్త డివిజన్‌కు శంకుస్థాపన జరిగిపోయింది. విశాఖపట్నానికి దక్షిణ కోస్తా జోన్ ఇస్తూ.. ప్రస్తుతం విశాఖ కేంద్రంగా నడుస్తున్న వాల్తేరు రైల్వే డివిజన్‌ను రద్దు చేస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే, వాల్తేరు డివిజన్‌కు ఓ ప్రత్యేకత ఉంది. దేశంలో 70కి పైగా డివిజన్లు ఉండగా 12 వేల మంది ఉద్యోగులతో ఆదాయపరంగా మొదటి పది స్థానాల్లో ఈ డివిజన్ నిలుస్తోంది. ఇక్కడ కొత్తవలస-కిరండోల్(కేకే) లైన్ ద్వారా ఖనిజాల రవాణాతో అధిక ఆదాయం సమకూరుతోంది.
వాల్తేరు డివిజన్ రద్దు చేస్తే విశాఖ కేంద్రంగా ఏర్పాటయ్యే జోన్‌కు ఉనికే ఉండదు. ఇదే విషయాన్ని ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు కేంద్ర మంత్రి, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు, విశాఖ ఎంపీ శ్రీభరత్‌లు ఢిల్లీ పెద్దలకు చేరవేశారు. దీంతో వాల్తేరు డివిజన్ కొనసాగింపు విషయాన్ని పరిశీలిస్తామని హామీ లభించింది. కానీ, దీనిలో కేకే లైన్ ఉండకపోవచ్చని, దానిని రాయగడ డివిజన్‌కు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం జరిగే బహిరంగ సభలో వాల్తేరు డివిజన్‌ను కొనసాగించే విషయంపైనా, కేకే లైన్‌ను అందులోనే కొనసాగించే విషయంపైనా ప్రకటన చేయాలని ఉత్తరాంధ్ర ప్రజలు కోరుతున్నారు. వాస్తవానికి ఈ శంకుస్థాపన చేసే సమయానికే జోన్ డీపీఆర్‌కు రైల్వే బోర్డు ఆమోదముద్ర వేయాలి. రైల్వే స్థాయీ సంఘం చైర్మన్‌గా ఉన్న అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ ఈ మేరకు చొరవ తీసుకోవలసిన అవసరం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇదే కాకుండా జోన్ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తూ, కార్యకలాపాలను కూడా తక్షణమే ప్రారంభించేలా ‘ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ’(ఓఎ్‌సడీ) కింద దక్షిణ కోస్తా జోన్‌కు జనరల్ మేనేజర్‌ను నియమించాలి. అవసరమైనన్ని భవనాలు అందుబాటులో ఉన్నందున కార్యకలాపాలు కూడా ప్రారంభిస్తే బాగుంటుందని విశాఖ ప్రజలు భావిస్తున్నారు.