Polavaram Banakacherla Linkage Project: బహుళార్థ సాధకంగా బనకచర్ల

ABN, Publish Date - Mar 25 , 2025 | 03:35 AM

పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకాన్ని ఒక మోడల్‌ ప్రాజెక్టుగా రూపకల్పన చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ ప్రాజెక్టు ద్వారా సాగు, తాగునీటి అదేవిధంగా విద్యుత్, మత్స్య సంపద ద్వారా ఆదాయం సృష్టించాలనీ, కేంద్రంతో ఆర్థిక సాయం కోసం సంప్రదింపులు జరిపే ప్రక్రియను వివరించారు

Polavaram Banakacherla Linkage Project: బహుళార్థ సాధకంగా బనకచర్ల
  • ఆదాయార్జన ప్రాజెక్టుగా రూపుదిద్దాలి: సీఎం చంద్రబాబు

  • రాష్ట్రానికి వరదాయిని కావాలి.. జూన్‌ 12కల్లా టెండర్లు ఖరారు చేయాలి

  • ‘జలహారతి’ పేరుతో ఎస్‌పీవీ ఏర్పాటు.. అధికారులకు చంద్రబాబు ఆదేశం

  • ఈ ప్రాజెక్టుతో ఏటా రూ.12,294 కోట్ల రాబడి అంచనా

అమరావతి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకాన్ని కేవలం సాగు, తాగునీటిని అందించే ప్రాజెక్టుగానే కాకుండా.. విద్యుత్‌, మత్స్య సంపద వంటి వాటి ద్వారా ఆదాయాన్ని సమకూర్చే ‘మోడల్‌ ప్రాజెక్టు’గా రూపకల్పన చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సోమవారం సచివాలయంలో జల వనరుల శాఖ అధికారులతో ప్రాజెక్టు కార్యచరణపై ఆయన సమీక్షించారు. రూ.81,900 కోట్ల అంచనా వ్యయంతో కూడిన ఈ భారీ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం కోసం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. జూన్‌ 12కల్లా టెండర్లు ఖరారు చేయాలన్నారు. ‘ఈ ప్రాజెక్టుకు ఏటా 3,340 మెగావాట్ల విద్యుత్‌ అవసరం. ప్రాజెక్టు కాలువ గట్ల మీద.. నీటిలో తేలియాడే సోలార్‌ ప్యానెళ్ల బిగింపు.. జల విద్యుత్కేంద్రాలు, పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్కేంద్రాల ఏర్పాటు ద్వారా 5 వేల మెగావాట్లు ఉత్పత్తి చేయాలి. తద్వారా బహుళార్థ సాధక ప్రాజెక్టుగా మార్చాలి. అవసరమైన డిజైన్ల అనుమతులన్నీ నవంబరుకల్లా సాధించాలి.


పర్యావరణ అటవీ అనుమతుల టెర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌ (టీవోఆర్‌)ను పరివేశ్‌ పోర్టల్‌లో నెలాఖరులోగా అప్‌లోడ్‌ చేయాలి. ప్రజాభిప్రాయ సేకరణను డిసెంబరులో ప్రారంభించి వచ్చే జనవరి కి పూర్తి చేయాలి. స్టేజ్‌-1 క్లియరెన్సులను ఆగస్టునాటికి, స్టేజ్‌-2 క్లియరెన్సులను నవంబరు నాటికి పొందాలి. అన్ని రకాల అనుమతులూ వచ్చే మార్చినాటికి సాధించాల్సిందే’ అని తేల్చిచెప్పారు.నిర్మాణానికి ‘జలహారతి’ కార్పొరేషన్‌ పేరుతో ఎస్‌పీవీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కాగా ఈ పథకంతో ఏటా రూ.12,294 కోట్ల దాకా రాబడి వస్తుందని జల వనరుల శాఖ అంచనా వేసింది.


For AndhraPradesh News And Telugu News

Updated Date - Mar 25 , 2025 | 03:37 AM