Share News

పోరాటయోధుడా.. వందనం

ABN , Publish Date - Apr 14 , 2025 | 11:09 PM

నాడు తెలుగుప్రజలు తమిళ భాషా పాలనలో తీవ్ర ఇబ్బందులతో పాటు ఎన్నో అవమానాలను ఎదుర్కొనేవారు. ఏ పని కావాలన్నా అప్పటి రాజధాని మద్రాసుకు వెళ్లి రావడం తెలుగు ప్రజలకు వ్యయప్రయాసలతో కూడుకోవడంతో అల్లాడిపోయేవారు. ఢిల్లీలోని నాటి కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు కూడా తెలుగువారి కష్టాలను పట్టించుకునేవారు కాదు. అటువంటి పరిస్థితుల్లో ఒకేఒక్కడు తెలుగుతేజం.. ఢిల్లీలోని కేంద్ర పీఠాన్ని కదిలించాడు.. ఆయనే మనం అమరజీవిగా పిలుచుకుంటున్న పొట్టి శ్రీరాములు.

పోరాటయోధుడా..  వందనం
పడమటిపల్లిలో పొట్టి శ్రీరాములు విగ్రహం

ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలు త్యజించిన అమరజీవి

రేపు పొట్టి శ్రీరాములు జయంతి

పీసీపల్లి, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): నాడు తెలుగుప్రజలు తమిళ భాషా పాలనలో తీవ్ర ఇబ్బందులతో పాటు ఎన్నో అవమానాలను ఎదుర్కొనేవారు. ఏ పని కావాలన్నా అప్పటి రాజధాని మద్రాసుకు వెళ్లి రావడం తెలుగు ప్రజలకు వ్యయప్రయాసలతో కూడుకోవడంతో అల్లాడిపోయేవారు. ఢిల్లీలోని నాటి కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు కూడా తెలుగువారి కష్టాలను పట్టించుకునేవారు కాదు. అటువంటి పరిస్థితుల్లో ఒకేఒక్కడు తెలుగుతేజం.. ఢిల్లీలోని కేంద్ర పీఠాన్ని కదిలించాడు.. ఆయనే మనం అమరజీవిగా పిలుచుకుంటున్న పొట్టి శ్రీరాములు.

తమిళనాడు నుంచి ఆంధ్రాను విడగొట్టి తెలుగువారి కోసం ఒక రాష్ట్రం ఏర్పాటు చేయాలంటూ 58రోజుల పాటు ఆమరణ దీక్ష చేపట్టి ఆత్మబలిదానం చేసుకున్నాడు. ఆయన ఆత్మ బలిదానంతో ఆంధ్రరాష్ట్రం సిద్ధించింది. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రకాశం జిల్లాలోని పీసీపల్లి మండలం పడమటిపల్లిలో జన్మించాడు. ఆయన 125వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వేడుకలను నిర్వహిస్తుంది.

భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటులో మార్గదర్శి

ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటులో ఆయన వేసిన బాట ఎన్నటికీ మర్చిపోలేనిది. అప్పటి నెల్లూరు, ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని పీసీపల్లి మండలం పడమటిపల్లి అనే మారుమూల గ్రామంలో పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న జన్మించారు. 20ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఆయన విద్యాభ్యాసం మద్రాసులోనే సాగింది. తరువాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగ్‌ విద్య పూర్తిచేసి రైల్వేశాఖలో ఉద్యోగిగా చేరారు. అక్కడ నాలుగేళ్ల పాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. ఈక్రమంలో జాతిపిత గాంధీజీ బాటలో నడిచిన ఆయన 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. కొంతకాలం జైలుశిక్ష అనుభవించారు. 1941-42 క్విట్‌ ఇండియా ఉద్యమం వరకు అనేక ఉద్యమాల్లో పాలుపంచుకున్నారు. ఈక్రమంలో భాషా ప్రాతిపదికన తెలుగువారికోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలంటూ 1952 అక్టోబరు 19న మద్రాసులో నిరాహారదీక్ష ప్రారంభించారు. పొట్టి శ్రీరాములు ప్రారంభించిన దీక్ష క్రమేణ ప్రజల్లో అలజడి రేపింది. రోజలు గడిచేకొద్దీ ప్రజలు శ్రీరాములుకు మద్దతుగా సమ్మెలు, ప్రదర్శనలు జరిపారు. అప్పటి కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆంధ్రరాష్ట్రం ఏర్పాటుదిశగా విస్పష్ట ప్రకటన చేయలేదు. రోజురోజుకూ ఆరోగ్యం క్షణిస్తున్నా పొట్టి శ్రీరాములు మాత్రం దీక్షను విరమించలేదు. 1952 డిసెబరు 15న ఆరోగ్యం విషమించి పొట్టి శ్రీరాములు బలిదానం అయ్యారు. దీంతో కేంద్రం దిగివచ్చి తెలుగువారికోసం ఆంరఽధరాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది.


పడమటిపల్లిలో ఆర్యవైశ్య కుటుంబంలో జన్మించిన ఆయన ఆంధ్రరాష్ట్రం కోసం అశువులు బాసి దేశవ్యాప్తంగా తెలుగువారికి కీర్తిని సంపాదించారు. నెల్లూరు జిల్లాలో ఆయన ఎక్కువకాలం ఉండడం, ప్రకాశం జిల్లా ఏర్పడక ముందు పడమటిపల్లి గ్రామం నెల్లూరు జిల్లాలో ఉండడంతో పొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లాకు చెందినవారుగా రికార్డుకెక్కారు. పొట్టి శ్రీరాములు సొంత గ్రామం పడమటిపల్లిలో 2013లో ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అప్పటి తమిళనాడు గవర్నర్‌ రోశయ్యను తీసుకొచ్చి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. పాలేరునదిపై పాలేటిపల్లి వద్ద నిర్మించిన పాలేటిపల్లి రిజర్వాయర్‌కు పొట్టి శ్రీరాములు రిజర్వాయర్‌గా 2013లో డాక్టర్‌ ఉగ్ర నామకరణం చేశారు.

Updated Date - Apr 14 , 2025 | 11:09 PM