దాతలకు ప్రేరణ.. పేదలకు చేయూత
ABN , Publish Date - Apr 02 , 2025 | 01:18 AM
ప్రభుత్వం చేపట్టిన పీ-4 కార్యక్రమ నిర్వహణలో కీలకమైన దాతలకు ప్రేరణ, పేదలకు భరోసానివ్వ డంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కొత్తగొల్ల పాలెం కార్యక్రమం సఫలీకృతమైంది. గతంలో వలే భారీ ప్రసంగం లేకుండా నిర్ధిష్ట విధానంతో నిర్వహిం చడం ప్రజలకు ఉల్లాసాన్నిచ్చింది.

పర్చూరు నియోజకవర్గ అభివృద్ధికి నిర్దిష్ట హామీలు
పాలన, పార్టీ వ్యవహారాల్లో ఎమ్మెల్యే ఏలూరికి కితాబు
గొల్లపాలెంలో వినూత్నంగా సాగిన సీఎం చంద్రబాబు కార్యక్రమం
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
ప్రభుత్వం చేపట్టిన పీ-4 కార్యక్రమ నిర్వహణలో కీలకమైన దాతలకు ప్రేరణ, పేదలకు భరోసానివ్వ డంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కొత్తగొల్ల పాలెం కార్యక్రమం సఫలీకృతమైంది. గతంలో వలే భారీ ప్రసంగం లేకుండా నిర్ధిష్ట విధానంతో నిర్వహిం చడం ప్రజలకు ఉల్లాసాన్నిచ్చింది. గ్రామంలో పూర్తి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల స్థితిగతులను వారి ద్వారానే బహిరంగపర్చి చేయూతనిచ్చే దాతలకు ప్రేరణనిచ్చేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేసంద ర్భంగా నియోజకవర్గంలో పార్టీ, పాలనాపరమైన వ్యవ హారాల్లో ఎమ్మెల్యే ఏలూరి పాత్రకు చంద్రబాబు కితాబిస్తూ ఆయన ఇచ్చిన సమస్యల చిట్టా చదువుతూనే కొన్ని పనులకు నిర్దిమైన హామీలు ఇచ్చారు. మరికొన్నింటిని దాటవేశారు. తొలుత సీఎం హోదాలో గ్రామస్థులతో మమేకమైన ఆయన చివర్లో పార్టీ అధి నేత హోదాలో శ్రేణులతో మమేకమయ్యారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం ఉమ్మడి జిల్లాలోని పర్చూరు నియోజకవర్గంలోని కొత్తగొల్లపాలెంకు చంద్రబాబు వచ్చారు.
పీ-4 కార్యక్రమంపై అవగాహన
గతంలో వలే పింఛన్ల పంపిణీకే చంద్రబాబు పరిమితం కాకుండా కొత్తగా ప్రభుత్వం చేపట్టిన పీ-4 కార్యక్రమం తీరుతెన్నులను ప్రజలకు తెలిపే ప్రయత్నం చేశారు. గ్రామంలో 996 మంది ఉండగా అందులో 17మందికి మరుగుదొడ్లు, 13 మందికి గృహాలు, 30మందికి పింఛన్లు, ఒకరికి రేషన్‌కార్డు, నాలుగు గృహాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందని గుర్తించారు. వారందరికీ ఆ సౌకర్యాలన్నీ కల్పించాలనీ అక్కడే ఉన్న కలెక్టర్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఆ తర్వాత గ్రామంలో బాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పది కుటుంబాలను అధికారులు గుర్తించగా వారిని వేదికపైకి పిలిచి మాట్లాడారు. అందులో వెంకాయమ్మ అనే మహిళ తనకు భర్త లేడని, పిల్లలిద్దరూ పెద్దవారైనా కూలి పనులకు వెళ్లక తప్పడం లేదని చెబుతూ తాను క్యాన్సర్‌తో పడుతున్న ఇబ్బందిని విడమర్చి చెప్పారు. అలాగే అంకమ్మ అనే మరో మహిళ భర్త విద్యుత్ షాక్‌తో చనిపోగా తన కుమారుడైన వెంకటేష్‌ను చదివించేందుకు పడుతున్న బాధలను వివరించారు. ఇలా ఐదారు కుటుంబాల వారిని పిలిచి వారితో మాట్లాడి పేదల సమస్యలు ఎలా ఉంటాయో అర్ధం చేసుకోండంటూ ప్రజానీకానికి చంద్రబాబు వివరించారు. ఒక మహిళ ‘నేను ఈరోజో రేపో రాలిపోతా... కానీ నా అల్లుడు అర్ధంతరంగా మరణించాడు. ఆ బాధతో నా కుమార్తె పక్షవాతానికి గురైంది. వారిద్దరి పిల్లలు చేయూత లేక తల్లడిల్లుతున్నారు. ఈ వయస్సులో కుటుంబాన్ని ఈదలేకపోతున్నానంటూ’ చెప్పిన మాటలతో సీఎం చలించిపోయారు. ఇదే కుటుంబ అనుబంధం అంటూ ఆయన వారికి చెబుతూ.. మాట్లాడిన మహిళలు తమకోసం కాక పిల్లల కోసం చేస్తున్న అభ్యర్థనలు విని చేయూతనిచ్చే మార్గదర్శకులు(దాతలు) ముందుకు రావాలని కోరారు. అదేవేదిక మీద ముందుగా గుర్తించిన విక్రమ్ నారాయణ(గొనసపూడి), ఇంకొల్లు మండలం గొల్లపాలెంకు చెందిన ఆంజనేయులు అనే పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి పీ-4 కార్యక్రమంలో మార్గదర్శి-బంగారు కుటుంబం అనేది మా నినాదం అంటూ వారికి వివరించారు. పారిశ్రామికంగా వారు ఎదిగిన విధానాన్ని స్వగ్రామాల్లో వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను తెలుసుకుని, ఈ పేదలను ఆదుకునేందుకు ముందుకు రావాలని బహిరంగంగా కోరారు. అప్పటికే పేదల మాటలతో చలించిపోయిన ఆ వ్యాపారవేత్తలిద్దరూ సీఎం ఇచ్చిన స్ఫూర్తితో ఆ కుటుంబాలను దత్తత తీసుకునేందుకు హామీ ఇచ్చారు. తలా 15 కుటుంబాలను ఆర్థికంగా ఉన్నత స్థాయిలోకి తెచ్చే విధంగాచేయాలని సూచిస్తూ తదనుగుణంగా ఆ పారిశ్రామికవేత్తలకు సేవా పుస్తకాలతో సన్మానిస్తానని ప్రకటించారు. ఒక మహిళ కుమారుడైన గణేష్‌ను చదివించే బాధ్యత విక్రమ్‌నారాయణకు అప్పగిస్తూ, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న మహిళ చికిత్సకు ప్రభుత్వపరంగా పూర్తి ఆర్థిక సహాయం ఇవ్వాలని కలెక్టర్‌ను అక్కడికక్కడే ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయా సందర్భాల్లో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఇప్పటికే ఆ గ్రామంలోని పలువురు పేదలకు తన ట్రస్టు ద్వారా ఇస్తున్న చేయూతను, వైద్య చికిత్సను ప్రస్తావిస్తూ కొనియాడారు.
పోర్టు కోసం కేంద్రంతో మాట్లాడతా
అదే కార్యక్రమంలో చివర్లో ఎమ్మెల్యే ఏలూరి అందించిన సమస్యల చిట్టాలోని ప్రధాన అంశాలను ప్రస్తావించారు. మోటుపల్లి వద్ద పోర్టు నిర్మాణానికి సాంకేతిక అనుమతులు లభిస్తే కేంద్రంతో మాట్లాడి ఏర్పాటు చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. అలాగే అనుబంధ పరిశ్రమలను తీసుకొస్తానని ప్రకటించారు. అలాగే ఎమ్మెల్యే ఇచ్చిన సమస్యల చిట్టాను చదువుతూ నాలుగు కొత్త ఎత్తిపోతలకు, 32 పాత ఎత్తిపోతల పఽథకాల నిర్వహణకు అవసరమైన నిధులు సమకూర్చుతానని హామీ ఇచ్చారు. సాగర్ కాలువ ఆధునికీకరణతోపాటు కేడబ్ల్యూడీ ఆయకట్టు పరిధిలో ఆయకట్టు అభివృద్ధి, డైనేజీ సమస్య పరిష్కారానికి రూ.5 కోట్లు మంజూరు చేస్తానని ప్రకటించారు. రోడ్లు, వంతెనలు ఇతరత్రా అనేక సమస్యల పరిష్కారానికి పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. గుంటూరు చానల్ పొడిగింపు విషయంలో ఇప్పటికే సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
అగ్రస్ధానంలో పర్చూరు:
పాలనే కాక రాజకీయ వ్యవహారాలు, పార్టీపరమైన వ్యవహారాల్లో కూడా పర్చూరు నియోజకవర్గం అగ్రస్థానంలో ఉందని చంద్రబాబు కొనియాడారు. హెలిప్యాడ్‌కు సమీపంలో ఏర్పాటుచేసిన వేదిక వద్ద నియోజకవర్గ టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆయన భేటీ అయ్యారు. ఎమ్మెల్యే ఏలూరితోపాటు మంత్రులు గొట్టిపాటి రవికుమార్, సత్యప్రసాద్, ఇన్‌చార్జి మంత్రి పార్ధసారధి, బాపట్ల లోక్‌సభ టీడీపీ అధ్యక్షుడు రాజశేఖర్ కూడా పాల్గొన్నారు. నియోజకవర్గంలోని 15మంది పార్టీ నాయకులను పేరుపేరున ప్రస్తావిస్తూ సీఎం అభినందించారు. వరుసగా మూడుసార్లు టీడీపీ గెలుపునకు కీలకపాత్ర పోషించిన ఎమ్మెల్యే ఏలూరి చరిత్ర తిరగరాశాడని కొనియాడారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఒక కార్యక్రమంలో కలిసిన ఏలూరి తన అభిమాని అని, అందుకే పనితీరులో తనను అనుసరిస్తూ అహర్నిశలు కష్టపడుతున్నారని తెలిపారు. పార్టీ నిర్మాణ వ్యవహారాల్లో రాష్ట్రంలో తొలి మూడు స్దానాల్లో నియోజకవర్గం ఉందన్నారు. వ్యక్తిగతంగా ఏలూరికి 100కు 88 పైబడి మార్కులు తెచ్చుకున్నారన్నారు. పర్చూరు నియోజకవర్గ అభివృద్ధికి పూర్తిస్ధాయిలో తోడ్పడతానని చంద్రబాబు హామీ ఇచ్చారు.