ఉపాధి పనులలో అవతకలకు పాల్పడిన వారిపై చర్యలు
ABN , Publish Date - Apr 03 , 2025 | 11:39 PM
జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకంలో చేసిన పనులలో అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని డ్వామాపీడీ జోసఫ్ కుమార్ తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గురువారం ఉపాధి పథకంలో 2023-2024 ఆర్థిక సంవత్సరంలో జరిగిన పనులపై సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు.

సామాజిక తనిఖీలో
డ్వామా పీడీ జోసఫ్ కుమార్
మార్కాపురం రూరల్, ఏప్రిల్3 (ఆంధ్రజ్యోతి): జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకంలో చేసిన పనులలో అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని డ్వామాపీడీ జోసఫ్ కుమార్ తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గురువారం ఉపాధి పథకంలో 2023-2024 ఆర్థిక సంవత్సరంలో జరిగిన పనులపై సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డ్వామా పీడీ జోసఫ్ కుమార్‌కు సామాజిక తనిఖీ బృందం పనులు, వేతనాల చెల్లింపులను వివరించారు. ఈ సందర్భంగా పీడీ జోసఫ్ కుమార్ మాట్లాడుతూ ఎన్‌ఆర్‌ఈజీఎ్‌సలో చేసిన పనుల కొలతలలో కొన్ని గ్రామ పంచాయతీలలో వ్యత్యాసం వచ్చినట్లు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. గతంలో తీసిన గుంతలో వర్షపు నీరు నిల్వ ఉండటం వలన కూడా లోతు, పొడవు, వెడల్పులలో వ్యత్యాసం వచ్చాయని తెలిపారు. కొన్ని గ్రామ పంచాయతీలలో మస్టర్ రోల్‌లో కొట్టి వేతలు వేసి వేతన చెల్లింపులు జరిగినట్లు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. ఈ మధ్య కాలంలో ఫీల్డ్ అసిస్టెంట్‌లు మారడం వలన పాత ఫీల్డ్ అసిస్టెంట్‌లు రికార్డులను సక్రమంగా అందజేయకపోవడం కొంత సమస్యగా ఉందని తెలిపారు. మండల పరిధిలో 540 పనులకు గాను 10 కోట్ల 16 లక్షల 83 వేల 261 రూపాయలు కూలీలకు వేతనాలు, 1 కోటి 65 లక్షల69 వేల 613 రూపాయలు వర్కు మెటీరియల్ మొత్తం కలిపి 11 కోట్ల 82 లక్షల 52 వేల 874 రూపాయల పనులు 2023-2024 ఆర్థిక సంవత్సరంలో పనుల జరిగినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఏపీడీ వండర్‌మాన్, ఎంపీడీవో శ్రీనివాసులు, ఉద్యానశాఖ అధికారి రమేష్, ఏపీవో జీవరత్నం, సామాజిక తనిఖీ ప్రతినిధులు, ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స సిబ్బంది పాల్గొన్నారు.